త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramakrishna | పవన్ కల్యాణ్ హుందాగా వ్యవహరించాలి.. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

Ramakrishna | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తన హోదాకు తగిన విధంగా హుందాగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామ‌కృష్ణ సూచించారు. ఏపీ రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాల్సిన సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

P

Telangana | Published On Jun 3, 2026, 8.11 pm IST

Ramakrishna | పవన్ కల్యాణ్ హుందాగా వ్యవహరించాలి.. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
Advertisement

Ramakrishna | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తన హోదాకు తగిన విధంగా హుందాగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామ‌కృష్ణ సూచించారు. ఏపీ రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాల్సిన సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కే నాగేశ్వ‌ర్‌రావు ఓ టీవీ ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ జరిపిన చర్చల గురించి ప్రస్తావించారని గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే రాజకీయంగా లేదా మీడియా వేదికగా ఖండించాల్సింది పోయి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పోలీసు కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసర వివాదాలకు దారితీసిందని పేర్కొన్న ఆయన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయని విమర్శించారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు స్పందించడంతో వివాదం మరింత ముదిరిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరస్పర సహకారంతో జీవిస్తున్న సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదని రామకృష్ణ అన్నారు. కమ్యూనిజం అంతరించిపోయిందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే, దేశంలో మత విద్వేషాలు పెరుగుతున్నాయని విమర్శిస్తూ, అలాంటి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేస్తూ ప్రాంతీయవాదంపై వ్యాఖ్యలు చేయడం విరుద్ధ ధోరణిగా కనిపిస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, పర్యావరణం, గ్రామీణ నీటి సరఫరా శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్‌కు రామకృష్ణ హితవు పలికారు.

Advertisement
Advertisement