త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CoinDCX | క్రిప్టో సంస్థలకు ఈడీ షాక్‌.. కాయిన్ డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్‌పై దర్యాప్తు..

CoinDCX | క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్‌లైన కాయిన్‌డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల ద్వారా వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తూ, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంబంధిత సంస్థల కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

S

Business | Published On Nov 7, 2026, 3.35 pm IST

CoinDCX | క్రిప్టో సంస్థలకు ఈడీ షాక్‌.. కాయిన్ డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్‌పై దర్యాప్తు..
Advertisement

CoinDCX | క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్‌లైన కాయిన్‌డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల ద్వారా వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తూ, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంబంధిత సంస్థల కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

అనుమ‌తులు లేకుండా విదేశీ షేర్ల ట్రేడింగ్‌..

క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో అక్రమ విదేశీ నగదు బదిలీలు జరిగినట్లు అనుమానిస్తూ కాయిన్‌డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్ ఇండియా సంస్థలపై ఈడీ చర్యలు చేపట్టింది. బెంగళూరు జోనల్ కార్యాలయానికి చెందిన అధికారులు ఫెమా 1999లోని సెక్షన్ 37 కింద మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కాయిన్‌డీసీఎక్స్ నిర్వహణ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డెల్టా ఎక్స్ఛేంజ్ ఇండియాను నిర్వహించే ఎక్సెలియం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సంస్థలు క్రిప్టో స్పాట్ ట్రేడింగ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులతోపాటు విదేశీ కంపెనీల టోకనైజ్డ్ షేర్ల ట్రేడింగ్‌ను అవసరమైన అనుమతులు లేకుండా నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఈడీ పేర్కొంది. బైనాన్స్, కుకోయిన్, గేట్.ఐఓ, బైబిట్ వంటి విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల ద్వారా యూఎస్‌డీటీ స్టేబుల్ కాయిన్లను ఉపయోగించి ఈ లావాదేవీలు జరిగినట్లు ఆరోపించింది.

రూపాయ‌ల‌లో డిపాజిట్లు.. క్రిప్టోల‌లో చెల్లింపులు..

ఈడీ ఆరోపణల ప్రకారం.. కాయిన్‌డీసీఎక్స్ కస్టమర్ల నుంచి రూపాయల రూపంలో డిపాజిట్లు స్వీకరించి వాటిని యూఎస్‌డీటీగా మార్చి విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లకు బదిలీ చేసింది. కోస్టారికాకు చెందిన ఒక సంస్థ పేరుతో ఉన్న ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు, అయితే ఆ సంస్థ కేవలం కాగితాలకే పరిమితమైనదని ఈడీ పేర్కొంది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ల (ఏపీఐ) ద్వారా వాస్తవ లావాదేవీలను కాయిన్‌డీసీఎక్స్ నేరుగా నిర్వహించినట్లు తెలిపింది. వీటి విలువ వేల కోట్ల రూపాయలకు చేరినట్లు అంచనా వేసింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌లోనూ కస్టమర్లు తీసుకున్న పొజిషన్లకు అనుగుణంగా విదేశీ ఎక్స్ఛేంజ్‌లలో 1:1 నిష్పత్తిలో లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపించింది. కస్టమర్లు తమ పొజిషన్లను ముగించినప్పుడు విదేశాల్లోని సంబంధిత ట్రేడింగ్ కూడా ముగించి అక్కడే సెటిల్‌మెంట్ చేసినట్లు వెల్లడించింది. యాపిల్, గూగుల్, టెస్లా వంటి విదేశీ కంపెనీల టోకనైజ్డ్ షేర్ల పేరుతో జరిగిన ట్రేడింగ్ కూడా అసలు షేర్ల కొనుగోలు కాదని, హైపర్‌లిక్విడ్ అనే విదేశీ వికేంద్రీకృత క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించిన డెరివేటివ్ లావాదేవీలని పేర్కొంది. విదేశీ ఎక్స్ఛేంజ్‌లకు యూఎస్‌డీటీ రూపంలో వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఫీజులు చెల్లించినట్లు కూడా ఆరోపించింది.

విదేశీ ప్లాట్‌ఫామ్‌ల‌కు అక్ర‌మంగా మ‌ళ్లింపు..?

మరోవైపు డెల్టా ఎక్స్ఛేంజ్ ఇండియా నిర్వహించిన ఫ్యూచర్స్, ఆప్షన్స్, టోకనైజ్డ్ స్టాక్ లావాదేవీల్లో గణనీయమైన భాగాన్ని కాయిన్‌డీసీఎక్స్ ద్వారా విదేశీ ప్లాట్‌ఫామ్‌లకు మళ్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. అలాగే డెల్టా ఎక్స్ఛేంజ్ ఇండియా నుంచి విదేశాల్లోని అనుబంధ సంస్థలకు వందల కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించి, ఆ లావాదేవీలపై విచారణ కొనసాగిస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంతోపాటు సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) చట్టం-1956, సెబీ చట్టం-1992, ఆర్బీఐ చట్టం-1934 నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా అనే కోణంలోనూ రెండు సంస్థలు అందిస్తున్న సేవలను పరిశీలిస్తున్నట్లు ఈడీ వెల్లడించింది.

Advertisement
Advertisement