త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Windfall Tax India | పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు.. డీజిల్‌పైనా పన్ను కోత : సామాన్యులకు కేంద్రం ఊరటనిచ్చిందా?

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. డీజిల్, ఏటీఎఫ్‌ పన్నులు కూడా తగ్గాయి. దీని వల్ల సాధారణ ప్రజలపై పడే ప్రభావం ఏంటి?

J

Business | Published On Aug 15, 2026, 4.08 pm IST

Windfall Tax India | పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు.. డీజిల్‌పైనా పన్ను కోత : సామాన్యులకు కేంద్రం ఊరటనిచ్చిందా?
Advertisement
  • పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ (Windfall tax)ను పూర్తిగా సున్నాకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం
  • డీజిల్ ఎగుమతి సుంకం (SAED) లీటరుకు రూ.25.5 నుంచి రూ.24కు తగ్గింపు
  • విమాన ఇంధనం (ATF) పై ట్యాక్స్ రూ.22 నుంచి రూ.19.5కు కట్
  • ఈ నిర్ణయం వల్ల దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు

Windfall Tax India | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియా (West Asia) సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోల్ ఎగుమతులపై (Petrol Exports) విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను (Windfall Tax) పూర్తిగా రద్దు చేసింది. దీనితో పాటు డీజిల్, విమాన ఇంధన (ATF) ఎగుమతులపైనా సుంకాన్ని తగ్గిస్తూ ఊరటనిచ్చింది.

కొత్త ట్యాక్స్ రేట్లు ఇవే

కేంద్ర ఆర్థిక శాఖ (Finance Ministry) జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 15 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అవేంటంటే..

పెట్రోల్: గతంలో లీటరుకు రూ.3.5 గా ఉన్న ఎగుమతి సుంకం ఇప్పుడు పూర్తిగా సున్నాకు (Nil) చేరింది.

డీజిల్: ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (SAED) లీటరుకు రూ.25.5 నుంచి రూ.24 కు తగ్గింది.

ATF: విమాన ఇంధనంపై ట్యాక్స్ రూ.22 నుంచి రూ.19.5 కు తగ్గింది.

గత ఆగస్టు 3న కేంద్రం ఈ పన్నులను భారీగా పెంచింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆ పన్నుల్లో కోత విధించడం గమనార్హం.

అసలు ఈ పన్ను ఎందుకు వేస్తారు?

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు.. చమురు సంస్థలు (Refiners) దేశీయంగా అమ్మడం కంటే ఎగుమతి చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఆ సమయంలో వారు పొందే అసాధారణ లాభాలకు కళ్లెం వేసి, దేశీయ అవసరాలకు ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వం ఈ పన్నులను సమీక్షిస్తుంది.

సామాన్యుల జేబుపై ప్రభావం ఉంటుందా?

ఈ వార్త వినగానే పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గుతాయేమో అని చాలామంది ఆశిస్తారు. కానీ, ఈ పన్ను తగ్గింపు కేవలం విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనాలపై మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి, దేశీయంగా (Domestic Market) మనం కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం ఉండదు. పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయి. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా ఎగుమతిదారులు, ఆయిల్ రిఫైనరీలకు పన్ను భారం తగ్గనుంది.

Advertisement
Advertisement