Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!
Indian Liqueur Brands | బైలీస్, కలువా, టియా మారియా వంటి అంతర్జాతీయ లిక్కర్ బ్రాండ్లకు పోటీగా భారతీయ కంపెనీలు దేశీయ సంప్రదాయ రుచులతో కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. గులాబీ, కుంకుమపువ్వు, యాలకులు, ఫిల్టర్ కాఫీ, కోల్డ్ బ్రూ వంటి రుచులతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. భారతీయ సంప్రదాయ పదార్థాలకు ఆధునిక రూపమిస్తూ దేశీయ బ్రాండ్లు మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.
Indian Liqueur Brands | బైలీస్, కలువా, టియా మారియా వంటి అంతర్జాతీయ లిక్కర్ బ్రాండ్లకు పోటీగా భారతీయ కంపెనీలు దేశీయ సంప్రదాయ రుచులతో కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. గులాబీ, కుంకుమపువ్వు, యాలకులు, ఫిల్టర్ కాఫీ, కోల్డ్ బ్రూ వంటి రుచులతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. భారతీయ సంప్రదాయ పదార్థాలకు ఆధునిక రూపమిస్తూ దేశీయ బ్రాండ్లు మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.
అంతర్జాతీయ బ్రాండ్ల ఆధిపత్యానికి సవాల్..
భారతీయ లిక్కర్ తయారీ సంస్థలు అంతర్జాతీయ బ్రాండ్ల ఆధిపత్యానికి సవాల్ విసురుతున్నాయి. ఇప్పటివరకు బైలీస్, కలువా, టియా మారియా వంటి విదేశీ బ్రాండ్లు ప్రాధాన్యత కలిగిన మార్కెట్లో ఇప్పుడు దేశీయ కంపెనీలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. గులాబీ, యాలకులు, కుంకుమపువ్వు, ఫిల్టర్ కాఫీ, కోల్డ్ బ్రూ వంటి భారతీయ రుచులను ఆధునిక పద్ధతుల్లో లిక్కర్లలో మిళితం చేస్తున్నాయి. ముఖ్యంగా యువ వినియోగదారులు, మహిళలను ఆకర్షించడంతోపాటు బార్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లలో దేశీయ బ్రాండ్లకు ఆదరణ పెంచుకోవడం వీటి లక్ష్యంగా కనిపిస్తోంది.
గులాబీలు, యాలకులు, నారింజలతో లిక్కర్..
రాజస్థాన్‌కు చెందిన మహారాణి మహన్సర్ ఈ రంగంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుటుంబంలో లిక్కర్ తయారీ సంప్రదాయం 1768 నుంచి కొనసాగుతోంది. 2005లో వాణిజ్య ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సంస్థ పుష్కర్ నుంచి గులాబీలు, కేరళ నుంచి యాలకులు, నాగ్‌పూర్ నుంచి నారింజలను సేకరించి ఉత్పత్తులు తయారు చేస్తోంది. గతంలో సంప్రదాయ మద్యపానీయాలను తక్కువగా చూసే ధోరణి ఉండేదని, అయితే ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని సింగ్ తెలిపారు. సంస్థ విక్రయాల్లో సోంపు రుచిని అధిగమించి గులాబీ రుచి కలిగిన లిక్కర్ 50 నుంచి 60 శాతం వాటాను సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ టర్నోవర్ రూ.80 కోట్లుగా నమోదైంది.
ఆకర్షిస్తున్న క్రీమ్ లిక్కర్ రుచులు..
మరోవైపు ఢిల్లీకి చెందిన పలాసా అనే సంస్థ అక్టోబర్ చివరిలో కొత్త క్రీమ్ లిక్కర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మాజీ మార్కెట్ పరిశోధకురాలు లక్ష్మీ కృష్ణన్ దీనిని అభివృద్ధి చేశారు. కుంకుమపువ్వు, గులాబీ, యాలకులు, నట్స్, పండ్ల రుచులను డచ్ క్రీమ్‌తో కలిపి ఈ ఉత్పత్తిని రూపొందించారు. నెదర్లాండ్స్‌లో ఈ బాటిళ్లను తయారు చేస్తున్నారు. భారతీయులకు ఇప్పటికే పరిచయమున్న రుచులను అంతర్జాతీయ క్రీమ్ లిక్కర్లలో ఉండే మృదువైన రుచితో కలపడం తమ ప్రత్యేకత అని లక్ష్మీ కృష్ణన్ పేర్కొన్నారు. ఇక కాఫీ ఆధారిత లిక్కర్లకు కూడా మార్కెట్లో ఆదరణ పెరుగుతోంది. గోవాకు చెందిన క్వాఫైన్ సంస్థ 2022 సెప్టెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. మాజీ బార్టెండర్, సంస్థ సహ వ్యవస్థాపకుడు ఒల్సన్ పెరీరా చెన్నై ఫిల్టర్ కాఫీ స్ఫూర్తితో కోల్డ్ బ్రూ కాఫీ లిక్కర్‌ను అభివృద్ధి చేశారు. కరోనా సమయంలో దాదాపు 11 నెలల పాటు ప్రయోగాలు చేసి ఈ ఉత్పత్తికి తుది రూపునిచ్చారు. ఎస్ప్రెస్సో మార్టిని వంటి కాక్‌టెయిల్స్‌కు పెరుగుతున్న ఆదరణ తమ ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరిస్తుందని ఆయన భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొత్త కాక్‌టెయిల్స్ గురించి వినియోగదారులు తెలుసుకుంటున్నారని తెలిపారు.
కాఫీ గింజలతోనూ మద్యం తయారీ..
ఉత్తరాఖండ్‌కు చెందిన హిమాలే స్పిరిట్స్ 2024లో ప్రారంభించిన బందర్‌ఫుల్ బ్రాండ్ కూడా ఈ విభాగంలో పోటీ పడుతోంది. చికమగళూరు కాఫీ గింజలు, హిమాలయాల సహజ ఊట నీటితో కోల్డ్ బ్రూ కాఫీ లిక్కర్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, గోవాలో ఈ ఉత్పత్తి అందుబాటులో ఉంది. భారతీయ రుచులు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ వినియోగదారులను కూడా ఆకర్షించే అవకాశముందని పానీయాల పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పానీయాల కన్సల్టెన్సీ సంస్థ తుల్లేహో సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆచంట మాట్లాడుతూ.. భారతీయులకు పరిచయమున్న రుచులు దేశీయంగా ఆదరణ పొందడంతోపాటు విదేశీ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తాయని తెలిపారు. అయితే ఉత్పత్తుల నాణ్యతతోపాటు నిరంతర సరఫరా కూడా కీలకమని పేర్కొన్నారు.
గతంలో దిగుమతి చేసుకునే కాఫీ లిక్కర్ల సరఫరాలో అంతరాయాలు ఎదురవడంతో బ్రాండ్లను మార్చాల్సి వచ్చేదని ఒల్సన్ పెరీరా గుర్తుచేశారు. బార్లు, రెస్టారెంట్లు తమ కాక్‌టెయిల్ మెనూల్లో ఒక బ్రాండ్‌ను కొనసాగించాలంటే నిరంతర సరఫరా తప్పనిసరి అని విక్రమ్ ఆచంట వివరించారు. సంప్రదాయ భారతీయ రుచులు, ఆధునిక తయారీ విధానాలు, స్థిరమైన సరఫరా కలిస్తే అంతర్జాతీయ లిక్కర్ బ్రాండ్లకు భారతీయ కంపెనీలు గట్టి పోటీ ఇస్తాయన్నది పరిశ్రమ వర్గాల అంచనా.
తాజావార్తలు
- ●Vakiti Srihari | మక్తల్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా.. ఇప్పుడు కొత్తగా 4,085 పెన్షన్లు మంజూరు చేశాం
- ●India Electrification | 2035 నాటికి భారత్‌కు భారీ ఊరట.. ఇంధన దిగుమతుల్లో రూ.9.6 లక్షల కోట్లు ఆదా..
- ●Khelo India Youth Games 2026 | తెలంగాణలో 'ఖేలో ఇండియా' క్రీడా జాతర: 6 నగరాల్లో 8 వేల మంది అథ్లెట్ల సందడి
- ●Telangana Indiramma Houses | 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి
- ●Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర
- ●MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?

Vakiti Srihari | మక్తల్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా.. ఇప్పుడు కొత్తగా 4,085 పెన్షన్లు మంజూరు చేశాం

India Electrification | 2035 నాటికి భారత్‌కు భారీ ఊరట.. ఇంధన దిగుమతుల్లో రూ.9.6 లక్షల కోట్లు ఆదా..

Khelo India Youth Games 2026 | తెలంగాణలో 'ఖేలో ఇండియా' క్రీడా జాతర: 6 నగరాల్లో 8 వేల మంది అథ్లెట్ల సందడి

Telangana Indiramma Houses | 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి



