త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | విద్యారంగానికి నిధులు పెరిగేనా..? గత ఐదేళ్లలో ఈ రంగానికి దక్కింది ఎంత..?

Union Budget 2026 | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం (ఫిబ్రవరి) ఒకటిన బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌లో విద్యారంగానికి కీలక ప్రకటనలు చేస్తారని అంచనాలున్నాయి.

P

Business | Published On Jan 31, 2026, 2.15 pm IST

Union Budget 2026 | విద్యారంగానికి నిధులు పెరిగేనా..? గత ఐదేళ్లలో ఈ రంగానికి దక్కింది ఎంత..?
Advertisement

Union Budget 2026 | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం (ఫిబ్రవరి) ఒకటిన బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌లో విద్యారంగానికి కీలక ప్రకటనలు చేస్తారని అంచనాలున్నాయి. గత ఐదేళ్లలోనూ కేంద్ర బడ్జెట్‌లో నిధులు పెరుగుతూ వచ్చాయి. ఈ సారి సైతం అంతకంటే ఎక్కువగా కేటాయింపులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, గత ఐదేళ్లలో విద్యారంగానికి మోదీ సర్కారు ఎంత నిధులు కేటాయించింది.. ఏ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారో ఓ సారి తెలుసుకుందాం..!

గత ఐదేళ్లలో కేటాయింపులు ఇలా..

2021–22 ఆర్థిక సంవత్సరంలో : రూ.93,224.31 కోట్లు
2022–23 ఆర్థిక సంవత్సరంలో : రూ.1,04,277.72 కోట్లు
2023–24 ఆర్థిక సంవత్సరంలో : రూ.1,12,899.47 కోట్లు
2024–25 ఆర్థిక సంవత్సరంలో : రూ.1,48,000 కోట్లు
2025–26 ఆర్థిక సంవత్సరంలో : రూ.1,28,650.05 కోట్లు

2021-22 బడ్జెట్‌లో కొత్త పాఠశాలల ఏర్పాటుకు..

2021 ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి కేంద్రం రూ.93,224 కోట్లు కేటాయించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2.1శాతం బడ్జెట్‌ పెరిగింది. జాతీయ విద్యావిధాన్ని (NEP) అమలులో భాగంగా కొత్త పాఠశాలల ఏర్పాటు.. లేహ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర నిర్ణయాలను బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఆ ఏడాది పాఠశాల విద్యకు రూ.54,874 కోట్లు కేటాయించగా, ఇది గత ఏడాది కంటే 2.2 శాతం అధికం. ఉన్నత విద్యకు రూ.38,351 కోట్లు కేటాయించగా. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 1.9 శాతం నిధులు పెరిగాయి.

2022-23 సంవత్సరంలో..

2022–23 ఆర్థిక సంవత్సరానికి విద్యాశాఖకు రూ.1.04 లక్షల కోట్ల బడ్జెట్‌ లభించింది. 2021–22 సవరించిన అంచనాలతో పోలిస్తే 18.5 శాతం పెరుగుదల. విద్యా రంగంలో ప్రవేశాన్ని విస్తరించడమే ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యంగా ఆ సమయంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పాఠశాల విద్యకు రూ.63,449.37 కోట్లు కేటాయించగా.. గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే 22.1 శాతం పెరిగింది. ఉన్నత విద్యకు రూ.40,828 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే 13.3 శాతం అధికం. మోడల్‌ స్కూల్స్‌, ఉపాధ్యాయ శిక్షణ, ఎంపిక చేసిన సంస్థల్లో స్కాలర్‌షిప్‌లకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది కేంద్రం.

2023–24 విద్యా బడ్జెట్‌ ఇలా..

2023లో ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీకి కేంద్రం రూ.1,12,899 కోట్లను కేటాయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 13 శాతం పెరుగుదల కాగా, ప్రభుత్వ మొత్తం అంచనా వ్యయంలో ఇది 2.9 శాతంగా నమోదైంది. సమగ్ర శిక్షా అభియాన్‌కు ప్రత్యేకంగా రూ.37,453 కోట్ల నిధులు ఆర్థిక మంత్రి కేటాయించారు. పాఠశాల విద్యకు రూ.68,805 కోట్లు కేటాయించగా.. ఇది 16.5 శాతం పెరుగుదల కనిపించింది. ఉన్నత విద్యకు రూ.44,095 కోట్లు కేటాయించారు. అలాగే, ఎకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 38 వేల మందికిపైగా ఉపాధ్యాయులను నియమించనున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు.

2024–25 విద్యా బడ్జెట్‌ ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఎయిమ్స్‌ ప్రకటన

2024 ఆర్థిక సంవత్సరంలో స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద సుమారు 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించారు. ఈ కాలంలో ఉన్నత విద్య రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 15 ఎయిమ్స్‌, ఏడు ఐఐఎంలను ప్రారంభించారు. చదువుతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రకటన చేశారు.

2025–26 విద్యా బడ్జెట్‌..

2025–26 కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.1,28,650.05 కోట్లను కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.65 శాతం పెరుగుదల. అయితే 2024–25లో విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలకు కలిపి మొత్తం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించగా.. అందులో సుమారు రూ.1.21 లక్షల కోట్లు పాఠశాల, ఉన్నత విద్యకే వినియోగించారు. గత ఐదేళ్లలో విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. నూతన విద్యా విధానం అమలు, మౌలిక వసతుల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు కేంద్రం పెద్దపీట వేసింది. ఈ సారి బడ్జెట్‌లో కేంద్రం విద్యారంగానికి బడ్జెట్‌ పెంచుతుందా? కొత్తగా ఏమైనా ప్రకటనలు చేస్తారా? అన్న ఆసక్తి నెలకొన్నది.

Advertisement

తాజావార్తలు

Advertisement