త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jensen Huang | జెన్స‌న్ హువాంగ్‌కు హ‌ర్ష‌ధ్వానాల‌తో స్వాగ‌తం ప‌లికిన ఉద్యోగులు.. వీడియో..

Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో కంపెనీ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. నవంబర్ 23న బోర్డు ఏకగ్రీవంగా ఆయనను తిరిగి నియమించింది. అయితే ఆయనపై కొనసాగుతున్న విచారణ, అమెరికా కాంగ్రెస్‌ ప్రశ్నల నేపథ్యంలో ఈ పునర్నియామకంపై వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

S

Business | Published On Nov 24, 2026, 10.30 am IST

Jensen Huang | జెన్స‌న్ హువాంగ్‌కు హ‌ర్ష‌ధ్వానాల‌తో స్వాగ‌తం ప‌లికిన ఉద్యోగులు.. వీడియో..
Advertisement

Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో కంపెనీ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. నవంబర్ 23న బోర్డు ఏకగ్రీవంగా ఆయనను తిరిగి నియమించింది. అయితే ఆయనపై కొనసాగుతున్న విచారణ, అమెరికా కాంగ్రెస్‌ ప్రశ్నల నేపథ్యంలో ఈ పునర్నియామకంపై వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

జెన్స‌న్‌కు హ‌ర్ష‌ధ్వానాల‌తో స్వాగ‌తం..

ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా ప్రధాన కార్యాలయం సోమవారం ఉద్యోగుల నినాదాలతో మార్మోగింది. సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కార్యాలయ లాబీలో గుమిగూడి జెన్సన్.. జెన్సన్.. జెన్సన్ అంటూ నినాదాలు చేశారు. తాము ఆయ‌న‌ను ఎంతో గౌర‌విస్తున్నామ‌ని, తిరిగి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ప‌ట్ల ఎంతో సంతోషంగా ఉంద‌ని చెబుతూ, ఇక మ‌ళ్లీ ప‌నిలోకి దిగాల‌ని ఆహ్వానిస్తూ హ‌ర్ష‌ధ్వానాలు చేశారు. భవనంలోని మూడు అంతస్తుల్లో ఉద్యోగులు నిలబడి ఈ వేడుకను వీక్షించారు. పలువురు తమ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఉద్యోగుల ఆదరణకు స్పందించిన హువాంగ్.. తనకు మరో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి మరింత మెరుగైన సీఈఓగా పనిచేస్తానని చెప్పారు. గతంలో తాను చాలా తీవ్రమైన తప్పులు చేశానని అంగీకరిస్తూ ఉద్యోగులకు క్షమాపణలు కూడా చెప్పారు.

https://twitter.com/RT_com/status/2124951500090712169

1600 మంది ఉద్యోగుల మ‌ద్ద‌తు..

హువాంగ్ తిరిగి రావాలని ఉద్యోగులు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీ అంతర్గత సూచనల విభాగానికి 1,600కు పైగా అభిప్రాయాలు అందగా, ఆయనను తిరిగి తీసుకురావాలని పలువురు బోర్డు సభ్యులను కోరారు. మరోవైపు, ఆయన పునర్నియామకానికి మద్దతుగా నిర్వహించిన ప్రత్యేక పిటిషన్‌కు 1.60 లక్షల మందికి పైగా మద్దతు తెలిపినట్లు సమాచారం. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ స్వాగత కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు. ఎన్విడియాలో తనకు తెలిసిన ప్రతి ఒక్కరూ హువాంగ్ తిరిగి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నవంబర్ 12న హువాంగ్ అధ్యక్ష‌, సీఈఓ, బోర్డు సభ్యుడి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం బోర్డు హార్వే జోన్స్‌ను సంస్థ తొలి ఛైర్మన్‌గా నియమించగా, సీఎఫ్ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. హువాంగ్ విదేశీ నిఘా సంస్థ ప్రయత్నాలకు లక్ష్యంగా మారారని బోర్డు వెల్లడించింది. చైనా నిఘా సంస్థకు చెందిన వ్యక్తితో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు హువాంగ్ అంగీకరించారని వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది.

కొంద‌రు ఉద్యోగుల అసంతృప్తి..

కాగా అంత‌కు ముందు ఎన్విడియా బోర్డు ఏకగ్రీవంగా హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించింది. ఈ నిర్ణయానికి ముందు అమెరికా ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సీఎన్‌బీసీతో మాట్లాడుతూ తాను బోర్డుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మాట్లాడానని, హువాంగ్ ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. అయితే హువాంగ్ తిరిగి రావడంపై ఉద్యోగులందరిలోనూ ఏకాభిప్రాయం లేదు. కొందరు ఉద్యోగులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టామ్స్ హార్డ్‌వేర్ నివేదించింది. బోర్డు అంతర్గత విచారణ పూర్తికాకముందే ఆయనను తిరిగి నియమించడంపై కార్పొరేట్ పాలన నిపుణులు కూడా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, అమెరికా ప్రతినిధుల సభకు చెందిన మూడు కమిటీల నాయకులు జెన్సన్ హువాంగ్, సంస్థ జనరల్ కౌన్సెల్ టిమ్ టెటర్ డిసెంబర్ 1, 2 తేదీల్లో రాతపూర్వకంగా నమోదు చేసే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిందేనని తెలిపారు. బోర్డు నిర్వహించిన స్వల్పకాలిక అంతర్గత విచారణతో జాతీయ భద్రతకు సంబంధించిన ప్రశ్నలు, ముప్పులు తొలగిపోవని వారు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement