త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ghaziabad sisters suicide | ముగ్గురు అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్నది ‘కొరియన్ లవర్’ గేమేనా?

ఆన్‌లైన్ గేమ్ మోజులో పడి ముగ్గురు అక్కచెల్లెళ్లు దారుణ నిర్ణయం తీసుకున్నారు. 'బ్లూ వేల్' తరహాలోనే ప్రమాదకరమైన 'కొరియన్ లవర్' గేమ్ ఆడుతూ, 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. గదిలో దొరికిన సూసైడ్ నోట్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే..

J

Crime | Published On Feb 4, 2026, 4.48 pm IST

Ghaziabad sisters suicide | ముగ్గురు అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్నది ‘కొరియన్ లవర్’ గేమేనా?
Advertisement

Ghaziabad sisters suicide | త్రినేత్ర.న్యూస్ : మీకు బ్లూ వేల్ ఛాలెంజ్(Blue Whale Challenge) గుర్తుందా? 2013 లో అప్పుడప్పుడే సోషల్ మీడియా మొదలవుతున్న రోజుల్లోనే ఈ చాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013లో రష్యాలో ప్రారంభమైన ఈ డేంజరస్ గేమ్ బారిన పడి భారత్‌లోనూ పలువురు టీనేజర్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రమాదకరమైన టాస్కులు చేస్తూ ఆ టాస్కులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షూట్ చేసి వాళ్లు పంపించిన లింక్స్ ద్వారా పంపిస్తూ ఉంటే టాస్కులు పూర్తి చేసినట్లు లెక్క. దీన్ని అప్పట్లో సూసైడ్ చాలెంజ్ లేదా సూసైడ్ గేమ్ అని కూడా పిలిచేవాళ్లు. ఇప్పుడు అలాంటిదే కొరియన్ లవర్ గేమ్ అనే డేంజరస్ గేమ్‌కి బానిస అయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ ప్రాణాలను తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదకర గేమ్స్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. జెన్ జెడ్ వీటికి బానిసలవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా, ఏఐ యుగంలో ఇలాంటి డేంజరస్ గేమ్స్ కుప్పలుగా పుట్టుకొస్తున్నాయి. బ్లూ వేల్ తర్వాత మోమో చాలెంజ్ అనే గేమ్ కూడా కొన్ని రోజులు అలజడి సృష్టించింది. తాజాగా కొరియన్ లవర్ గేమ్ (Korean Lover Game).

కొరియన్ లవర్ గేమ్ వల్లనే సూసైడ్

తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఘజియాబాద్‌లోని భరత్ సిటీ సొసైటీలో నివసిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు - నిషిక (16), ప్రాచి (14), పాఖీ (12) - బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో తమ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకారు. తీవ్ర గాయాలపాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గురు బాలికలు గత కొంతకాలంగా 'కొరియన్ లవర్ (Korean Lover Game)' అనే ఆన్‌లైన్ టాస్క్-బేస్డ్ గేమ్‌కు (Task-based game) తీవ్రంగా బానిసలయ్యారు. ఈ గేమ్ కొరియన్ పాప్ కల్చర్ (K-Pop) ఆధారంగా రూపొందించబడిందని, ఇందులో ప్లేయర్లకు 50 రకాల టాస్క్‌లు ఇస్తారని సమాచారం. ఇది గతంలో వచ్చిన ప్రమాదకరమైన 'బ్లూ వేల్' గేమ్ తరహాలోనే చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఉందని అనుమానిస్తున్నారు.

కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

ఘటనా స్థలంలో పోలీసులు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో రాసిన మాటలు వారి మానసిక స్థితిని అద్దం పడుతున్నాయి.

"సారీ నాన్న.. మేము కొరియాను వదిలి రాలేము. కొరియాయే మా జీవితం. మీరు మమ్మల్ని అక్కడి నుంచి వేరు చేయలేరు. అందుకే మేము చనిపోతున్నాము. మేము భారతీయులం కాదు, కొరియన్లం.." అని ఆ లేఖలో రాసి ఉంది. తాము కొరియన్ యువరాణులమని, ఆ ప్రపంచంలోనే బతుకుతున్నామని వారు భ్రమపడ్డారు. కరోనా సమయం నుంచి వారు ఈ గేమ్‌కు అలవాటు పడ్డారని, ఎప్పుడూ గదిలో తలుపులు వేసుకుని ఫోన్లలో గడిపేవారని తల్లిదండ్రులు వాపోయారు.

ఫైనల్ టాస్క్

ఈ గేమ్ రూల్స్ ప్రకారం.. వాళ్లు ఇండియన్స్‌లా కాకుండా కొరియన్స్‌లా బతకాలి. వాళ్ల భాష, వాళ్ల ఫుడ్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కొరియన్స్‌లా ఉండాలి. దానికి సంబంధించిన ప్రూఫ్స్‌ను ఫోటోలు, వీడియోలుగా తీసి వాళ్లకు పంపించాలి. అప్పుడే వాళ్ల ఒక్కో టాస్క్ పూర్తవుతూ వస్తుంది. వాళ్లకు వాళ్లు కొరియన్ యువరాణుల్లా భావించుకుంటారు. వాళ్లు కొరియాలోనే ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. తాము కొరియన్లుగా ఆ యాప్‌లో పరిచయం అయిన వాళ్లు ఏ టాస్క్ చెబితే ఆ టాస్క్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కో టాస్క్ పూర్తి చేస్తూ ఫైనల్ టాస్క్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల విషయంలోనూ అదే జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తమ ఫైనల్ టాస్క్‌లో భాగంగానే వీళ్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రులకు హెచ్చరిక

అసలు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారు? ఏ గేమ్స్ ఆడుతున్నారు? వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించడంలో ఫెయిల్ అవుతున్నారు. పిల్లలను పట్టించుకోకుండా వాళ్లకు ఫోన్ ఇచ్చి తమ పనులు చేసుకుంటున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. అందుకే పిల్లల ప్రవర్తన, వాళ్లు ఫోన్లలో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే వాటిని తల్లిదండ్రులు నిశితంగా గమనించాలని పోలీసులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఘజియాబాద్ లాంటి ఘటనలు భవిష్యత్తులో జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement