త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజంలో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారం

Telangana | తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, విద్య, వైద్య సేవలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. అందులో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కీలక స‌మావేశం నిర్వహించారు.

S

Telangana | Published On Jun 3, 2026, 4.37 pm IST

Telangana | నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజంలో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారం
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, విద్య, వైద్య సేవలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. అందులో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కీలక స‌మావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు పక్షాలు చర్చించాయి. ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రత్యేకతలను దక్షిణాఫ్రికా ప్రతినిధులకు వివరించారు. ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింద‌ని గుర్తు చేశారు. అనేక ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్-500 కంపెనీలు తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని స్ప‌ష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు హైదరాబాద్‌ను నాలెడ్జ్ సిటీగా మార్చాయని స్పష్టం చేశారు.

వైద్య రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో మధ్యప్రాచ్య దేశాలతో పాటు అనేక దేశాల ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. అత్యాధునిక ఆసుపత్రులు, నిపుణులైన వైద్యులు, మెరుగైన ఆరోగ్య మౌలిక వసతులు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు.

మెడిక‌ల్ టూరిజానికి ప్ర‌త్యేక స్థానం

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఈ రంగంలో దక్షిణాఫ్రికాతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించవచ్చని సూచించారు. గతేడాది నిర్వహించిన "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025" భారీ విజయాన్ని సాధించిందని సీఎం గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడంతో తెలంగాణకు కొత్త పెట్టుబడి అవకాశాలు లభించాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026"లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేతో పాటు అక్కడి పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి ఆహ్వానించగా, దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు వెంటనే స్పందించి పెద్ద సంఖ్యలో బృందంతో ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ-దక్షిణాఫ్రికా మధ్య విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల రంగాల్లో కొత్త సహకార అవకాశాలకు మార్గం సుగమమైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న "భారత్ ఫ్యూచర్ సిటీ" ప్రాజెక్టును గురించి కూడా సీఎం వివరించారు. పూర్తిగా పర్యావరణహితంగా, నెట్ జీరో విధానంలో, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పరిశోధనా కేంద్రాలకు ఇది కేంద్రంగా మారుతుందని చెప్పారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శక పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మెగా ఆసుపత్రులను నిర్మిస్తోందని చెప్పారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ-దక్షిణాఫ్రికా భాగస్వామ్యం ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

భారత్‌తో సౌత్ ఆఫ్రికాది చారిత్రక బంధం: పాల్ మషాటిలే

భార‌త‌దేశంతో దక్షిణాఫ్రికాది చారిత్ర‌క బంధ‌మ‌ని ఆ దేశ ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య దశాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా భారత కంపెనీలు ఆఫ్రికా మార్కెట్లలోకి విస్తరించేందుకు దక్షిణాఫ్రికా కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఫార్మా, ఆరోగ్య రంగాల్లో భారత కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కాగా, ఈ స‌మావేశానికి దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల ఉప మంత్రి మొరాకా, భారతదేశానికి దక్షిణాఫ్రికా రాయబారి ఏ. సూక్‌లాల్, ఆరోగ్య మంత్రి డాక్టర్ ఏ. మోట్సోలెడీ, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎస్. ఎండాబేని, విజ్ఞాన సాంకేతిక శాఖ ఉపమంత్రి ఎన్. గినా, కమ్యూనికేషన్స్, డిజిటల్ టెక్నాలజీ శాఖ ఉపమంత్రి ఎం. గుంగుబెలే తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement