త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lalithaa Jewellery Mart IPO | ఇన్వెస్ట‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ల‌లితా జ్యువెల‌రీ ఐపీవో వ‌చ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Lalithaa Jewellery Mart IPO | ప్ర‌ముఖ జ్యువెల‌రీ విక్ర‌య‌దారు ల‌లితా జ్యువెల‌ర్స్ పెట్టుబ‌డిదారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త‌న కంపెనీకి చెందిన ఐపీవో ఎట్ట‌కేల‌కు లాంచ్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ల‌లితా జ్యువెల‌రీ మార్ట్ లిమిటెడ్ త‌న ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించింది. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.5గా ఉంది.

S

Business | Published On Aug 11, 2026, 1.46 pm IST

Lalithaa Jewellery Mart IPO | ఇన్వెస్ట‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ల‌లితా జ్యువెల‌రీ ఐపీవో వ‌చ్చేస్తోంది.. ఎప్పుడంటే..
Advertisement

Lalithaa Jewellery Mart IPO | ప్ర‌ముఖ జ్యువెల‌రీ విక్ర‌య‌దారు ల‌లితా జ్యువెల‌ర్స్ పెట్టుబ‌డిదారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త‌న కంపెనీకి చెందిన ఐపీవో ఎట్ట‌కేల‌కు లాంచ్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ల‌లితా జ్యువెల‌రీ మార్ట్ లిమిటెడ్ త‌న ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించింది. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.5గా ఉంది. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓ ఆగస్టు 17న ప్రారంభం కానుండ‌గా ఆగస్టు 19న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ఆగస్టు 14న జరగనుంది. ఈ ఐపీఓలో లాట్ సైజ్ 74 ఈక్విటీ షేర్లుగా ఉంది. అంటే ఇన్వెస్టర్లు కనీసం 74 షేర్లకు దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత 74 షేర్ల చొప్పున అదనంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

35 శాతం షేర్లు రిటైల‌ర్ల‌కు..

లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓలో 50 శాతానికి మించకుండా షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు కేటాయించారు. కనీసం 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, కనీసం 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఉద్యోగుల కోసం రూ.6 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. వీటిని తుది ఆఫర్ ధరపై 10 శాతం డిస్కౌంట్‌తో అందించ‌నున్నారు. ఐపీఓలో షేర్ల కేటాయింపు తుది నిర్ణయం ఆగస్టు 20న వెలువడే అవకాశం ఉంది. ఆగస్టు 21న రిఫండ్లు ప్రారంభమవుతాయి. అదే రోజు కేటాయింపు పొందిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ కానున్నాయి. అనంతరం ఆగస్టు 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లలితా జ్యువెలరీ మార్ట్ షేర్లు లిస్ట్ కానున్నాయి.

రూ.1700 కోట్ల ఇష్యూ..

లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓలో రూ.1,200 కోట్ల విలువైన తాజా షేర్ల జారీ ఉంటుంది. దీంతోపాటు కంపెనీ ప్రమోటర్, వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. దీంతో మొత్తం ఐపీఓ పరిమాణం రూ.1,700 కోట్లుగా ఉంటుంది. కంపెనీ విస్తరణ వ్యూహంలో భాగంగా తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.1,033.2 కోట్ల వరకు దక్షిణ భారతదేశంలో 10 కొత్త స్టోర్లను ఏర్పాటు చేసేందుకు వినియోగించనుంది. ఇందులో స్టోర్ ఫిటౌట్స్, ఫర్నిచర్, ఫిక్చర్స్, పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నగల ఇన్వెంటరీ వంటి అవసరాలకు ఖర్చు చేయనుంది. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. అయితే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వచ్చే మొత్తం నిధులు ప్రమోటర్‌కు వెళ్తాయి. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్ క్యాపిటల్ మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు.

177 శాతం వృద్ధి..

లలితా జ్యువెలరీ మార్ట్ దక్షిణ భారత మార్కెట్‌లో ప్రాంతీయ అభిరుచులకు అనుగుణంగా బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలను లలితా బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 61 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ 61 స్టోర్లలో 45 స్టోర్లు టియర్-2, టియర్-3 నగరాల్లో ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ నగరాల్లోని స్టోర్లు 60.25 శాతం వాటాను అందించాయి. ప్రధాన ఆర్గనైజ్డ్ జ్యువెలరీ కంపెనీలైన కల్యాణ్ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్, పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, సెంకో గోల్డ్, టైటాన్ కంపెనీతో పోలిస్తే ఒక్కో స్టోర్ ద్వారా వచ్చే ఆపరేటింగ్ ఆదాయంలో తమదే అత్యధికమని కంపెనీ పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లలితా జ్యువెలరీ మార్ట్ రూ.1,009.8 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 177 శాతం పెరుగుదల కాగా ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 48.1 శాతం వార్షిక వృద్ధితో రూ.25,023.9 కోట్లకు చేరింది.

అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వృద్ధి చాలా తక్కువగా నమోదైంది. ఆ ఏడాది లాభం 1.4 శాతం మాత్రమే పెరిగి రూ.364.7 కోట్లకు చేరింది. 2023-24లో ఇది రూ.359.8 కోట్లుగా ఉంది. ఆదాయం కూడా 0.65 శాతం స్వల్ప వృద్ధితో రూ.16,897.3 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఆదాయం రూ.16,788 కోట్లుగా నమోదైంది.

Advertisement
Advertisement