త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | యాసంగికి ముందే నీటి లభ్యతపై శాస్త్రీయ అంచనా

Uttam Kumar Reddy | ఎల్‌నినో (El Nino) ముప్పు నేపథ్యంలో యాసంగికి ముందే నీటి ల‌భ్య‌త‌ (Water Availability)పై శాస్త్రీయంగా అంచ‌నా వేస్తామ‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.

S

Telangana | Published On Nov 13, 2026, 6.09 pm IST

Uttam Kumar Reddy | యాసంగికి ముందే నీటి లభ్యతపై శాస్త్రీయ అంచనా
Advertisement
  • భూగర్భ జలాల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్త కార్యాచరణ
  • తక్కువ నీటితో సాగయ్యే పంటలనే వేసుకోవాలి
  • మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్‌: ఎల్‌నినో (El Nino) ముప్పు నేపథ్యంలో యాసంగి (Rabi Season)కి ముందే నీటి ల‌భ్య‌త‌(Ground Water)పై శాస్త్రీయంగా అంచ‌నా వేస్తామ‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. భూగ‌ర్భ జ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు రాష్ట్రవ్యాప్త కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌న్నారు. రైతులు త‌క్కువ నీటితో సాగ‌య్యే పంట‌ల‌నే సాగు చేసుకోవాల‌ని కోరారు. రాష్ట్ర‌ సచివాలయంలోని తన కార్యాలయంలో పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులు, నిపుణులతో ఉత్తమ్ భూగర్భ జలాల పరిస్థితిని సమీక్షించారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వెలికితీతను నియంత్రించడం, అందుబాటులో ఉన్న జలవనరులను సుస్థిరంగా వినియోగించుకోవడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాల స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని, దాని ఆధారంగా అధికారులతో చర్చించి శాఖల సమన్వయంతో కార్యాచరణను రూపొందిస్తామని మంత్రి తెలిపారు.

వీరేంద్ర తివారీ ఏం చెప్పారంటే..

సీఎస్‌ఐఆర్‌-నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నిపుణుడు, ఐఐటీ హైదరాబాద్‌ అనుబంధ ఆచార్యుడు ప్రొఫెసర్‌ వీరేంద్ర తివారీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. భూగర్భ జలాల అంచనా కమిటీ (జీఈసీ) నమూనాను ఉపయోగించి వర్షపాత గణాంకాలను భూగర్భ జల నిల్వలతో పోల్చి తక్షణమే అంచనా వేయాలని సూచించారు. ప్రాథమిక అంచనాను కొద్ది రోజుల్లోనే పూర్తి చేయవచ్చని తెలిపారు.

94 శాతానికి పైగా సాగుకే వెళ్తోందని, గృహావసరాలు, ఇతర వినియోగాల వాటా సుమారు 1.8 శాతమని తివారీ పేర్కొన్నారు. ప్రతి వాటర్‌షెడ్‌ (జల పరీవాహక ప్రాంతం) పరిధిలో భూగర్భ జలాల లభ్యత ఎంత, సాగుకు అవసరమైన నీరు ఎంత అనే వివరాలను పటాల రూపంలో పొందుపరచాలన్నారు. ఆ వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాలకు అనువైన పంటలను రైతులకు సూచించాలని చెప్పారు. తగినంత నీటి నిల్వలున్న ప్రాంతాల్లో వరి సాగుకు అవకాశం ఉంటుందని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తివారీ సూచించారు. ఆయా పంటల సాగుతో ఎంత ఆదాయం పొందవచ్చో ప్రభుత్వం రైతులకు వివరించాలన్నారు.

పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్

పరిమిత సంఖ్యలో సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, అది నేరుగా రాష్ట్ర నాయకత్వానికి నివేదించేలా చూడాలని తివారీ ప్రతిపాదించారు. వారానికోసారి, పది రోజులకోసారి లేదా రెండు వారాలకోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలను సమన్వయం చేయాలన్నారు.

ఈ సూచనలపై స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భూగర్భ జలాల శాఖను బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. శాఖకు అవసరమైన మౌలిక వసతులు, నిధులు, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలను పరిశీలిస్తామన్నారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే ఇజ్రాయెల్‌ తదితర దేశాలు అందుబాటులో ఉన్న ప్రతి వానచుక్కను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకుంటున్న తీరును ప్రస్తావించారు. తెలంగాణలోనూ ఆ విధానాన్ని అనుసరించాలన్నారు.

వచ్చే వర్షాకాలం వరకు జల సంరక్షణను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉమ్మడి బాధ్యతగా తీసుకోవాలని మంత్రి అన్నారు. భవిష్యత్తులో వర్షపాతం తగ్గినా పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వర్షపు నీటి సేకరణ, సంరక్షణకు పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

సమీక్షలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఈఎన్‌సీ (జనరల్‌) ఓ.వి. రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్‌, భూగర్భ జలాల శాఖ డైరెక్టర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement