త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohan Bhagwat | పాఠ్యపుస్తకాల్లో హిందూ దేవతల స‌మాచారం ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భాగవత్‌

Mohan Bhagwat | హిందూ దేవతలు, వారి విశిష్టతలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్ అభిప్రాయప‌డ్డారు. పిల్లలు మతానికి సంబంధించిన సందేహాలు అడిగినప్పుడు తల్లిదండ్రులు సమాధానం చెప్పగలిగేంత అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

P

National | Published On Jul 25, 2026, 4.08 pm IST

Mohan Bhagwat | పాఠ్యపుస్తకాల్లో హిందూ దేవతల స‌మాచారం ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భాగవత్‌
Advertisement

Mohan Bhagwat | హిందూ దేవతలు, వారి విశిష్టతలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్ అభిప్రాయప‌డ్డారు. పిల్లలు మతానికి సంబంధించిన సందేహాలు అడిగినప్పుడు తల్లిదండ్రులు సమాధానం చెప్పగలిగేంత అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విశ్వ మాంగల్య సభ ఆధ్వర్యంలో 'యుగానుకూల్‌ మదర్‌హుడ్' పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. పిల్లలు దేవతల రూపాలు, పురాణాల గురించి ప్రశ్నలు అడుగుతుంటారని, అయితే చాలామంది తల్లిదండ్రులు వాటికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. 'ఈ దేవుడికి కోతి ముఖం ఎందుకు ఉంది? ఆ దేవుడికి ఏనుగు తల ఎందుకు వచ్చింది?' వంటి సందేహాలు పిల్లల్లో సహజంగానే వస్తాయని, వాటికి పెద్దలే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉండకూడదన్నారు.

అవ‌గాహ‌న క‌ల్పించిన కుటుంబం బాధ్య‌త‌..

ఇలాంటి విషయాలను చిన్నప్పటి నుంచే పాఠ్యపుస్తకాల ద్వారా పరిచయం చేయాలని సూచించారు. పిల్లలకు ఏ జ్ఞానం అందిస్తే అదే వారి ఆలోచనల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. 12 ఏళ్లలో పిల్లల వ్యక్తిత్వం, ఆలోచనా విధానం రూపుదిద్దుకుంటాయని, ఆ దశలో సరైన అవగాహన కల్పించడం కుటుంబ బాధ్యత అని అన్నారు. పిల్లలకు చెప్పే విషయాలను తల్లిదండ్రులు కూడా తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేటి తరం పిల్లల పెంపకంలో పాత పద్ధతులు సరిపోవని మోహ‌న్ భాగవత్‌ అన్నారు. తమ చిన్నతనంలో తల్లిదండ్రులు చెప్పిన మాటను ప్రశ్నించకుండా పాటించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పిల్లలు ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నార‌ని తెలిపారు. అందుకే వారితో కఠినంగా వ్యవహరించడం కంటే విషయాన్ని వివరించి చెప్పడం అవసరమన్నారు. భౌతికవాద ప్రభావం అధికంగా ఉన్న వాతావరణంలో పెరుగుతున్న పిల్లలకు సరైన దిశ చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు. పిల్లలకు ప్రేమ, సమయం, సంభాషణ, చర్చ అవసరమని, ఆదేశాలతో కాదు.. పరస్పర అవగాహనతో వారిని తీర్చిదిద్దాలని సూచించారు.

మొబైల్ వినియోగంపై ఆందోళ‌న‌..

కుటుంబ సభ్యుల మధ్య మాటామంతీ తగ్గిపోతుండటంపై భాగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉండటంతో ఇంట్లో మాట్లాడుకునే సమయం క్రమంగా తగ్గుతోందన్నారు. ఉద్యోగాలు, పాఠశాలల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరికివారు మొబైల్‌లకే పరిమితమవుతున్నారని, ఒకే ఇంట్లో ఉన్నా పరస్పరం కలుసుకునే అవకాశాలు తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులు ఒకరికొకరు సమయం కేటాయించినప్పుడే పిల్లలు తమ సందేహాలు, ఆలోచనలు పంచుకుంటారని చెప్పారు. వారితో నిరంతరం మాట్లాడితేనే వారి జిజ్ఞాసకు సరైన సమాధానాలు ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. తల్లిదండ్రుల మాటల కంటే.. వారి ప్రవర్తననే పిల్లలు ఎక్కువగా గమనిస్తారని భాగవత్‌ అన్నారు. చెప్పేది ఒకటి, ఆచరించేది మరొకటి అయితే పిల్లలు వెంటనే ఆ తేడాను గుర్తిస్తారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పెద్దలు చెప్పే విలువలపై వారికి నమ్మకం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రేమ, సంభాషణ, ఆదర్శప్రాయమైన ప్రవర్తన ద్వారానే పిల్లల్లో విలువలు పెంపొందుతాయని అన్నారు. ఈ పునాది బలంగా ఉంటే సాంకేతికత ప్రభావం నుంచి వారు సులభంగా బయటపడగలరని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలతో అనుబంధాన్ని కొనసాగించాలని భ‌గ‌వ‌త్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement