త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajesh Exports Scam | హర్షద్ మెహతా కంటే పెద్ద స్కామ్: రూ.15 లక్షల కోట్ల బోగస్ లెక్కలతో దొరికిపోయిన ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’

దలాల్ స్ట్రీట్‌ను వణికిస్తున్న అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణం! రూ.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించిన 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్'పై సెబీ కొరడా ఝుళిపించింది.

J

Business | Published On Jun 4, 2026, 5.50 pm IST

Rajesh Exports Scam | హర్షద్ మెహతా కంటే పెద్ద స్కామ్: రూ.15 లక్షల కోట్ల బోగస్ లెక్కలతో దొరికిపోయిన ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’
Advertisement
  • ప్రముఖ జ్యువెలరీ రిటైల్ సంస్థ 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్'పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) సంచలన చర్యలు 
  • గత ఐదేళ్లలో ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల బూటకపు ఆదాయాన్ని చూపించి ఇన్వెస్టర్లను మోసం చేసిందని సెబీ నిర్ధారణ
  • దీంతో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, దాని ప్రమోటర్ రాజేష్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి సెబీ బ్యాన్
  • ఈ దెబ్బతో కంపెనీ షేర్లు పాతాళానికి పడిపోయాయి
  • ఇందులో 10.8% వాటా ఉన్న ఎల్ఐసీ (LIC)కి, సామాన్య ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టం

Rajesh Exports Scam | త్రినేత్ర.న్యూస్ : భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో బహుశా ఇదే అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణం కావొచ్చు. 1992 నాటి హర్షద్ మెహతా స్కామ్ (సుమారు రూ. 5,000 కోట్లు) కంటే ఎన్నో రెట్లు పెద్ద మోసం ఇది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ జ్యువెలరీ రిటైల్ దిగ్గజం 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్' (Rajesh Exports) ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించి ఇన్వెస్టర్లను, దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను నిలువునా ముంచేసింది.

ఈ ఆర్థిక అవకతవకలపై లోతైన విచారణ జరిపిన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), జూన్ 3న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీతో పాటు దాని ప్రమోటర్ అయిన రాజేష్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

రూ. 15.15 లక్షల కోట్ల మిస్టరీ ఇదే!

సెబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. FY21 నుంచి FY25 మధ్య కాలంలో, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తన మొత్తం ఆదాయంలో 97 నుంచి 99 శాతం విదేశీ అనుబంధ సంస్థల నుంచే వస్తోందని ప్రకటించింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందిన 'వాల్‌క్యాంబి' (Valcambi SA) అనే గోల్డ్ రిఫైనరీ నుంచి లక్షల కోట్లు వస్తున్నాయని బ్యాలెన్స్ షీట్‌లో చూపించింది.

అయితే, సెబీ నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు స్విట్జర్లాండ్‌లోని అసలు రికార్డులను పరిశీలించగా.. ఆ సంస్థ వాస్తవ ఆదాయం కేవలం రూ. 3,027 కోట్లు మాత్రమేనని తేలింది. కానీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మాత్రం రికార్డుల్లో రూ. 15,18,413 కోట్లు వచ్చినట్లు కట్టుకథలు అల్లింది. అంటే దాదాపు 99.80 శాతం ఆదాయానికి ఎలాంటి ఆధారాలు లేవు. అంతా పేపర్ల మీద సృష్టించిన మాయాజాలమే!

ఆఫ్రికా గోల్డ్ మైన్, ఫేక్ ట్రేడింగ్..

సెబీ దర్యాప్తులో మరిన్ని రెడ్ ఫ్లాగ్స్ బయటపడ్డాయి:

ఆఫ్రికాలో గని: ఆఫ్రికాలోని ఓ బంగారు గనిలో (Gold Mine) రూ. 1,035 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ చూపించింది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, వాల్యుయేషన్ రిపోర్టులు సెబీకి సమర్పించలేకపోయింది.

ఫేక్ లావాదేవీలు: అఫ్లూయెన్స్ (Affluence Shares) అనే సంస్థతో రూ. 11,487 కోట్ల మేర సేల్స్, రూ. 11,488 కోట్ల పర్చేజెస్ జరిగినట్లు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ రికార్డుల్లో రాసుకుంది. విచారణలో అఫ్లూయెన్స్ సంస్థ ఈ లావాదేవీలను ఖండించింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అసలు తమ క్లయింటే కాదని బాంబు పేల్చింది.

నిధుల మళ్లింపు: కంపెనీ నిధులను ప్రమోటర్ రాజేష్ మెహతా తన సొంత అకౌంట్లకు మళ్లించి, డెరివేటివ్ ట్రేడింగ్ (Derivative trading) చేసినట్లు సెబీ గుర్తించింది. బోర్డు అనుమతి లేకుండా ఈ నిధుల మళ్లింపు జరిగింది.

ఎల్ఐసీ, ఇన్వెస్టర్లకు భారీ షాక్

ఈ భారీ స్కామ్ దెబ్బకు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ ధర కుప్పకూలింది. ఒకప్పుడు రూ. 1,028 వద్ద ట్రేడ్ అయిన షేర్, ఇప్పుడు రూ. 103 స్థాయికి పడిపోయింది. దీంతో సామాన్య ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 12,725 కోట్లు ఆవిరైపోయింది.

ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ (LIC)కి ఈ కంపెనీలో ఏకంగా 10.80 శాతం వాటా ఉంది. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉండటం, పేపర్ల మీద అద్భుతమైన గ్రోత్ రేట్ చూపించడంతో ఎల్ఐసీ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది అంతిమంగా పాలసీదారుల సొమ్ము కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు, కెనరా బ్యాంక్ కూడా ఈ సంస్థకు ఇచ్చిన రూ. 509 కోట్ల రుణాలను 'స్ట్రెస్డ్ అసెట్' (మొండిబకాయి) గా ప్రకటించింది.

కంపెనీ వివరణ ఏంటి?

తమపై వచ్చిన ఆరోపణలను రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఖండించింది. "సెబీ జారీ చేసినవి కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. మా ఆదాయ వివరాలన్నీ కరెక్టే. సెబీకి, మాకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ (Communication gap) వచ్చింది. త్వరలోనే అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సమర్పిస్తాం" అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ ఆరోపణలు గనక తుది విచారణలో నిరూపితమైతే, ఇది భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా మిగిలిపోవడం ఖాయం!

Advertisement
Advertisement