త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | ఆర్‌బీఐ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు.. రూ.1 ల‌క్ష వ‌ర‌కు రిక‌రింగ్ పేమెంట్ల‌కు నో ఓటీపీ..

RBI | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ పేమెంట్స్ ఈ-మాండేట్స్ కోసం సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఈ చర్యతో పునరావృత చెల్లింపులను సులభతరం చేయడం మాత్రమే కాకుండా యూపీఐ, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, కార్డ్ పేమెంట్స్ ద్వారా దేశీయంగానే కాక విదేశాల్లో కూడా వినియోగదారులకు భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్ణ‌యం తీసుకుంది.

S

Business | Published On Apr 22, 2026, 3.29 pm IST

RBI | ఆర్‌బీఐ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు.. రూ.1 ల‌క్ష వ‌ర‌కు రిక‌రింగ్ పేమెంట్ల‌కు నో ఓటీపీ..
Advertisement

RBI | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ పేమెంట్స్ ఈ-మాండేట్స్ కోసం సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఈ చర్యతో పునరావృత చెల్లింపులను సులభతరం చేయడం మాత్రమే కాకుండా యూపీఐ, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, కార్డ్ పేమెంట్స్ ద్వారా దేశీయంగానే కాక విదేశాల్లో కూడా వినియోగదారులకు భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్ణ‌యం తీసుకుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.15వేల వ‌రకు జరిగే రికరింగ్ పేమెంట్స్‌కు ఓటీపీ అవసరాన్ని తొలగించారు. అంతేకాకుండా రూ.15వేల‌ నుండి రూ.1 లక్ష మధ్యలో ఉండే ఇన్సూరెన్స్ ఇన్‌స్టాల్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ అవసరం లేకుండా లావాదేవీలు కొనసాగించవచ్చు.

ఏఎఫ్ఏ పూర్తి చేసి ఉండాలి..

ఈ సవరించిన విధానంలో కస్టమర్లు ముందుగా అదనపు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఏఎఫ్ఏ) పూర్తి చేసిన తర్వాత ఒకసారి ఉపయోగించే ఈ-మాండేట్‌ను నమోదు చేసుకోవచ్చు. ఒకసారి ఆమోదం పొందిన తరువాత, రూ.15వేల వరకు రికరింగ్ డెబిట్లు మళ్లీ మళ్లీ ఒటీపీ అవసరం లేకుండా సజావుగా ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ పరిమితిని మించిన లావాదేవీలకు మాత్రం తప్పనిసరిగా ధ్రువీకరణ కొనసాగుతుంది, ఇది పెద్ద మొత్తాల భద్రతకు దోహ‌దం చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థలో రూ.15వేల పరిమితి కీలకంగా నిలుస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐలు వంటి సాధారణ ఖర్చులను యూజర్ జోక్యం లేకుండానే చెల్లించుకునే సౌలభ్యాన్ని ఇది అందిస్తుంది.

రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఓటీపీ అక్క‌ర్లేదు..

అయితే ముఖ్యమైన ఆర్థిక బాధ్యతలకు ఆర్బీఐ ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం రూ.1 లక్ష వరకు రికరింగ్ చెల్లింపుల‌ను ఓటీపీ లేకుండానే చేయవచ్చు, కానీ ఈ-మాండేట్ తప్పనిసరిగా ఉండాలి. ఖర్చుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త విధానంలో పారదర్శకతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్లు డెబిట్ జరిగే కనీసం ఒక రోజు ముందు కస్టమర్లకు నోటిఫికేషన్ పంపాలి. అందులో వ్యాపారి పేరు, లావాదేవీ మొత్తం, డ్యూ తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. యూజర్లకు తమ ఈ-మాండేట్లపై పూర్తి నియంత్రణ ఉంటుంది. అవసరమైతే వారు మాండేట్‌ను మార్చడం, తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం చేయవచ్చు. ఈ మార్పులకు ఏఎఫ్ఏ ద్వారా ధ్రువీకరణ అవసరం ఉంటుంది. లావాదేవీ పూర్తయ్యాక కూడా అలర్ట్‌లు పంపడం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను తప్పనిసరి చేశారు.

గ‌రిష్ట ప‌రిమితిని మార్చ‌వ‌చ్చు..

మొత్తం చెల్లింపులు మారే సందర్భాల్లో కస్టమర్లు ఒక గరిష్ట పరిమితిని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా నిర్దిష్ట పరిమితిని మించే డెబిట్లు జరగకుండా నియంత్రించవచ్చు. అనధికార లావాదేవీల విషయంలో ఆర్బీఐ జీరో లయబిలిటీ విధానాన్ని ఈ-మాండేట్స్‌కు కూడా వర్తింపజేసింది. అంటే సమయానికి సమాచారం అందించినట్లయితే మోసపూరిత లావాదేవీలకు యూజర్లు బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. ఇకపై ఈ ఫ్రేమ్‌వర్క్ విదేశీ రికరింగ్ లావాదేవీలను కూడా కలుపుకొని విస్తరించి ప‌నిచేస్తుంది. ఇది గతంలో కేవలం దేశీయ లావాదేవీలకే పరిమితం అయ్యింది. ముఖ్యంగా ఈ-మాండేట్ వినియోగానికి బ్యాంకులు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement