త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | నాడు పోతిరెడ్డిపాడు.. నేడు పల్నాడు

Dasoju Sravan Kumar | తెలంగాణ ప్రజల జీవనాడి కృష్ణా జలాలపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. నాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో తెలంగాణ నీటి హక్కులకు గండికొట్టిన కాంగ్రెస్.. నేడు పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో నాగార్జున సాగర్ జలాలను తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు.

P

Telangana | Published On Nov 23, 2026, 5.06 pm IST

Dasoju Sravan Kumar | నాడు పోతిరెడ్డిపాడు.. నేడు పల్నాడు
Advertisement
  • కృష్ణా జలాల దోపిడీకి ఏపీ మరో కుట్ర..
  • కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఫైర్
  • పల్నాడు వాటర్ గ్రిడ్‌తో నాగార్జున సాగర్‌కు ముప్పు..
  • దమ్ముంటే కేఆర్ఎంబీ వద్దకు వచ్చి ప్రాజెక్టును అడ్డుకోండి..
  • లేకుంటే జలదోపిడీలో మీరూ భాగస్వాములే
  • రేవంత్ సర్కార్ మౌనంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం
  • గల్లీగల్లీలో కాంగ్రెస్ నేతలను నిలదీస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌

Dasoju Sravan Kumar | తెలంగాణ ప్రజల జీవనాడి కృష్ణా జలాలపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. నాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో తెలంగాణ నీటి హక్కులకు గండికొట్టిన కాంగ్రెస్.. నేడు పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో నాగార్జున సాగర్ జలాలను తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మరో మహా జల ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితర నేతలతో కలిసి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్ నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా త‌ర‌లింపు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాల నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించారని శ్రవణ్ ఆరోపించారు. అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్‌కు వంతపాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా జలదోపిడీ ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ డెడ్ స్టోరేజీ 510 అడుగులుగా ఉండగా, ఏపీ ప్రభుత్వం 493 అడుగుల లోతు నుంచే నీటిని తోడుకునేలా పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతోందని ఆరోపించారు. ఇది గతంలోని పోతిరెడ్డిపాడు కంటే ప్రమాదకరమైన పరిణామమని హెచ్చరించారు.

రక్షకులే భక్షకులైతే ఎలా?

తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడంపై శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో రాజకీయ ప్రయోజనాల కోసం లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన వారే వాటిని వదులుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలని నిలదీశారు. నాడు వైఎస్సార్ హయాంలో జరిగిన జలదోపిడీకి, నేడు సాగర్ విషయంలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ వైఖరే కారణమని విమర్శించారు. రక్షకులుగా ఉండాల్సిన పాలకులే భక్షకులుగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌కు తాగునీటి గండం

కృష్ణా జలాలపై తెలంగాణలో సుమారు రెండున్నర కోట్ల మంది ఆధారపడి ఉన్నారని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కోటికి పైగా ప్రజలకు నీటి అవసరాలు ఉన్నాయని శ్రవణ్ గుర్తుచేశారు. గత ఆరు నెలలుగా కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు వెయ్యి టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా, వాటిని వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఫలితంగా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయి హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తీవ్రమవుతోందని పేర్కొన్నారు. గతంలో రూ.800కు లభించిన వాటర్ ట్యాంకర్ ప్రస్తుతం రూ.2వేలు చెల్లించినా దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. నీటి కొరత కారణంగా హాస్టళ్లు, ఐటీ సంస్థలు, ఇతర కంపెనీల నిర్వహణపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, చెక్‌డ్యామ్‌లు ఎండిపోవడంతో పశుపక్షాదులకు తాగునీరు కరువైందన్నారు. సుమారు 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి బీఆర్ఎస్ సవాల్

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని సూచించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో కేఆర్ఎంబీకి ఆధారాలతో ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఏపీ ప్రాజెక్టును నిలువరించాలని సవాల్ విసిరారు. అలా చేయకపోతే జలదోపిడీ కుట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమూ భాగస్వామేనని తెలంగాణ సమాజం భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.

గల్లీగల్లీలో కాంగ్రెస్ నేతలను నిలదీస్తాం

కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు శ్రవణ్ ప్రకటించారు. రానున్న రోజుల్లో నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌లోని ప్రతి గల్లీలో కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు, రైతుల ప్రయోజనాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలదోపిడీని అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement