త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు ఊరట.. 472 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తగ్గడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొంత వెనక్కి తగ్గడం వంటి అంశాలు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. గత వారం సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఎనిమిదో వారపు పతనాన్ని నమోదు చేశాయి.

S

Business | Published On Oct 5, 2026, 4.08 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు ఊరట.. 472 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తగ్గడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొంత వెనక్కి తగ్గడం వంటి అంశాలు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. గత వారం సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఎనిమిదో వారపు పతనాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల రికార్డు స్థాయి అమ్మకాలు, అధిక ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కొంత కొనుగోలు ఆసక్తి కనిపించింది. సెన్సెక్స్ 472.77 పాయింట్లు (0.66 శాతం) పెరిగి 72,382.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 133.80 పాయింట్లు (0.6 శాతం) లాభంతో 22,555.75 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో మొత్తం 1,997 షేర్లు లాభపడగా, 2,290 షేర్లు నష్టపోయాయి. మరో 217 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఒత్తిడిలో ఐటీ, ఫార్మా షేర్లు..

సెక్టార్ల పరంగా చూస్తే ఐటీ, ఫార్మా షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ, ఎంపిక చేసిన ఆర్థిక సేవల షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ 50లో బీఎస్ఈ మూడు శాతానికి పైగా లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు దాదాపు మూడు శాతం చొప్పున పెరిగాయి. భారీ వెయిటేజ్ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా మార్కెట్‌కు అండగా నిలిచాయి. రిలయన్స్ దాదాపు రెండు శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ సుమారు ఒక శాతం లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ దాదాపు మూడు శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, సిప్లా షేర్లు సుమారు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఐటీ, హెల్త్‌కేర్, ఫార్మా రంగాలు మాత్రమే నష్టాల్లో నిలిచాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీ దాదాపు రెండు శాతం పెరిగి వరుసగా నాలుగు సెషన్ల పతనానికి బ్రేక్ వేసింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మీడియా సూచీలు ఒక్కొక్కటి ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ హెల్త్‌కేర్, ఫార్మా సూచీలు సుమారు ఒక శాతం చొప్పున పడిపోయి వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలను నమోదు చేశాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

విస్తృత మార్కెట్‌లో మిడ్‌క్యాప్ సూచీలు 0.5 నుంచి 0.7 శాతం వరకు లాభపడ్డాయి. స్మాల్‌క్యాప్ సూచీలు 0.3 నుంచి 0.5 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీ 200, నిఫ్టీ 500 సూచీలలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ దాదాపు ఐదు శాతం పతనమై అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచింది. నిఫ్టీ 200లో కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా, ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ 500లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు ఏడు శాతం పెరిగి అగ్రగామిగా నిలిచింది. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా మార్కెట్ల‌లో లాభాల‌కు కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.28 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 101 డాల‌ర్ల వ‌ద్ద నిల‌వ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.07 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 92 డాల‌ర్ల వ‌ద్ద ఉంది.

అప్ర‌మ‌త్తంగానే ఉండాలి..

జీ7 దేశాలు శుక్రవారం అత్యవసర నిల్వల నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల డీజిల్, క్రూడ్‌ను విడుదల చేయడానికి అంగీకరించాయి. అలాగే ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించకుండా ఉంటామని హామీ ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గత వారం బ్రెంట్ క్రూడ్ తన లాభాల్లో ఎక్కువ భాగాన్ని కోల్పోగా, డబ్ల్యూటీఐ ధర 1.6 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా భారత మార్కెట్లకు బలాన్నిచ్చాయి. సోమవారం ఆసియా మార్కెట్లు బలమైన ప్రారంభాన్ని నమోదు చేశాయి. అమెరికా ఉద్యోగాల గణాంకాలు అంచనాల కంటే చల్లబడడంతో ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వడ్డీ రేట్లు పెంచే అవకాశాలపై ఇన్వెస్టర్ల అంచనాలు తగ్గాయి. దీంతో డాలర్ కొంత బలహీనపడగా, బాండ్ మార్కెట్లు స్థిరపడ్డాయి. అయితే మార్కెట్లు ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు ఓవ‌ర్ సోల్డ్ ద‌శ‌లో ఉన్నాయ‌ని, అందువ‌ల్ల ఈ వారం కీల‌క‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు దూకుడుగా కొనుగోళ్లు చేయ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement