త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digital Arrest Scam | రూ.27 ల‌క్ష‌ల మోసానికి సైబ‌ర్ నేర‌స్థుల ఎర‌.. మ‌హిళ‌ను ర‌క్షించిన బ్యాంకు సిబ్బంది..

Digital Arrest Scam | దేశంలో రోజు రోజుకీ సైబ‌ర్ నేరాలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దుండ‌గులు ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి లేదా మోసాల‌కు గురి చేసి భారీ ఎత్తున డబ్బులు కాజేస్తున్నారు. పోలీసులు, ప్ర‌భుత్వాలు, బ్యాంకులు ప్ర‌జ‌ల‌ను ఎంత హెచ్చరించినా కొంద‌రు ఇంకా ఈ మోసాల బారిన ప‌డుతున్నారు.

S

Crime | Published On Dec 28, 2025, 3.35 pm IST

Digital Arrest Scam | రూ.27 ల‌క్ష‌ల మోసానికి సైబ‌ర్ నేర‌స్థుల ఎర‌.. మ‌హిళ‌ను ర‌క్షించిన బ్యాంకు సిబ్బంది..
Advertisement

Digital Arrest Scam | దేశంలో రోజు రోజుకీ సైబ‌ర్ నేరాలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దుండ‌గులు ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి లేదా మోసాల‌కు గురి చేసి భారీ ఎత్తున డబ్బులు కాజేస్తున్నారు. పోలీసులు, ప్ర‌భుత్వాలు, బ్యాంకులు ప్ర‌జ‌ల‌ను ఎంత హెచ్చరించినా కొంద‌రు ఇంకా ఈ మోసాల బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో భారీ మోసం వెలుగులోకి వ‌చ్చింది. చిత్రమేమిటంటే బ్యాంకు సిబ్బంది జోక్యంతో అదృష్ట‌వ‌శాత్తూ బాధితురాలు డబ్బులు పోలేదు. ఈ సంఘ‌ట‌న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న స‌బ‌ర్మ‌తి బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బ్రాంచిలో చోటు చేసుకుంది. ఓ వృద్ధ మ‌హిళ రూ.27 ల‌క్ష‌లు న‌ష్ట‌పోకుండా బ్యాంకు సిబ్బంది జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించి సైబ‌ర్ మోసాన్ని అడ్డుకున్నారు.

మ‌హిళ ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం..

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స‌బ‌ర్మ‌తి బ్రాంచ్‌కు ఇటీవ‌ల‌ ఓ వృద్ధ మ‌హిళ వ‌చ్చి త‌న ఫిక్స్‌డ్ డిపాజిట్లు అన్నింటినీ క్లోజ్ చేసింది. వాటితోపాటు సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని ఓ వ్య‌క్తికి పంపించాల‌ని బ్యాంకు సిబ్బందిని కోరింది. మొత్తం రూ.27 ల‌క్ష‌ల‌ను ఆమె పంపించాల‌నుకున్న‌ట్లు తెలిపింది. అయితే ఆమె ముఖ క‌వ‌ళిక‌లు, ప్ర‌వ‌ర్త‌న‌, ఆమె న‌గ‌దు పంపించాల‌నుకున్న అవ‌త‌లి వ్య‌క్తి వివ‌రాలను తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు. ముఖ్యంగా బ్యాంకులో క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తున్న హ‌ర్ష‌ద్ పార్మ‌ర్ అనే వ్య‌క్తి ఆ మ‌హిళ అసాధార‌ణ ప్ర‌వ‌ర్త‌న‌ను గుర్తించి వెంట‌నే బ్యాంకు మేనేజ‌ర్ దిలీప్ చౌహాన్‌కు విష‌యం చెప్పాడు. దీంతో ఆయ‌న క‌ల‌గ‌జేసుకుని ఆమె నుంచి వివ‌రాల‌ను రాబట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఆమె ఎలాంటి వివ‌రాల‌ను చెప్ప‌లేదు. కానీ ఏదో మోసం జ‌ర‌గ‌బోతుంది అన్న విష‌యాన్ని మాత్రం బ్యాంకు సిబ్బంది ప‌సిగట్టారు. దీంతో వారు వెంట‌నే అహ్మ‌దాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ క్ర‌మంలో ఏసీపీ హార్దిక్ మ‌కాడియా, ఇత‌ర సైబర్ క్రైమ్ సెల్ సిబ్బంది బ్యాంకుకు చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు.

డిజిట‌ల్ అరెస్టు స్కాం అని..

అయితే చాలా సేపు ఆ మ‌హిళ‌కు న‌చ్చ‌జెప్పిన అనంత‌రం ఆమె అస‌లు విష‌యాన్ని తెలియ‌జేసింది. ఆమెకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వ‌చ్చింద‌ని, కొంద‌రు ఆ మెసేజ్ గురించి కాల్స్ కూడా చేశార‌ని చెప్పింది. ఢిల్లీ యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్ పేరిట సీనియ‌ర్ అధికారుల‌మ‌ని చెబుతూ కొంద‌రు త‌న‌కు ఫోన్ కాల్స్ చేశార‌ని ఆమె తెలిపింది. త‌న ఫోన్ నుంచి పాకిస్థాన్‌కు భార‌త ఆర్మీకి చెందిన 21 రహ‌స్యాల వివ‌రాలు, వాటి ఫొటోలు వెళ్లాయ‌ని, ఇది రూ.50 కోట్ల‌కు చెందిన స్కామ్ అని చెప్పి త‌న‌ను భ‌య‌పెట్టార‌ని ఆ మ‌హిళ పోలీసుల‌కు తెలిపింది. దీంతో అస‌లు విష‌యం ప‌సిగ‌ట్టిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అది డిజిట‌ల్ అరెస్టు స్కాం అని చెప్ప‌డంతో ఆ మ‌హిళ ఊపిరి పీల్చుకుంది. ఈ క్ర‌మంలో అప్ప‌టి వ‌రకు ఆమె కాల్ చేసిన దుండగులు కూడా త‌మ బండారం బ‌య‌ట ప‌డుతుంద‌న్న భ‌యంతో విష‌యాన్ని ప‌సిగట్టి వెంట‌నే ఆమెకు కాల్స్ చేయ‌డం ఆపేశారు. దీంతో అదంతా మోస‌మ‌ని ఆ మ‌హిళకు కూడా నిర్దార‌ణ అయింది. ఈ క్ర‌మంలో ఆమె బ్యాంకు సిబ్బంది, పోలీసుల‌కు కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

ఇది 5వ సంఘ‌ట‌న‌..

ఇక ఇలాంటి స్కామ్‌లు జ‌ర‌గ‌డం ఇదేమీ కొత్త కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది బాధితులు ఇలాంటి మోసాల్లో కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకున్నారు. అయితే ఈ సంఘ‌ట‌న‌లో మాత్రం బ్యాంకు సిబ్బంది అల‌ర్ట్ అయి ఆ మ‌హిళ డ‌బ్బు న‌ష్ట‌పోకుండా ర‌క్షించారు. కాగా ఈ నెల‌లో ఇలా బ్యాంకు సిబ్బంది అల‌ర్ట్ అయి బాధితుల‌ను ర‌క్షించ‌డం ఇది 5వ సార‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌జ‌లు కూడా ఇలాంటి మోసాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అస‌లు ఫోన్‌లో అరెస్టు చేయ‌డం ఉండ‌ద‌ని, ఏదైనా స‌మ‌స్య ఉంటే అధికారులు లేదా పోలీసులు నేరుగా నిందితులు లేద బాధితుల ఇళ్ల‌కు వ‌స్తార‌ని, క‌నుక ఇలా ఎవ‌రైనా ఫోన్ చేస్తే న‌మ్మ‌వ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement