త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నీళ్ల కోసం మా ర‌క్తం ఇవ్వ‌డానికి సిద్ధం.. ఇది నీ ర‌క్త‌పిపాసి మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నం

Harish Rao | రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి మా రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి రక్తపిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనమ‌న్నారు. షాబాద్ హత్య కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌కు, రేవంత్ రెడ్డికి తేడా లేదన్నారు.

S

Telangana | Published On Jul 12, 2026, 2.15 pm IST

Harish Rao | నీళ్ల కోసం మా ర‌క్తం ఇవ్వ‌డానికి సిద్ధం.. ఇది నీ ర‌క్త‌పిపాసి మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నం
Advertisement
  • క‌న్నెప‌ల్లి క‌ట్క వ‌త్తువ్యా రేవంత్‌రెడ్డి అంటే ప్ర‌తిప‌క్షాల కంఠం నొక్కుతా అంటుండు
  • నిన్న‌ సీఎం త‌ప్పు మాట్లాడుతుంటే ఉత్త‌మ్ మైక్ తీసుకొని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసిండు
  • షాబాద్ రాజ్‌కుమార్‌కు రేవంత్‌కు మ‌ధ్య తేడా ఏం లేదు
  • ఆరు హ‌త్య‌లు జ‌రిగితే ఓ సీనియ‌ర్ పోలీస్‌ అధికారి గోల్ఫ్ ఆడుతున్న‌డు
  • షాబాద్ ఘటన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు
  • కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి మాత్రం స్పందించలే
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి మా రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి రక్తపిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనమ‌న్నారు. పాపం పండిన నాడు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని శాప‌నార్థాలు పెట్టారు. షాబాద్ హత్య కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌కు, రేవంత్ రెడ్డికి తేడా లేదన్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అలానే అనిపించిందని చెప్పారు. తెలంగాణ భ‌వన్‌లో ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాల‌నపై, రేవంత్ బూతు భాష‌పై నిప్పులు చెరిగారు.

నిన్న సీఎం శాడిస్ట్‌లా మాట్లాడారు. అందులో మూడు ల‌క్ష‌ణాలు స్ప‌ష్టంగా క‌నిపించిన‌య్‌. ప‌చ్చి అబ‌ద్దాలు, బూతులు, శాడిజం. ఆ బూతుల‌తో పోటీ ప‌డ‌లేం. మా క్యారెక్ట‌ర్‌ను మార్చుకోలేం. ఆయ‌న శాప‌నార్థాలు పెడితేనో, జైల్లో పెడ‌తాన‌ని బెదిరింపులు చేస్తేనో భ‌య‌ప‌డం. ఏ గులాబీ సైనికుడికి భ‌యం లేదు. సైకో ఎట్లా ఉన్న‌డో నిన్న‌టి వీడియోలో చూసినం. పొలాల్లో మా ర‌క్తాన్ని పారిస్త‌డ‌ట‌. అధికారంలో ఉండి పంట‌ల‌పై ర‌క్తం చ‌ల్లాలి, బెల్టుతో కొట్టాలి అని మాట్లాడ్డం అత్యంత జుగుప్సాక‌రం. ర‌క్త‌పిపాసి మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నం. నిన్న బోధి పెవిలియ‌న్‌లో మాట్లాడిండు. మాట‌లేమో హింస‌ను ప్రేరేపించే విధంగా ఉన్నయ్. విష‌యం లేనోడు, ప‌రిజ్ఞానం లేనోడో, స‌త్తా లేనోడు ఇట్లా మాట్లాడుత‌డు. నువ్ జారుడు బండ మీద జారిపోతున్న‌వ్. అందుకే ఇలా మాట్లాడుతున్న‌వ్ అని తీవ్రంగా విమ‌ర్శించారు.

ప‌గుళ్లు పెట్టిన పంట పొలాల‌కు నీళ్లివ్వు..

ఆనాడు కేసీఆర్ ప్రాణ‌త్యాగానికి పూనుకొని రాష్ట్రాన్ని సాధించిండు. కానీ నువ్ నీళ్ల‌డిగితే కోస్తా, రక్తం పారిస్తా అని మాట్లాడుతున్న‌వ్‌. నీకు నూవ‌న్న టీవీల చూసుకో. త‌ప్పు తెలుసుకొని మ‌ర్యాద‌గా క్ష‌మాప‌ణ చెప్పు. ఇదే మా డిమాండ్‌. నీ నోరు నీ ఇష్టం. నువ్ ఏమ‌న్నా మాట్లాడుకో.. కానీ నీళ్లు తెలంగాణ‌య్‌.. ఈ విష‌యంలో నీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే కుద‌ర‌దు. క‌న్నెప‌ల్లి క‌ట్క వ‌త్తువ్యా రేవంత్‌రెడ్డి అంటే ప్ర‌తిప‌క్షాల కంఠం నొక్కుతా అంటున్న‌వ్‌. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్య‌మాలు కొత్త కాదు. ల‌క్ష‌ల మంది రైతుల కోసం జైలుకెళ్ల‌డానికి సిద్ధం. కానీ నిన్ను మాత్రం వ‌దిలిపెట్టం. మాకు ఈ రాష్ట్రం ముఖ్యం.. ఈ రైతాంగం ముఖ్యం. ప్ర‌జ‌లు ముఖ్యం. ప్రయోజ‌నం ముఖ్యం. ప్ర‌తిప‌క్షాలను అణ‌చివేయ‌డం మీద ఉన్న శ్ర‌ద్ధ ప‌గుళ్లు పెట్టిన పంట పొలాల‌కు నీళ్లివ్వ‌డంలో నీకు శ్ర‌ద్ధ లేదు. నీళ్లు లేక ప‌త్తి చేన్ల‌కు బిందెల‌తో చిల‌క‌రిస్తున్నారు. నీకు చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదు అని హ‌రీశ్ రావు విమ‌ర్శించారు.

నాలుక క‌ర్సుకొని కొత్త రాగం అందుకున్న‌డు..

వాస్త‌వాలు చెప్ప‌డానికి నేను ఈరోజు మ‌ళ్లీ మాట్లాడుతున్న. నిన్న అవే ప‌చ్చి అబద్దాలు మాట్లాడిండు. న‌ల్ల‌ల నీళ్లుంటేనే శెంబుల ప‌ట్టుకుంటం. రాష్ట్రంలో ఎల్‌నినో వ‌చ్చింది.. నీళ్లే లేవ్ యాడికెంచి ఎత్తాల్న‌యా అని మొన్న రేవంత్ మాట్లాడిండు. మేం ఎన్ని నీళ్లు వృథా పోతున్న‌యో లైవ్‌లో చూపెట్టినం. కేటీఆర్ అక్క‌డికి వెళ్లి స్వ‌యంగా చూపించారు. దాంతో నాలుక క‌ర్సుకొని మ‌ళ్లా కొత్త రాగం అందుకున్న‌డు. నీళ్లున్న‌య్ గ‌ని ఎన్‌డీఎస్ఏ చెప్పిన‌ట్లే చేస్త‌మంట‌డు. మేడిగ‌డ్డ గేట్లు మూయ‌కుండా క‌న్నేప‌ల్లి ద‌గ్గ‌ర నీళ్లు ఎట్ల ఎత్తుత‌మ్ అని మాట్లాడిండు. నాకు జాలి క‌లుగుతుంది నిన్ను చూస్తే.

నీకు కావాల్సింది 93.5 మీట‌ర్లు మాత్ర‌మే..

సీఎం మాట్లాడుతుంటే ఉత్త‌మ్ మ‌ధ్య‌ల మైక్ తీసుకుండు. త‌ప్పు మాట్లాడిండ‌ని ఉత్తమ్ బుర్ర ఎలిగింది. ఆ త‌ప్పును స‌రిజేసే ప్ర‌య‌త్నం చేసిండు. అందుకే నాకు జాలి క‌లుగుతుంది. 31 నెల‌లు సీఎంగా పని చేసినా బూతులు త‌ప్పా విష‌య ప‌రిజ్ఞానం పెంచుకోలే. 93.5 మీట‌ర్ల ఎత్తులో క‌న్నేప‌ల్లి మోట‌ర్లు న‌డుస్త‌య్. గోదావ‌రిలో ల‌క్ష క్యూసెక్కుల వ‌ర‌ద పోతుంది. దాని లెవ‌ల్ 97 మీటర్లు ఉంట‌ది. అంటే గేట్లు తెరిచి ఉన్నా 97 మీ. ఎత్తులో గోదావ‌రి ప్ర‌వ‌హిస్తుంది. నీకు కావాల్సింది 93.5 మీట‌ర్లు మాత్ర‌మే. మోట‌ర్లు ఒత్తు నీళ్లొస్త‌య్‌. ఈ విష‌యాన్ని రిటైర్డ్ ఇంజినీర్లు కూడా చెప్పిండ్రు. రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే సామ‌ర్థ్యం క‌లిగి ఉంది అని చెప్పారు. ఉత్త‌మ్‌కొచ్చిన సోయి కూడా నీకు రాక‌పాయే.

ఒక అబ‌ద్దాన్ని 100 సార్లు వ‌ల్లే వేస్తే నిజం అయిత‌దా?

ప్రముఖ వార్తా ప‌త్రిక‌లో ఒక వార్త వ‌చ్చింది. ఇందులో చాలా స్ప‌ష్టంగా ఉంది. అన్నారం నుంచి సుందిళ్ల.. ఇక్క‌డి నుంచి ఎల్లంప‌ల్లికి నీళ్లు ఎత్త‌డానికి ఇబ్బంది లేద‌ని ఆ ప‌త్రిక‌లో రాశారు. ప్ర‌స్తుత ఇంజినీర్లు కూడా చెప్పారు. చిన్న కాప‌ర్ డ్యామ్‌ను రూ.8 కోట్ల ఖ‌ర్చుతో క‌ట్టుకొని నీళ్లు ఎల్లంప‌ల్లికి తీసుకెళ్లొచ్చ‌ని తెలంగాణ నీళ్ల శాఖ రాసిన లేఖ‌ను బ‌య‌ట‌పెట్టండి. అందులో నీళ్లు ఎత్తొచ్చ‌ని స్ప‌ష్టంగా రాశారు. ప్ర‌జ‌లను, రాష్ట్రాన్ని ఎట్ల కాపాడుకోవాల‌నే త‌పన ఉండాలే ముఖ్య‌మంత్రికి. ప్ర‌శ్నించిన వారిని ఇబ్బంది పెడుత‌వ్‌. మేడిగ‌డ్డ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తీసుకెళ్లొచ్చు. ఒక అబ‌ద్దాన్ని 100 సార్లు వ‌ల్లే వేస్తే నిజం అయిత‌దా రేవంత్‌రెడ్డి గారూ.. ఇది అఫిడ‌విట్.. ఉత్త కాయిదం కాదు. రిటైర్డ్, ప్ర‌స్తుత‌ ఇంజినీర్లు చెప్పిన‌ట్లు చేస్తే కాంగ్రెస్ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుత‌ద‌ని భ‌యం. ఈగోల‌కు పోయి నీళ్లు ఇస్త‌లేరు అని హ‌రీశ్ ఆరోపించారు.

నీది నోరా.. మోరీ ఆ..

ఎల్లంప‌ల్లి క‌ట్టి 20 ఏండ్లు అయింద‌ట‌. అప్ప‌టి నుంచి ప‌ని చేస్తుంద‌ట‌. నువ్ ఏం మాట్లాడినా ప్ర‌జ‌లు న‌మ్ముత‌ర‌ని భావిస్తున్న‌వా? ప్ర‌జ‌లు నీకంటే నాకంటే తెలివైన‌వాళ్లు. వాళ్లు ప్ర‌తిదీ గ‌మ‌నిస్తున్న‌రు. గ‌తంలో అసెంబ్లీలో కూడా చెప్పిన‌. స‌వాల్ విసిరినా.. ఆరోజు తోక ముడిచిండ్రు. 2004లో ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుకు 3,100 కోట్ల రూపాయ‌ల‌తో శంకుస్థాప‌న జ‌రిగింది. ఆ శిలాఫ‌ల‌కం మీద ఈరోజు కూడా నా పేరు ఉంట‌ది. 2014 నాటికి కొన్ని నీళ్లు నిల్వ చేశారు. మేం వ‌చ్చేనాటికి 18 వేల ఎక‌రాలే భూసేక‌ర‌ణ జ‌రిగింది. మేం వ‌చ్చిన త‌ర్వాత 27,387 ఎక‌రాల‌కు భూసేక‌ర‌ణ పూర్తి చేసినం. ఊర్లు మునిగిపోయిన వాళ్ల కోసం 1,448 ఇండ్లు మాత్ర‌మే కాంగ్రెస్ క‌ట్టింది. మేం 13296 ఇండ్లు పూర్తి చేసి షిప్ట్ చేసినం. క‌రీంన‌గ‌ర్ ఆదిలాబాద్ మ‌ధ్య ఉన్న రాయ‌ప‌ట్నం వంతెన‌ను పూర్తి చేసినం. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం 2,052 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఎల్లంప‌ల్లిలో 20 టీఎంసీలు నీళ్లు నింపి హైద‌రాబాద్‌కు నీళ్లు తెచ్చినం. కాంగ్రెస్ క‌ట్టింద‌ని రేవంత్ అంట‌డు. అది నోరా.. మోరీ ఆ.. అని ఫైర‌య్యారు.

హైద‌రాబాద్‌కు 10 టీఎంసీలు కావాలే..

ఎల్లంప‌ల్లి మీద ఎన్‌టీపీసీ, సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్‌, హైద‌రాబాద్ మంచినీళ్లు, రామ‌గుండం మున్సిపాలిటీతో పాటు మంచిర్యాలకు తాగునీరు ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌స్తుతం 8 టీఎంసీల వ‌ర‌కు నీరు ఉంది. డెడ్ స్టోరేజ్ 4 టీఎంసీలు పోత‌య్‌. ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్ప‌త్తి కోసం 5 టీఎంసీలు కావాలే. సింగ‌రేణిలో విద్యుత్ ఉత్ప‌త్తి ఆగొద్దంటే సంవత్స‌రానికి 5 టీఎంసీల నీరు కావాలే. హైద‌రాబాద్ మంచినీళ్ల‌కు 10 టీఎంసీలు కావాలే. లోక‌ల్ డ్రింకింగ్ కోసం రెండు మూడు టీఎంసీలు కావాలే. ఇప్పుడు అక్క‌డ 4 టీఎంసీలు కూడా లేవ్‌. నువ్ ప‌ట్టింపుల‌కు పోతే రేపు క‌రెంటు కూడా ఉత్ప‌త్తి ఆగిపోయి రేపు తెలంగాణ అంధ‌కారం అయ్యే ప్ర‌మాదం ఉంది మిస్ట‌ర్ రేవంత్‌రెడ్డి.

ఒక జ‌ర్న‌లిస్టు క‌రువు ప‌రిస్థితుల‌పై రేవంత్‌ను అడిగితే ప్ర‌తిప‌క్షాల రక్తం చిందిస్తే నీళ్లు వ‌స్త‌య్ అని మాట్లాడిండు. ఇదా నువ్ మాట్లాడేది? ఇప్పుడు స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేసుకుందామా.. స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్త‌వా? హిట్ల‌ర్‌కు నీకున్న తేడా ఏంది?

బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టు క‌ట్ట‌లేద‌ట‌.. ఒక్క ఎక‌రానికి కూడా నీళ్లు ఇయ్య‌లేద‌ట‌.. కాంగ్రెస్ కృషి వ‌ల్ల‌నే దేశంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్ అయింద‌ట‌.. నిన్న రేవంత్ మాట్లాడుత‌డు. బీఆర్ఎస్ 10 ఏండ్ల‌లో 48 ల‌క్ష‌ల 74 వేల ఎక‌రాల‌కు నీళ్లిచ్చింది. అంత‌కుముందు కాంగ్రెస్ ఇచ్చింది 6 ల‌క్ష‌ల 64 వేల ఎక‌రాల‌కే నీళ్లు ఇచ్చారు. రేవంత్ నీకు కావాలంటే ప్రాజెక్ట్ వైస్ కూడా పంపిస్తా. కొత్త ఆయ‌క‌ట్టు 17 ల‌క్ష‌ల 24 వేల ఎక‌రాలు. మిష‌న్ కాక‌తీయ, స్టెబులైజేష‌న్ ఆఫ్ ప్రాజెక్టుల కింద 31 లక్ష‌ల ఎక‌రాలకు నీళ్లు ఇచ్చినం. నీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోనే నీళ్లిచ్చినం. 30 ఏండ్ల‌లో మీరిచ్చింది 46 వేల ఎక‌రాల‌కు. మేం ప్రాజెక్ట్ సైట్ల ద‌గ్గ‌ర నిద్ర‌పోయి ఆరున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీ జిల్లాలో నీళ్లు ఇచ్చినం. క‌ల్వ‌కుర్తికి నీళ్లు ఎవ‌రు తెచ్చారో పోయి అడుగు. జ‌డ్చ‌ర్ల‌కు, నాగ‌ర్‌క‌ర్నూల్‌కు గాని నీళ్లు ఇచ్చింది ఎవ‌రు? అని నిల‌దీశారు.

నిన్న షాబాద్‌లో హ‌త్య‌లు జ‌రిగితే ఓ సీనియ‌ర్ పోలీస్‌ అధికారి గోల్ఫ్ ఆడుతున్న‌డు..

నీ ద‌గ్గ‌ర విష‌యం లేదు కాబ‌ట్టే ఇలా త‌యార‌య్యావ్‌. షాబాద్ రాజ్‌కుమార్‌కు రేవంత్‌కు మ‌ధ్య తేడా ఏం లేదు. రాజ్‌కుమార్ ఒక సైకో. ఎంత సైకో అయితే అలా దారుణాతి దారుణంగా చంపేశాడు. చాలా బాధ క‌లుగుతుంది. విక‌లాంగురాలు మిగిలింది. ఆ చిన్న పాప ప‌రిస్థితి ఏంది. ఇంత జ‌రిగితే ప‌క్క రాష్ట్రం సీఎం స్పందించిండు. కానీ రేవంత్ స్పందించ‌లే. రాష్ట్రానికి చెందిన ఒక సీనియ‌ర్ అధికారి నిన్న మ‌ధ్యాహ్నం పూట గోల్ఫ్ ఆడుతున్న‌డు. సీఎం ఎట్లున్న‌డో ప‌రిపాల‌న గ‌ట్లే ఉంది అని హ‌రీశ్ రావు మండిప‌డ్డారు.

68 లక్షల నుంచి 2.60 కోట్ల టన్నుల వరి దిగుబడి ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే. ఏడు వేల కోట్లతో పోలవరాన్ని ముంచిన అధికారులతో.. మేడిగడ్డపై రిపోర్టులా? పట్టిసీమకు నీళ్లు వదిలేసి.. గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇచ్చుకున్న‌డు. నన్ను జైల్లో వేసినా సరే.. నా ప్రాణం పోయినా సరే.. వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులను కాపాడండి. రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ ఫీజబుల్ కాదని ఏనాడూ చెప్పలేదు. మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి, వరస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని సాక్షాత్తూ వారే జస్టిస్ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ ఇచ్చారు.

2014-15లో రాష్ట్రంలో పండిన వరి కేవలం 68 లక్షల టన్నులు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల 24 గంటల కరెంట్, రైతుబంధు, సాగునీరు వల్ల 2023-24 నాటికి ఏకంగా 2 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. వరి సాగు 34 లక్షల ఎకరాల నుంచి కోటి 18 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది ముమ్మాటికీ కేసీఆర్ గారి ఘనత. అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు ఆపితే భద్రాచలం మునిగిపోతుందనడం శుద్ధ అబద్ధం. అన్నారంలో 5 టీఎంసీలు, సుందిల్లలో 3.8 టీఎంసీలు మొత్తం 8.8 టీఎంసీలు నిలిపితే.. ఒకవేళ రెండు బ్యారేజీలకు ఒకేసారి ఇబ్బంది వచ్చినా కిందికి వెళ్లేది కేవలం 1.10 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే. 2022లో ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలం ఏమీ కాలేదు. అలాంటిది లక్ష క్యూసెక్కులకే భద్రాచలం కొట్టుకుపోతుందని సీఎం చెవిలో పూలు పెడుతున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని రేవంత్ రెడ్డి పదే పదే అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిందే 87 వేల కోట్లు. ఈ విషయం సీఎం మామ సూదిని పద్మారెడ్డి గారే ఒక వీడియోలో స్వయంగా చెప్పారు, కావాలంటే ఆ వీడియో పంపుతాను చూసుకోండి. ఈ 87 వేల కోట్లలో మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య ఉన్నది కేవలం 10% మాత్రమే. మిగతా 90% సిస్టమ్ మిడ్ మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అంతా ఇంటాక్ట్ గా సురక్షితంగా ఉంది. ఎక్స్‌ప‌ర్ట్స్ ను, ఆర్మీ ఇంజనీర్లను తెచ్చామని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డికి ఏ సీజన్‌లో పనులు చేయాలో తెలియదు. మీరు ఆర్మీ ఇంజనీర్లను తెచ్చి ఇంత పడగొట్టింది ఏంటి అని ప్ర‌శ్నించారు.

NDSA బైబిల్ లాగా కనిపిస్తోంది..

ఎస్ఎల్బీసీ కుప్పకూలి 8 మంది చనిపోవడమా.. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడమా.. వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడమా.. ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడమా.. ఇవేనా మీ ఆర్మీ ఇంజనీర్ల గొప్పతనం? నాడు ఎంపీగా ఉన్నప్పుడు NDSA చట్టం రాష్ట్రాల హక్కులు కాలరాయడమే అని వ్యతిరేకించి, రాతపూర్వకంగా ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేడు అదే NDSA బైబిల్ లాగా కనిపిస్తోంది. మేడిగడ్డపై రిపోర్ట్ ఇచ్చిన NDSA చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్.. 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సీఈవోలు. వారి హయాంలోనే పోలవరం కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ఆరు సార్లు కొట్టుకుపోయి రూ.7 వేల కోట్లకు పైగా నష్టం జరిగింది. ఆ 7 వేల కోట్లు నష్టం చేసిన వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చి ఇక్కడకు పంపితే.. వాళ్లు మేడిగడ్డ 3 పిల్లర్ల కుంగుబాటుపై రిపోర్టులు ఇస్తారా. ఎల్‌నినో కరువు పరిస్థితుల్లో ప్రతి చుక్క ముఖ్యం. ఇప్పుడున్న 50-60 వేల క్యూసెక్కుల వరదను కన్నెపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తుకోవాలి.

ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే చెప్పారు..

దేవాదులలో 10 మోటార్లు ఉంటే 4 మాత్రమే నడుపుతూ, 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట కేవలం 1200 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతున్నారు. వరంగల్, ధర్మసాగర్, పాలకుర్తిలలో 75% చెరువులు ఎండిపోయినా పట్టించుకోవడం లేదు. మోటార్లు బంద్ పెట్టి, నీళ్లు కిందకు వదిలేస్తూ ఆంధ్రాలోని పట్టిసీమకు మేలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పాలన కాదు, గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్న గురుదక్షిణ. పార్టీలు, చొక్కాలు మార్చినట్లు మార్చే రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే చెప్పారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో 12% కమీషన్లు, రెవెన్యూలో 30% కమీషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారు. ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి బొట్టుకు తెలంగాణ సమాజం రేపు మిమ్మల్ని దోషిగా బోనులో నిలబెడుతుంది. ఖబర్దార్ అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

 

Advertisement
Advertisement