త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Electrification | 2035 నాటికి భారత్‌కు భారీ ఊరట.. ఇంధన దిగుమతుల్లో రూ.9.6 లక్షల కోట్లు ఆదా..

India Electrification | పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు విద్యుత్ వినియోగాన్ని వేగంగా పెంచాలని ఒక అధ్యయనం సూచించింది. ఈ దిశగా భారత్ ముందుకు సాగితే 2035 ఆర్థిక సంవత్సరం నాటికి ఏటా రూ.9.6 లక్షల కోట్ల వరకు ఆదా చేయవచ్చని అంచనా వేసింది.

S

Business | Published On Nov 16, 2026, 6.55 pm IST

India Electrification | 2035 నాటికి భారత్‌కు భారీ ఊరట.. ఇంధన దిగుమతుల్లో రూ.9.6 లక్షల కోట్లు ఆదా..
Advertisement

India Electrification | పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు విద్యుత్ వినియోగాన్ని వేగంగా పెంచాలని ఒక అధ్యయనం సూచించింది. ఈ దిశగా భారత్ ముందుకు సాగితే 2035 ఆర్థిక సంవత్సరం నాటికి ఏటా రూ.9.6 లక్షల కోట్ల వరకు ఆదా చేయవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత విధానంలో రూ.17 లక్షల కోట్లుగా ఉండనున్న ఇంధన దిగుమతుల వ్యయం, వేగవంతమైన విద్యుదీకరణతో రూ.7.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

విద్యుదీక‌ర‌ణ కీల‌క పాత్ర‌..

అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ ఒడిదుడుకుల నుంచి భారత్‌కు రక్షణ కల్పించడంలో విద్యుదీకరణ కీలక పాత్ర పోషిస్తుందని క్లైమేట్ కంపాటిబుల్ ఫ్యూచర్స్ అనే పరిశోధనా సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. డీకప్లింగ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్: యాన్ యాక్సిలరేటెడ్ ఎలక్ట్రిఫికేషన్ సినారియో ఫర్ ఇండియా పేరుతో రూపొందించిన ఈ అధ్యయనం ప్రకారం.. 2045 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రత్యక్ష శిలాజ ఇంధన దిగుమతులను పూర్తిగా సున్నాకు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుత విధానాలు కొనసాగితే అదే సమయానికి ఏటా రూ.23.3 లక్షల కోట్ల దిగుమతి వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి హార్ముజ్ జలసంధి మీదుగా నౌకా రవాణాలో ఎదురైన ఆటంకాలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరిగింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య భారత్ ముడి చమురు దిగుమతి బిల్లు గతేడాదితో పోలిస్తే 48 శాతం పెరిగింది.

ఈ ఏడాదిలో రూపాయి విలువ దాదాపు 8 శాతం క్షీణించి డాలర్‌తో పోలిస్తే రూ.96.90కు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ 174.9 బిలియన్ డాలర్లను ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల కోసం ఖర్చు చేసింది. ఇది దేశ మొత్తం దిగుమతి వ్యయంలో దాదాపు 22 శాతం. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయంగా ఏర్పడే చమురు సంక్షోభం భారత్‌లో రూపాయి సంక్షోభానికి దారితీస్తోందని, విద్యుదీకరణ ద్వారా ఈ సమస్యకు మూలస్థాయిలో పరిష్కారం చూపవచ్చని సంస్థ డైరెక్టర్ డాక్టర్ మనీష్ రామ్ పేర్కొన్నారు.

విద్యుత్ వినియోగం పెర‌గాలి..

శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంలో రవాణా రంగం అతిపెద్ద అవకాశంగా నివేదిక గుర్తించింది. 2035 నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, బస్సులు, కార్లు, డెలివరీ వాహనాల వినియోగం ద్వారా రవాణా రంగంలో ఇంధన డిమాండ్‌లో 45 శాతాన్ని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించవచ్చని అంచనా వేసింది. 2045 నాటికి ఈ వాటా 93 శాతానికి చేరుతుంద‌ని తెలిపింది. విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్, బయోఎనర్జీ ఇందుకు ప్రధాన ప్రత్యామ్నాయాలుగా నిలవనున్నాయి. విమానయానం వంటి రంగాల్లో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, ప్రత్యామ్నాయ ఇంధనాలు కీలకం కానున్నాయి. గృహ, వాణిజ్య రంగాల్లో 2035 నాటికి ఇంధన వినియోగంలో 44 శాతాన్ని శిలాజ ఇంధనాల నుంచి మళ్లించవచ్చని, 2045 నాటికి ఎల్పీజీ, సహజ వాయువు స్థానంలో ఎలక్ట్రిక్ వంట పరికరాలు, ఇతర విద్యుత్ ఉపకరణాలను పూర్తిస్థాయిలో ప్రోత్సహించాలని సూచించింది.

వ్యవసాయ రంగంలో విద్యుత్ మోటార్లు, వ్యవసాయ యంత్రాలు, నమ్మకమైన గ్రామీణ విద్యుత్ సరఫరా ద్వారా 2035 నాటికి 47 శాతం మార్పు సాధ్యమని పేర్కొంది. పరిశ్రమల్లో ఎలక్ట్రిక్ బాయిలర్లు, హీట్ పంపులు, ఫర్నేసులు, ఉక్కు, రసాయనాల తయారీలో గ్రీన్ హైడ్రోజన్ వినియోగంతో 2035 నాటికి 28 శాతం, 2045 నాటికి 61 శాతం ఇంధన డిమాండ్‌ను ప్రత్యామ్నాయాలకు మళ్లించవచ్చని తెలిపింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానం మార్పు కోసం రాయితీ రుణాలు, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని సూచించింది.

విద్యుత్ మౌలిక వసతులే కీలకం..

ఈ లక్ష్యాలను సాధించాలంటే స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, నిల్వ సామర్థ్యాలను భారీగా పెంచాల్సి ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. 2045 ఆర్థిక సంవత్సరం నాటికి వేగవంతమైన విద్యుదీకరణ విధానంలో మొత్తం విద్యుత్ డిమాండ్ 15,785 బిలియన్ యూనిట్లకు చేరనుందని, ప్రస్తుత విధానంలో ఇది 13,059 బిలియన్ యూనిట్లుగా ఉంటుంద‌ని అంచనా వేసింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం అదనంగా 2,726 బిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ప్రస్తుతం దేశ మొత్తం ఇంధన వినియోగంలో విద్యుత్ వాటా 29 శాతంగా ఉండగా, 2035 నాటికి 54 శాతానికి, 2045 నాటికి 76 శాతానికి పెరుగుతుంద‌ని నివేదిక తెలిపింది. ప్రత్యక్ష విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్, బయోఎనర్జీ కలిపి 2045 నాటికి ప్రస్తుత విధానంలో అంచనా వేసిన శిలాజ ఇంధన డిమాండ్‌లో 87 శాతాన్ని భర్తీ చేస్తాయ‌ని పేర్కొంది.

శిలాజ ఇంధ‌నాల‌ను పూర్తిగా ఆపేయ‌డ‌మేనా..?

ఇప్పటికే భారత బ్రాడ్‌గేజ్ రైల్వే నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయింది. సెప్టెంబర్‌లో మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 13.11 శాతంగా నమోదైంది. దేశంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగానికి పైగా శిలాజేతర వనరుల నుంచే వస్తోంది. అయితే 2045 నాటికి ప్రత్యక్ష శిలాజ ఇంధన దిగుమతులు సున్నాకు చేరడం అంటే దేశంలో శిలాజ ఇంధన వినియోగం పూర్తిగా ఆగిపోవడం కాదని నివేదిక స్పష్టం చేసింది. పరిశ్రమల్లో బొగ్గు, విమానయానం, నౌకాయాన రంగాల్లో కొంతమేర ఇంధన వినియోగం కొనసాగుతుందని, అయితే వాటిని దేశీయ ఉత్పత్తి ద్వారా భర్తీ చేయవచ్చని తెలిపింది. ఈ అంచనాలు కేవలం అధ్యయన ఆధారిత పరిస్థితులేనని, లక్ష్యాల సాధనకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు, తక్కువ వడ్డీ రుణాలు, నిరంతర విద్యుత్ సరఫరా, స్థిరమైన బయోఎనర్జీ వనరులు కీలకమని పేర్కొంది.

Advertisement
Advertisement