త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO | యూపీఐతో ఇక ఈపీఎఫ్ డబ్బులు వెంటనే.. ఈపీఎఫ్‌వో భారీ మార్పులు..

EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. ఇకపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులను నేరుగా యూపీఐ ద్వారా వెంటనే బ్యాంక్ ఖాతాలోకి తీసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వ్యవస్థ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వ్యా వెల్లడించారు.

S

Business | Published On May 20, 2026, 2.15 pm IST

EPFO | యూపీఐతో ఇక ఈపీఎఫ్ డబ్బులు వెంటనే.. ఈపీఎఫ్‌వో భారీ మార్పులు..
Advertisement

EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. ఇకపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులను నేరుగా యూపీఐ ద్వారా వెంటనే బ్యాంక్ ఖాతాలోకి తీసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వ్యవస్థ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వ్యా వెల్లడించారు. సభ్యులకు సేవలను వేగంగా అందించడం, పీఎఫ్ ఉపసంహరణలో ఎదురవుతున్న ఆలస్యాలను తగ్గించడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌వో పలు సంస్కరణలు చేపడుతోందని మంత్రి తెలిపారు. యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ సదుపాయానికి సంబంధించిన టెస్టింగ్ పూర్తయిందని, సభ్యులు తీసుకునే మొత్తం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.

కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుంది..?

కొత్త విధానం ప్రకారం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఖాతాలో ఉపసంహరణకు అందుబాటులో ఉన్న మొత్తాన్ని ముందుగానే చూడగలుగుతారు. అనంతరం ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా నేరుగా తమ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. లావాదేవీ భద్రత కోసం యూజర్లు తమ యూపీఐ పిన్ ద్వారా ఆథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం కొంత ఈపీఎఫ్ మొత్తం ఫ్రీజ్‌లోనే ఉండగా, ఉపసంహరణకు అర్హత ఉన్న భాగాన్ని మాత్రమే యూపీఐ ద్వారా వెంటనే తీసుకునే విధంగా ప్రభుత్వం మోడల్ ను రూపొందిస్తోంది. డబ్బు బ్యాంక్ ఖాతాలోకి చేరిన వెంటనే డిజిటల్ పేమెంట్లు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు, డెబిట్ కార్డు ద్వారా ఏటీఎంలలో నగదు ఉపసంహరణ వంటి సేవలకు వినియోగించుకోవచ్చు. యూపీఐ ఉపసంహరణ సేవలతోపాటు ఈపీఎఫ్‌వో సేవలను త్వరలో వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న వాట్సాప్ ద్వారా సభ్యులతో కమ్యూనికేషన్ సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది.

సభ్యులు ఈపీఎఫ్‌వో అధికారిక వెరిఫైడ్ వాట్సాప్ నంబర్‌కు హలో అనే మెసేజ్ పంపితే చాలు, సేవలు ప్రారంభమవుతాయి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఈపీఎఫ్ సంబంధిత అప్‌డేట్లు, సందేశాలు కూడా అందేలా సిస్టమ్ రూపొందిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రశ్నలకు 24 గంటల పాటు ఆటోమేటెడ్ సపోర్ట్ కూడా లభించనుంది. యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ, ఆధార్ లింక్ బ్యాంక్ వెరిఫికేషన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) యాక్టివేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న సభ్యులకు కూడా వాట్సాప్ ద్వారా ప్రత్యేక సహాయం అందించనున్నారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై) కింద ఉన్న లబ్ధిదారుల సమస్యలను త్వరగా పరిష్కరించడంపైనా ఈ సేవ దృష్టి పెట్టనుంది. ఈ సర్వీస్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

యూపీఐ ద్వారా ఎంత వరకు పీఎఫ్ తీసుకోవచ్చు?

యూపీఐ ఆధారిత ఈపీఎఫ్ ఉపసంహరణ సేవకు సంబంధించి అధికారిక పరిమితిని ఈపీఎఫ్‌వో ఇంకా ప్రకటించలేదు. అయితే గతంలో వచ్చిన ప్రతిపాదనల ప్రకారం సభ్యులు తమ అర్హత ఉన్న ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు వెంటనే ఉపసంహరించుకునే అవకాశం ఉండొచ్చని సమాచారం. అయితే తుది ఉపసంహరణ పరిమితి, అర్హత నిబంధనలు, ట్రాన్సాక్షన్ రూల్స్‌పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ మొత్తాన్ని తీసుకోవాలంటే ముందుగా క్లెయిమ్ దాఖలు చేయాలి. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆటో సెటిల్‌మెంట్ విధానంలో అర్హత ఉన్న క్లెయిమ్‌లు మాన్యువల్ జోక్యం లేకుండా సాధారణంగా మూడు రోజుల్లో ప్రాసెస్ అవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీంతో వైద్య అత్యవసరాలు, విద్య, వివాహం, గృహ అవసరాలు వంటి సందర్భాల్లో మరింత మంది సభ్యులు తమ పీఎఫ్ పొదుపులను సులభంగా వినియోగించుకునే అవకాశం లభిస్తోంది.

Advertisement
Advertisement