త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

“ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది…!” – గొంతు నులిమిన ఖాకీ… పౌరుల హక్కుల అసలు నిజాలు

సమాజానికి రక్షణగా నిలవాల్సిన 'ఖాకీ' పౌరుల హక్కులపై దాడికి తెగబడితే, ఆ నిశ్శబ్దం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. హక్కుల కోసం రోడ్లెక్కిన యువత గొంతును 'ఖాకీ' చెయ్యి నులమడం శక్తుల ప్రదర్శన కాదు... చట్టాన్ని చుట్టంచేసుకున్న అహంకారానికి పరాకాష్ఠ.

S

Crime | Published On Aug 28, 2026, 4.07 pm IST

“ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది…!” – గొంతు నులిమిన ఖాకీ… పౌరుల హక్కుల అసలు నిజాలు

సంక్షిప్త సారాంశం

రోడెక్కిన విద్యార్థి గొంతును 'ఖాకీ' చెయ్యి నులిమేసిన దృశ్యం యావత్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాజ్యాంగం స్వేచ్ఛను ఇస్తే... 'ఖాకీ' వ్యవస్థ లాఠీలతో సమాధానం చెప్పడం సుప్రీంకోర్టు తీర్పులను, నూతన BNSS చట్టాలను కాలరాయడమే. గొంతు నొక్కితే ఆగేది కేవలం ఊపిరి మాత్రమే... రేపటి తరం తిరుగుబాటును ఆపగలదా ?

Advertisement

       రక్షణగా ఉండాల్సిన 'ఖాకీ' బాధ్యత మరిస్తే... చట్టం మౌనంగా చూస్తూ ఊరుకోదు!

 

"నా గొంతు పట్టుకుని వెనక్కి నెడుతుంటే ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది..." - ఇవీ మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతూ, పోలీసు అధికారి చేతిలో దౌర్జన్యానికి గురైన ఒక డిప్లొమా విద్యార్థి ఆవేదనతో చెప్పిన మాటలు. నిరుద్యోగ నిరసనలో పాల్గొన్న ఆ యువకుడి గొంతును ఒక పోలీసు అధికారి దారుణంగా నులుముతూ నెట్టేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "రేపు ఇది మా భవిష్యత్తు కూడా అయ్యే అవకాశం ఉంది" అంటూ వేలాది మంది యువత, విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు సీఐ రఘుపతిరెడ్డిపై శాఖాపరమైన విచారణకు అధికారులు ఆదేశించారు. కేవలం మహబూబాబాద్ మాత్రమే కాదు, ఇటీవల పలు జిల్లాల్లో 'జెన్ జెడ్' (Gen Z) యువత, నిరుద్యోగులపై పోలీసులు ప్రవర్తించిన దురుసు తీరు పెద్ద ఎత్తున నిరసన జ్వాలలను రగిలిస్తోంది. 'రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఇలా దాడి చేస్తే మేం ఎవరికి చెప్పుకోవాలి?' అనే ప్రశ్నే ఈనాటి క్రైమ్ స్టోరీకి మూలం!

రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ఖకీ బూట్లు కాలరాయవచ్చా?

మన రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా ప్రతి పౌరుడికీ శాంతియుతంగా సమావేశమయ్యే, నిరసన తెలిపే హక్కును ప్రసాదించింది. అలాగే ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరూ గౌరవంగా, స్వేచ్ఛగా జీవించే హక్కును కలిగి ఉన్నారు. నిరసన తెలిపే విద్యార్థి గొంతు పట్టుకోవడం లేదా బహిరంగంగా పౌరులను కొట్టడం రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కులను నేరుగా ఉల్లంఘించడమే!

ప్రముఖ మానవ హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్నట్లు... "ఎక్కడో ఒకచోట జరిగే అన్యాయం, ప్రతిచోటా ఉన్న న్యాయానికి తీవ్రమైన ముప్పు". ఈరోజు అక్కడ ఒక విద్యార్థికి జరిగిన అన్యాయంపై మనం గొంతు విప్పకపోతే, రేపు ఆ అన్యాయం మన ఇంటి ముందరికే వస్తుంది.

పోలీసు మాన్యువల్ ఏం చెబుతోంది? కొట్టే, తిట్టే హక్కు పోలీసులకు ఉందా?

చట్ట ప్రకారం పౌరులను కొట్టడానికి లేదా బూతులు తిట్టడానికి పోలీసులకు ఏమాత్రం హక్కు లేదు!

లాఠీలు ఎందుకు ఇచ్చారంటే?: లాఠీ అనేది కొట్టి హింసించడానికి ఇచ్చిన ఆయుధం కాదు. అదుపుతప్పిన గుంపును వెనక్కి నెట్టడానికి (Crowd Control), లేదా ఆత్మరక్షణకు మాత్రమే ఇచ్చిన సాధనం.

తిట్టడం నేరం: పౌరులను దుర్భాషలాడటం పోలీసు ప్రవర్తనా నియమావళి ప్రకారం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం.

లాఠీ ఛార్జ్ ప్రొటోకాల్: తీవ్రమైన అల్లర్లు జరిగితేనే, ఉన్నతాధికారులు లేదా మేజిస్ట్రేట్ ఆదేశాలతో (అత్యవసర వేళల్లో నోటిమాటగా లేదా సాధ్యమైనంతవరకు రాతపూర్వకంగా) 'కనీస బలం' వాడాలి. లాఠీతో కొట్టినా అది కాళ్ళ కింద భాగానికే పరిమితం కావాలి. తల, గొంతు, ఛాతీపై కొట్టడం చట్టవిరుద్ధం.

తుపాకీ ప్రయోగం: ప్రాణాలకే ముప్పు వచ్చే అత్యంత తీవ్రమైన పరిస్థితిలో, చివరి ఆప్షన్‌గా మాత్రమే మోకాళ్ళ కిందకు కాల్పులు జరపాలి.

అల్లర్ల సమయంలో పోలీసులు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో పనిచేస్తుంటారు. కానీ, ఆ ఒత్తిడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి లేదా హద్దులు మీరడానికి సాకు కానేకాదు.

కొత్త చట్టాలు – BNSS, BNS ఏం చెబుతున్నాయి?

నూతనంగా వచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) , భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం:

కనీస బలం (Minimum Force): ఎంత తక్కువ బలాన్ని ఉపయోగిస్తే అంత మంచిది. అంతకుమించి వాడితే అది పోలీసు అధికారులే నేరం  చేసినట్లు అవుతుంది.

థర్డ్ డిగ్రీ (కస్టడీలో కొట్టడం) నిషేధం: విచారణ పేరుతో లేదా స్టేషన్‌లో పెట్టి శారీరకంగా, మానసికంగా హింసించడం సంపూర్ణంగా నిషేధం. అలా చేస్తే సదరు అధికారిపైనే క్రిమినల్ కేసు పెట్టవచ్చు.

సుప్రీంకోర్టు కఠిన తీర్పులు

చారిత్రాత్మక 'డి.కే. బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్' కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది:

"చట్టాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే చట్టాన్ని ఉల్లంఘిస్తే, అది తీవ్ర చట్టరాహిత్యానికి దారితీస్తుంది. విచారణ పేరుతో జరిగే హింస జీవించే హక్కును కాలరాయడమే."

అలాగే 'రామ్‌లీలా మైదాన్ (2012)', 'అనితా ఠాకూర్ (2016)' కేసుల్లో... శాంతియుత నిరసనకారులపై విచక్షణా రహితంగా బలప్రయోగం చేయడం చట్టవిరుద్ధమని, పోలీసులు ప్రయోగించే బలం వారు ఎదుర్కొంటున్న పరిస్థితికి తగినంత (Proportional) మాత్రమే ఉండాలని కోర్టు తేల్చిచెప్పింది.

బాధితులు లేదా యువత ఏం చేయాలి?

పోలీసులు హద్దులు మీరితే భయపడకూడదు. చట్టపరంగా కింద పేర్కొన్న విధంగా అడుగులు వేయండి:

1. ఆధారాలు దాచుకోండి: దాడి జరిగితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది MLC (మెడికో-లీగల్) సర్టిఫికెట్ తీసుకోండి. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను భద్రపరచుకోండి.

2. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి: జిల్లా ఎస్పీ (SP) లేదా కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండి. అలాగే 'స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ' (PCA) , మానవ హక్కుల కమిషన్‌కు (SHRC) ఫిర్యాదు చేయవచ్చు.

3. కోర్టు తలుపు తట్టండి (BNSS సెక్షన్ 223): పోలీసులు FIR నమోదు చేయకపోతే, మీ వద్ద ఉన్న ఆధారాలతో లాయర్ ద్వారా నేరుగా మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు (Private Complaint) దాఖలు చేయవచ్చు. కోర్టు విచారించి ఆ పోలీసు అధికారిపై కేసు నమోదుకు ఆదేశిస్తుంది. ప్రాథమిక హక్కు భంగపడితే నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయవచ్చు.

గొంతు నులమబడ్డా కూడా గొంతు విప్పండి…

ఖాకీ ఆధిపత్యం ముందు మీ హక్కులు నలిగిపోతుంటే భయంతో మౌనంగా ఉండిపోకండి. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని ప్రదర్శించండి, కానీ ఆ పోరాటం ఖచ్చితంగా చట్టం, రాజ్యాంగం చూపిన శాంతియుత మార్గంలోనే సాగాలి. గుర్తుంచుకోండి... రాజ్యాంగం ఎల్లప్పుడూ పౌరుల పక్షానే ఉంటుంది!

Advertisement
Advertisement