త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | బడ్జెట్ 2026: విదేశీ ప్రయాణం చౌక.. ఐటీఆర్ గడువు పెంపు

J

Business | Published On Feb 1, 2026, 1.11 pm IST

Union Budget 2026 | బడ్జెట్ 2026: విదేశీ ప్రయాణం చౌక.. ఐటీఆర్ గడువు పెంపు
Advertisement

Union Budget 2026 | కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు, పన్ను చెల్లింపుదారులకు, పరిశ్రమలకు ఊరటనిచ్చే అనేక నిర్ణయాలను ప్రకటించారు. విదేశీ ప్రయాణాల నుంచి ఆదాయపు పన్ను నిబంధనల వరకు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

విదేశీ ప్రయాణాలు ఇక చౌక (TCS తగ్గింపు)

విదేశాలకు వెళ్లే భారతీయులకు బడ్జెట్‌లో భారీ ఊరట లభించింది.

TCS 2 శాతం మాత్రమే: విదేశీ టూర్ ప్యాకేజీలపై మూలం వద్ద వసూలు చేసే పన్ను (TCS) రేటును గతంలోని 5 శాతం, 20 శాతం నుంచి ఫ్లాట్‌గా 2 శాతానికి తగ్గించారు.

పరిమితి తొలగింపు: దీనికి సంబంధించి కనీస మొత్తపు పరిమితిని కూడా తొలగించారు. అంటే బుకింగ్ సమయంలోనే ప్రయాణికులపై పన్ను భారం భారీగా తగ్గుతుంది.

విద్యార్థులకు మేలు: విదేశాల్లో విద్య, వైద్యం కోసం పంపే నిధులపై (LRS కింద) కూడా TCSను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.

ఆదాయపు పన్ను , ITR గడువు పొడిగింపు

కొత్త చట్టం: 'ఆదాయపు పన్ను చట్టం - 2025.. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన కొత్త ITR ఫారమ్‌లు త్వరలో విడుదల కానున్నాయి.

గడువు పొడిగింపు: పన్ను రిటర్న్‌లను సవరించుకునే (Revising tax returns) గడువును డిసెంబర్ 31 నుండి మార్చి 31 వరకు పొడిగించారు.

ఫైలింగ్ తేదీలు: వ్యక్తులకు (ITR-1, 2) జూలై 31 వరకు, వ్యాపార సంస్థలు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు గడువు ఇవ్వాలని ప్రతిపాదించారు.

అప్పీల్ పెనాల్టీ: ఆదాయపు పన్ను కేసు అప్పీల్‌లో ఉన్నప్పుడు, పెనాల్టీ మొత్తాలపై పన్ను చెల్లింపుదారులు ఎటువంటి వడ్డీ (Interest) చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రమాద బాధితులకు: మోటారు ప్రమాద క్లెయిమ్‌లపై వచ్చే వడ్డీ మొత్తానికి ఆదాయపు పన్ను, TDS నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యలోటు (Fiscal Deficit)

ద్రవ్యలోటు: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును GDPలో 4.3 శాతం వద్ద అంచనా వేశారు. ఇది ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని నిపుణులు అంటున్నారు.

అప్పులు: GDP నిష్పత్తిలో అప్పులు 56.1 శాతం నుంచి 55.6 శాతంకి తగ్గుతాయని అంచనా.

బడ్జెట్ పరిమాణం: మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5 లక్షల కోట్లు కాగా, నికర పన్ను రాబడి రూ.28.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

పెట్టుబడుల ఉపసంహరణ (Divestment): FY27 కు రూ.80,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు.

కస్టమ్స్ సుంకం తగ్గింపు - చౌకగా మారనున్న వస్తువులు

వ్యక్తిగత దిగుమతులు: వ్యక్తిగత వినియోగం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని (Tariff) 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.

క్యాన్సర్ మందులు: 17 రకాల క్యాన్సర్ మందులకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు.

విమానయానం: పౌర విమానయాన శిక్షణ విమానాల తయారీకి, మరమ్మతులకు ఉపయోగించే విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించారు.

లెదర్ & టెక్స్‌టైల్స్ : ఎగుమతులను ప్రోత్సహించేందుకు తోలు పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు దిగుమతులపై సుంకం తొలగించారు.

మైక్రోవేవ్ ఓవెన్: తయారీకి వాడే కొన్ని విడిభాగాలపై సుంకం మినహాయింపు.

ఐటీ రంగానికి (IT Sector) ప్రోత్సాహకాలు

సాఫ్ట్‌వేర్, KPO, R&D వంటి అన్ని సేవలను 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్' అనే ఒకే గొడుగు కిందకు తెచ్చారు.

అన్ని ఐటీ సేవలకు 15.5 శాతం యూనిఫాం 'సేఫ్ హార్బర్ మార్జిన్' (Safe harbour margin) వర్తిస్తుంది. దీని పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచారు. ఇది ఐటీ కంపెనీలకు పన్ను వివాదాలను తగ్గిస్తుంది.

ఇతర కీలక నిర్ణయాలు

ఎన్నారైల ఆస్తి అమ్మకం: ప్రవాస భారతీయులు (Non-residents) ఆస్తి అమ్మినప్పుడు, కొనుగోలుదారులు తమ పాన్ (PAN) కార్డు ద్వారానే TDS చెల్లించవచ్చు. ప్రత్యేకంగా TAN నంబర్ అవసరం లేదు.

సిటీ ఎకనామిక్ రీజియన్స్: నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.5,000 కోట్లు కేటాయించారు.

విదేశీ ఆస్తులు: రూ.20 లక్షల కంటే తక్కువ విలువైన విదేశీ ఆస్తులను (స్థిరాస్తి కాకుండా) వెల్లడించని వారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT): ఫ్యూచర్స్ మార్కెట్లో STTని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు.

డిఫెన్స్ బడ్జెట్: రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు.

 

Advertisement
Advertisement