త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Liquor Tragedy | కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, ‘బాంబే విస్కీ’ బ్రాండ్‌పై అనుమానాలు!

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం తీవ్ర విషాదం నింపింది. ప్రాణాంతకమైన మద్యం తాగి 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

J

Crime | Published On Sep 6, 2026, 12.50 pm IST

MP Liquor Tragedy | కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, ‘బాంబే విస్కీ’ బ్రాండ్‌పై అనుమానాలు!

సంక్షిప్త సారాంశం

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. 'బాంబే విస్కీ' పేరుతో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు అధికారులకు ముందే ఫిర్యాదులు అందాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆరు లిక్కర్ షాపులను సీజ్ చేసిన అధికారులు, పరిసర గ్రామాల్లో మెడికల్ స్క్రీనింగ్ చేపట్టారు.

Advertisement

MP Liquor Tragedy | మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రాన్ని కల్తీ మద్యం ఘటన ఉలిక్కిపడేలా చేసింది. సాగర్ (Sagar) జిల్లాలో ప్రాణాంతకమైన విషపూరిత మద్యం తాగి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన విచారణ ప్రారంభించారు. బాధిత గ్రామాల్లో మెడికల్ స్క్రీనింగ్ (medical screening) ముమ్మరం చేయడంతో పాటు, ముందుజాగ్రత్తగా ఆరు మద్యం దుకాణాలను సీజ్ చేశారు.

ఈ విషాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) తీవ్రంగా స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించిన ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత ప్రాంతాల్లో వెంటనే పర్యటించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు.

నకిలీ మద్యంపై ముందే ఫిర్యాదులున్నా..

ఈ మరణాలతో జిల్లాలో అక్రమ, నకిలీ మద్యం విక్రయాలపై మరోసారి చర్చ మొదలైంది. స్థానిక రిపోర్టుల ప్రకారం.. 'బాంబే విస్కీ' (Bombay Whisky) పేరుతో నకిలీ మద్యం అమ్ముతున్నారని కొద్దిరోజుల క్రితమే ఓ మద్యం కాంట్రాక్టర్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ మీటింగ్‌లోనూ లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లు ఈ నకిలీ మద్యంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

భయపెడుతున్న లక్షణాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. చర్మం నీలం రంగులోకి మారడం (cyanosis), కండరాలు బిగుసుకుపోవడం లాంటి లక్షణాలున్నాయన్నారు. నౌరా, గుగ్రు గ్రామాల్లో ప్రత్యేక వైద్య బృందాలు, ఎస్‌డీఎం (SDM) టీమ్స్ ఇంటింటికి వెళ్లి హెల్త్ స్క్రీనింగ్ (health screening) చేస్తున్నాయి. అనుమానాస్పద మద్యం సేవించిన వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

గడిచిన 24-48 గంటల్లో ఎవరైనా మద్యం తాగి వాంతులు, తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాలని అధికారులు ప్రజలను కోరారు. ఇది మిథైల్ ఆల్కహాల్ (methyl alcohol) పాయిజనింగ్ కావచ్చని ఛీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దేవేష్ పటేరియా అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన కారణాలు పోస్ట్‌మార్టం (post-mortem), ఫోరెన్సిక్ రిపోర్టులు (forensic reports) వచ్చాకే తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి అనుమానం ఉన్న 6 లిక్కర్ షాపులను సీజ్ చేసి, శాంపిల్స్ టెస్టింగ్ కోసం పంపారు. అసలు ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సప్లై చేశారు? మరణాలకు కల్తీ మద్యమే కారణమా లేక వేరే ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
Advertisement