త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NH -365 BG | అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. హైద‌రాబాద్ – వైజాగ్ మ‌ధ్య 56 కి.మీ. దూరం త‌గ్గింపు

NH -365 BG | తెలంగాణ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే (NH-365 BG) అందుబాటులోకి వ‌చ్చింది. ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలోని దేవ‌ర‌ప‌ల్లి నుంచి తెలంగాణ‌లోని ఖ‌మ్మం వ‌ర‌కు హైవే నిర్మాణ ప‌నులు దాదాపు పూర్తి కావ‌డంతో.. ట్ర‌య‌ల్ ర‌న్ నిమిత్తం వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.

S

Telangana | Published On Apr 12, 2026, 2.21 pm IST

NH -365 BG | అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. హైద‌రాబాద్ – వైజాగ్ మ‌ధ్య 56 కి.మీ. దూరం త‌గ్గింపు
Advertisement

NH -365 BG | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే (ఎన్‌హెచ్‌-365బీజీ) అందుబాటులోకి వ‌చ్చింది. ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలోని దేవ‌ర‌ప‌ల్లి నుంచి తెలంగాణ‌లోని ఖ‌మ్మం వ‌ర‌కు హైవే నిర్మాణ ప‌నులు దాదాపు పూర్తి కావ‌డంతో.. ట్ర‌య‌ల్ ర‌న్ నిమిత్తం వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. దేవ‌ర‌ప‌ల్లి నుంచి వైరా స‌మీపంలోని సోమ‌వరం మ‌ధ్య నాలుగు లేన్ల ర‌హ‌దారిపై వాహ‌నాల రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. ఇక ఖ‌మ్మం స‌మీపంలో మున్నేటి వంతెన‌, ధంస‌లాపురం వ‌ద్ద రైల్వే వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. దీంతో ఖ‌మ్మం వ‌ర‌కు రాక‌పోక‌ల‌కు మ‌రి కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇక విజ‌య‌వాడ వెళ్ల‌కుండానే వైజాగ్‌కు

ప్ర‌స్తుతం వాహ‌న‌దారులు హైద‌రాబాద్ నుంచి విశాఖ వెళ్లేవారు త‌ప్ప‌నిస‌రిగా విజ‌య‌వాడ మీదుగా వెళ్లాల్సిందే. 12 గంట‌ల పాటు 620కి పైగా కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి రావ‌డంతో.. హైద‌రాబాద్ - వైజాగ్ మ‌ధ్య 56 కి.మీ. దూరం త‌గ్గుతుంది. ప్ర‌యాణ స‌మ‌యం 9 గంట‌ల‌కు త‌గ్గుతుంది. ఇప్పుడు విజ‌య‌వాడ వెళ్ల‌కుండానే.. సూర్యాపేట మీదుగా ఖ‌మ్మం, వైరా, తిరువూరు, జంగారెడ్డిగూడెం, దేవ‌ర‌ప‌ల్లి మీదుగా వైజాగ్ చేరుకోవ‌చ్చు. ఈ ఎన్‌హెచ్ -365 బీజీ ప‌నులు 2022లో ప్రారంభం కాగా, 2024 నాటికే పూర్తి కావాల్సి ఉండే. భూసేక‌ర‌ణ‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల వ‌ల్ల రెండేండ్లు ఆల‌స్య‌మైంది.

బైక్‌లు, ఆటోలు, ట్రాక్ట‌ర్ల‌కు అనుమ‌తి లేదు..

ఎన్‌హెచ్ -365 బీజీ హైవేపై బైక్‌లు, ఆటోలు, ట్రాక్ట‌ర్ల రాక‌పోక‌ల‌కు ఎలాంటి అనుమ‌తి లేదు. కేవ‌లం కార్లు, బ‌స్సులు, లారీల‌తో పాటు భారీ వాహ‌నాల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. కార్లు గంటకు 100 కి.మీ., లారీలు ఇత‌ర వాహ‌నాల‌కు గంట‌కు 80 కి.మీ. వేగంతో ప్ర‌యాణించేందుకు వీలుంది.

Advertisement
Advertisement