త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Immigration | విదేశీ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. భౌతిక బోర్డింగ్ పాస్ అవ‌స‌రం లేదు..

Immigration | సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియలో కీలక మార్పు అమల్లోకి రానుంది. ఇకపై ప్రయాణికులు తప్పనిసరిగా భౌతిక బోర్డింగ్ పాస్‌ను సమర్పించి, దానిపై ఇమ్మిగ్రేషన్ అధికారి నుంచి స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం లేదు.

S

Business | Published On Aug 22, 2026, 5.43 pm IST

Immigration | విదేశీ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. భౌతిక బోర్డింగ్ పాస్ అవ‌స‌రం లేదు..
Advertisement

Immigration | సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియలో కీలక మార్పు అమల్లోకి రానుంది. ఇకపై ప్రయాణికులు తప్పనిసరిగా భౌతిక బోర్డింగ్ పాస్‌ను సమర్పించి, దానిపై ఇమ్మిగ్రేషన్ అధికారి నుంచి స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయాన్ని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అన్ని సంబంధిత వర్గాలకు, అంతర్జాతీయ విమానాశ్రయాల ఆపరేటర్లు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సహా తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మార్చడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఆర్ఓ) దీపక్ యాదవ్ పంపిన అంతర్గత సమాచారంలో ఈ మార్పు వివరాలను వెల్లడించారు.

ఈ-బోర్డింగ్ పాస్ చూపించ‌వ‌చ్చు..

ఇప్పటివరకు ప్రయాణికులు భౌతిక బోర్డింగ్ పాస్‌ను ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద చూపించాల్సి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు. అలాగే బోర్డింగ్ పాస్‌లను సరిగా లేదా తప్పుగా స్టాంప్ చేయడం వల్ల వాటిని చదవడంలో పొరపాట్లు జరిగిన సందర్భాలు కూడా నమోదయ్యాయని ఆ సమాచారంలో పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ అంశాన్ని పరిశీలించిన అనంతరం, దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద భౌతిక బోర్డింగ్ పాస్‌ను తప్పనిసరిగా సమర్పించడం, దానిపై స్టాంప్ వేయించే విధానాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు అంతర్గత సమాచారంలో వెల్లడించింది. ఇకపై ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తమ ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపించవచ్చు. అయితే భౌతిక బోర్డింగ్ పాస్‌లను పూర్తిగా తిరస్కరించడం లేదు. ప్రయాణికులు కోరుకుంటే లేదా వారి వద్ద భౌతిక బోర్డింగ్ పాస్ ఉంటే దానిని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద చూపించవచ్చు. అయితే ఇకపై భౌతిక బోర్డింగ్ పాస్‌పై ఇమ్మిగ్రేషన్ అధికారి స్టాంప్ వేయరు.

సెప్టెంబ‌ర్ 1 నుంచి అమ‌లు..

ఈ మార్పుపై తమ సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ విమానాశ్రయాలు, విమానయాన రంగానికి చెందిన సంబంధిత వర్గాలను ఆదేశించింది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అంటే సెప్టెంబర్ 1 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ ప్రక్రియ నుంచి ఉపశమనం లభించనుంది.

Advertisement
Advertisement