త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Employees JAC | బదిలీల ప్రక్రియలో అధికారుల ఇష్టారాజ్యం.. నిబంధనలు గాలికి.. సీఎంకు ఫిర్యాదు చేస్తామన్న జేఏసీ

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై రగడ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాలను (GO 38) కొందరు ఉన్నతాధికారులు తుంగలో తొక్కుతున్నారని TGE JAC తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

J

Telangana | Published On May 27, 2026, 11.30 pm IST

Telangana Employees JAC | బదిలీల ప్రక్రియలో అధికారుల ఇష్టారాజ్యం.. నిబంధనలు గాలికి.. సీఎంకు ఫిర్యాదు చేస్తామన్న జేఏసీ
Advertisement

Telangana Employees JAC | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) బదిలీల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 (GO 38) మార్గదర్శకాలను కొందరు ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGE JAC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెంచుతున్నారని కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు మండిపడ్డారు.

నిబంధనలకు వక్రభాష్యం.. మూడేళ్లకే బదిలీలు

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఒకే స్టేషన్‌లో 4 ఏళ్ల సర్వీస్ (Service) పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే ఈ బదిలీల సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 40 శాతానికి మించకూడదు. కానీ, ఆర్థిక శాఖలోని కొన్ని విభాగాలు, సంక్షేమ శాఖలు (SC, BC, Tribal Welfare), ఇతర విభాగాలకు చెందిన అధికారులు దీనికి వక్రభాష్యం చెబుతున్నారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేసినా 40 శాతం కోటా నిండటం లేదన్న సాకుతో.. కేవలం 3 ఏళ్ల సర్వీసు ఉన్న వారిని కూడా బదిలీ చేస్తామని అనడం అన్యాయమని JAC నాయకులు ఫైర్ అయ్యారు.

యూనియన్ నేతలకు వెసులుబాటు ఏదీ?

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు బదిలీల నుంచి ఇచ్చిన మినహాయింపును అమలు చేయడానికి ఎస్సీ డెవలప్‌మెంట్ (SC Development) కమిషనర్ నిరాకరించడం వివాదానికి దారితీస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం యూనియన్ కార్యవర్గం మొత్తానికి ఈ వెసులుబాటు ఉండగా.. కొన్ని శాఖల్లో కేవలం అధ్యక్షుడు, కార్యదర్శికి మాత్రమే మినహాయింపు ఇస్తున్నారని నాయకులు ఆరోపించారు.

అదేవిధంగా, ఆయుష్ (AYUSH) డిపార్ట్‌మెంట్‌లో ఇప్పటివరకు ఖాళీలను (Vacancies) వెల్లడించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం సీనియారిటీ లిస్ట్‌ను (Seniority list) ప్రకటించలేదని, బదిలీ కోరుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్లు (Options) కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు.

ఆ శాఖల్లో బదిలీల ఊసే లేదు

మే 31వ తేదీ నాటికి రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ మొత్తం ముగిసిపోవాలని ప్రభుత్వం స్పష్టమైన డెడ్‌లైన్ (Deadline) పెట్టింది. అయినప్పటికీ, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం తెచ్చిపెట్టే ఆబ్కారీ (Excise), వాణిజ్య పన్నుల శాఖల్లో (Commercial Taxes) ఇప్పటికీ బదిలీల ఊసే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఉన్నతాధికారులే ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు.

ధర్నాలకు దిగుతాం.. న్యాయపోరాటం చేస్తాం

అధికారుల ఈ అలక్ష్య వైఖరిని, ఇష్టారాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) దృష్టికి తీసుకెళ్తామని TGE JAC నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించే అధికారుల కార్యాలయాల ముందు ధర్నాలకు (Protests) దిగుతామని, అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement