త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!

Retail Inflation | సామాన్యుడి బడ్జెట్‌పై ధరల భారం మరింత ప‌డుతోంది. ముఖ్యంగా కూరగాయల ధరలు మండిపోవడంతో దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.54 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో నమోదైన 4.83 శాతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

P

Business | Published On Oct 12, 2026, 8.15 pm IST

Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!
Advertisement
  • సెప్టెంబర్‌లో 5.54 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
  • ఆర్బీఐ లక్ష్యం కంటే వరుసగా నాలుగో నెలా అధికం..
  • గ్రామీణ ప్రాంతాల్లో మరింత ధరాఘాతం..
  • 6.08 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
  • ద్రవ్యోల్బణ అంచనా 5.2 శాతానికి పెంపు

Retail Inflation | సామాన్యుడి బడ్జెట్‌పై ధరల భారం మరింత ప‌డుతోంది. ముఖ్యంగా కూరగాయల ధరలు మండిపోవడంతో దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.54 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో నమోదైన 4.83 శాతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మధ్యకాలిక ద్రవ్యోల్బణ లక్ష్యమైన 4 శాతాన్ని మించి వరుసగా నాలుగో నెలా ధరల పెరుగుదల నమోదైంది. 2024 బేస్‌ ఇయర్‌తో సవరించిన వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) సిరీస్‌ ప్రకారం.. 2026లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ద్రవ్యోల్బణ స్థాయి కావడం గమనార్హం.

అంచనాలను మించి..

జూన్‌లో 4.38 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో 4.45 శాతానికి, ఆగస్టులో 4.83 శాతానికి చేరింది. తాజాగా సెప్టెంబర్‌లో మరింత పెరిగి 5.54 శాతానికి ఎగసింది. రాయిటర్స్‌ నిర్వహించిన 41 మంది ఆర్థికవేత్తల సర్వేలో సెప్టెంబర్‌ ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉండొచ్చని అంచనా వేయగా.. వాస్తవ గణాంకాలు అంతకంటే అధికంగా నమోదయ్యాయి. ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరల పెరుగుదల ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా నిలిచింది.

పల్లెల్లో ధరల సెగ అధికం

పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఆగస్టులో 5.24 శాతంగా ఉన్న గ్రామీణ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 6.08 శాతానికి చేరింది. ఇదే సమయంలో పట్టణ ద్రవ్యోల్బణం 4.31 శాతం నుంచి 4.88 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరల ప్రభావం ఎక్కువగా ఉండటం, వ్యవసాయ ఉత్పత్తులపై వాతావరణ పరిస్థితుల ప్రభావం వంటి అంశాలు ఈ వ్యత్యాసానికి కారణమవుతున్నాయి. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం కూడా ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎల్‌నినో పరిస్థితులు, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్ర‌మాదం ఉండ‌డంతో వ్యవసాయ దిగుబ‌డుల‌పై అనిశ్చితిని పెంచుతోంది. దీంతో ఆహార ధరల నుంచి మొదలైన ఒత్తిడి ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకూ విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రెపో రేటు పెంచిన ఆర్బీఐ

పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 7, 2026న రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆర్బీఐ పాలసీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. 2025లో మొత్తం 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించిన కేంద్ర బ్యాంకు.. అనంతరం వరుసగా నాలుగు సమీక్షల్లో 5.25 శాతం వద్దే కొనసాగించింది. ద్రవ్యోల్బణం కొద్దిపాటి వస్తువులకే పరిమితం కాకుండా మరిన్ని విభాగాలకు విస్తరిస్తోందని ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఆగస్టులో 4 శాతానికి మించి ధరల పెరుగుదల నమోదైన వస్తువుల వెయిటెడ్‌ వాటా దాదాపు 37 శాతానికి చేరినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణంపై ప్రజల అంచనాలు పెరుగుతుండటం, కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే ధోరణి కూడా ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతున్నాయని ఎంపీసీ అభిప్రాయపడింది.

5.2 శాతానికి వార్షిక అంచనా

ధరల ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి (FY27) రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాను ఆర్బీఐ 5 శాతం నుంచి 5.2 శాతానికి పెంచింది. త్రైమాసికాల వారీగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 6 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 5.7 శాతానికి చేరవచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2027–28 తొలి త్రైమాసికానికి ఈ అంచనాను 5.6 శాతంగా నిర్ణయించింది. అయితే, దేశంలో తగినంత ఆహార ధాన్యాల నిల్వలు ఉండటం, ప్రభుత్వం సకాలంలో పరిపాలనా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. అయినప్పటికీ కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు అదుపులోకి రాకపోతే సామాన్య కుటుంబాల ఖర్చులు మరింత పెరిగే అవకాశముంది. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు, రెపో రేటు పెంపు, వార్షిక అంచనాల సవరణ.. రానున్న నెలల్లోనూ ధరల కట్టడిపై ఆర్బీఐకి సవాళ్లు కొనసాగనున్నాయని స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
Advertisement