త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIIs | విదేశీ పెట్టుబడిదారుల నిష్క్రమణకు SIP సంస్కృతే కార‌ణం..? రూపాయి పతనం అందుకేనా..?

FIIs | భారత్‌లో వేగంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ సంస్కృతి, దేశీయ పెట్టుబడిదారులకు సంపద సృష్టించే సాధనంగా కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నదని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తాజా స్ట్రాటజీ నోట్‌లో హెచ్చరించింది.

S

Business | Published On May 23, 2026, 12.57 pm IST

FIIs | విదేశీ పెట్టుబడిదారుల నిష్క్రమణకు SIP సంస్కృతే కార‌ణం..? రూపాయి పతనం అందుకేనా..?
Advertisement

FIIs | భారత్‌లో వేగంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ సంస్కృతి, దేశీయ పెట్టుబడిదారులకు సంపద సృష్టించే సాధనంగా కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నదని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తాజా స్ట్రాటజీ నోట్‌లో హెచ్చరించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోకి భారీగా వస్తున్న ఎస్‌ఐపీ డబ్బు, విదేశీ పెట్టుబడిదారులకు భారత మార్కెట్ నుంచి సులభంగా నిష్క్రమించే మార్గంగా మారిందని సంస్థ అభిప్రాయపడింది. జెఫరీస్ విశ్లేషకుడు మ‌హేష్ నందుర్క‌ర్ తెలిపిన ప్రకారం, ప్రస్తుతం రూపాయి బలహీనతకు ప్రధాన కారణం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) కాదని, మూలధన ప్రవాహాల్లో వచ్చిన భారీ బలహీనతేనని పేర్కొన్నారు. ఎఫ్‌వై24 నుంచి ఎఫ్‌వై26 వరకు భారత సీఏడీ సగటు జీడీపీలో కేవలం 0.8 శాతంగా ఉండటం చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అని, ఎఫ్‌వై27లో కూడా ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరినా సీఏడీ సుమారు 2 శాతం లోపే ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ప్రధాన మార్పు విదేశీ మూలధన ప్రవాహాల్లో కనిపించిందని జెఫరీస్ తెలిపింది. ఎఫ్‌వై25-26 కాలంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి సుమారు 78 బిలియన్ డాలర్ల మేర నిధులు వెనక్కి తీసుకెళ్లారని నివేదిక పేర్కొంది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు, విదేశీ ప్రమోటర్లు దేశీయ డిమాండ్ బలంగా ఉండటాన్ని ఉపయోగించుకుని వాటాలను విక్రయించి బయటకు వెళ్లారని తెలిపింది.

ఎస్‌ఐపీ డబ్బుతో విదేశీ విక్రయాలకు మద్దతు..

మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీలు, ఈపీఎఫ్‌వో, ఎన్‌పీఎస్ వంటి పథకాల ద్వారా భారతీయుల పొదుపులు భారీగా ఈక్విటీల్లోకి రావడం, విదేశీ పెట్టుబడిదారులకు ఈజీ ఎగ్జిట్ రూట్ గా మారిందని జెఫరీస్ విశ్లేషించింది. భారత మార్కెట్‌ను అత్యంత ఖరీదైన మార్కెట్ గా భావిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్లు, దేశీయ పెట్టుబడిదారుల డబ్బు ఆధారంగా తమ వాటాలను విక్రయించి బయటకు వెళ్తున్నారని తెలిపింది. ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో 44 బిలియన్ డాలర్ల నికర విక్రయాలు చేశారని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నెట్ ఎఫ్‌డీఐ కూడా గణనీయంగా పడిపోయింది. విదేశీ ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు వాటాల విక్రయాలు పెంచడంతో ఎఫ్‌వై25-26లో నెట్ ఎఫ్‌డీఐ కేవలం 5 బిలియన్ డాలర్లకు పడిపోయిందని తెలిపింది. దీంతో భారత మూలధన ఖాతా మిగులు ఎఫ్‌వై25-26లో జీడీపీలో కేవలం 0.5 శాతానికి తగ్గిందని, గత దశాబ్ద సగటు 2.6 శాతంతో పోలిస్తే ఇది అత్యల్ప స్థాయి అని జెఫరీస్ పేర్కొంది. ఈ ప్రభావం వల్ల వరుసగా రెండేళ్లు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు నమోదైందని, ఎఫ్‌వై27లో కూడా లోటు కొనసాగ‌వ‌చ్చని అంచనా వేసింది.

ఎఫ్‌వై27 అంచనాల ప్రకారం భారత వాణిజ్య లోటు 334 బిలియన్ డాలర్లు, సీఏడీ 36 బిలియన్ డాలర్లు, మూలధన ఖాతా మిగులు 25 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని జెఫరీస్ అంచనా వేసింది. దీని ఫలితంగా ఎఫ్‌వై26లో 11 బిలియన్ డాలర్ల బీఓపీ లోటు, ఎఫ్‌వై27లో మరింత పెద్ద లోటు రావచ్చని హెచ్చరించింది.

ఎఫ్‌పీఐ విక్రయాలు చరిత్రలోనే అత్యధికం..

జెఫరీస్ గణాంకాల ప్రకారం ఎఫ్‌వై26లో భారత ఈక్విటీల్లో నెట్ ఎఫ్‌పీఐ అవుట్‌ఫ్లో 21 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. గత 12 నెలల ప్రాతిపదికన ఎఫ్‌పీఐ అవుట్‌ఫ్లో 31 బిలియన్ డాలర్లకు చేరగా, 18 నెలల కాలంలో మొత్తం విక్రయాలు 40 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయని తెలిపింది. ఇక బాండ్ ఇండెక్స్ ఇన్‌క్లూజన్ ద్వారా వచ్చిన విదేశీ పెట్టుబడుల ప్రభావం కూడా తగ్గిపోయిందని పేర్కొంది. ఎఫ్‌వై24లో బలంగా వచ్చిన డెట్ ఇన్‌ఫ్లోలు ప్రస్తుతం స్వల్ప స్థాయిలో మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపింది. ఎఫ్‌వై27లో గ్రాస్ ఇన్‌బౌండ్ ఎఫ్‌డీఐ 100 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా ఉన్నప్పటికీ, అవుట్‌బౌండ్ ఎఫ్‌డీఐలు, రీపాట్రియేషన్ అవుట్‌ఫ్లోల కారణంగా నెట్ ఎఫ్‌డీఐ తీవ్రంగా తగ్గిందని నివేదిక పేర్కొంది. ఎఫ్‌వై21–22లో 40 బిలియన్ డాలర్ల మధ్యస్థాయిలో ఉన్న నెట్ ఎఫ్‌డీఐ, ఎఫ్‌వై26లో కేవలం 5 బిలియన్ డాలర్లకు పడిపోయిందని తెలిపింది.

రూపాయి అండర్‌వాల్యూడ్..?

మూలధన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రూపాయి పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని జెఫరీస్ భావిస్తోంది. భారత విదేశీ మారక నిల్వలు ఫార్వర్డ్ షార్ట్‌లను సర్దుబాటు చేసిన తర్వాత కూడా 597 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయని, ఇది సుమారు 9 నెలల దిగుమతులకు సరిపోతుందని తెలిపింది. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ (ఆర్ఈఈఆర్‌) ప్రాతిపదికన చూస్తే రూపాయి ప్రస్తుతం గణనీయంగా అండర్‌వాల్యూడ్‌గా ఉందని పేర్కొంది. డిసెంబర్ 2024 నుంచి భారత 40 కరెన్సీ ట్రేడ్ వెయిటెడ్ ఆర్ఈఈఆర్ సుమారు 14 శాతం పడిపోయి 91 స్థాయికి చేరిందని, ఇది 12 ఏళ్ల కనిష్ఠం అని తెలిపింది. ప్రస్తుత స్థాయిలో రూపాయి దాదాపు 9 శాతం అండర్‌వాల్యూడ్‌గా ఉందని, గతంలో ఇలాంటి పరిస్థితుల తర్వాత సాధారణంగా రూపాయి కోలుకున్న సందర్భాలు ఉన్నాయని జెఫరీస్ వివరించింది.

ప్రభుత్వం తీసుకునే అవకాశమున్న చర్యలు..

ప్రస్తుతం ప్రభుత్వం విదేశీ మారక ప్రవాహాలను నియంత్రించేందుకు నైతిక ఒత్తిడి (మోర‌ల్ సుష‌న్ విధానాలను మాత్రమే ఉపయోగిస్తోందని జెఫరీస్ పేర్కొంది. వర్క్ ఫ్రం హోమ్ సూచనలు, ప్రయాణాలు తగ్గించాలనే సూచనలు, చమురు వినియోగం తగ్గించాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపింది. అయితే పరిస్థితి మరింత దిగజారితే కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్‌) పరిమితులను తగ్గించడం, దిగుమతులపై పరిమాణ నియంత్రణలు, కస్టమ్స్ డ్యూటీలు పెంచడం, రిటైల్ ఇంధన ధరలు పెంచడం వంటి చర్యలు రావచ్చని నివేదిక పేర్కొంది. అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం డెట్, ఈక్విటీపై ఎఫ్‌పీఐ పన్నులను తగ్గించడం, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్‌ను మరింత సడలించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.

ఎస్‌ఐపీ ఇన్వెస్టర్లకు మిశ్రమ సంకేతాలు..

ప్రతి నెలా క్రమం తప్పకుండా ఎస్‌ఐపీ ద్వారా పెట్టుబడులు పెడుతున్న కోట్లాది భారతీయులకు ఈ నివేదిక మిశ్రమ సంకేతాల‌ను ఇచ్చింది. ఒకవైపు దేశీయ పెట్టుబడుల వల్ల భారత స్టాక్ మార్కెట్ భారీ విదేశీ విక్రయాలను తట్టుకుని నిలబడగలుగుతోంది. మరోవైపు అదే స్థిరత్వం విదేశీ పెట్టుబడిదారులకు అధిక విలువల వద్ద సులభంగా నిష్క్రమించే అవకాశాన్ని కల్పిస్తూ, రూపాయిపై ఒత్తిడిని పెంచుతోందని జెఫరీస్ విశ్లేషించింది. జెఫరీస్ బేస్‌కేస్ అంచనాల ప్రకారం వచ్చే 12 నెలల్లో డాలర్‌కు రూపాయి 93-95 స్థాయికి కొంత కోలుకునే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిగా తెరుచుకోవడం, గ్లోబల్ ఏఐ పెట్టుబడి థీమ్ ప్రభావం తగ్గడం వల్ల విదేశీ విక్రయాలు తగ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement