త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Laxman Kumar | గురుకుల సీట్ల భర్తీకి భారీ స్పందన.. ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ

Adluri Laxman Kumar | తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకం మరింత పెరుగుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ఆయ‌న విడుద‌ల చేశారు.

P

Telangana | Published On May 29, 2026, 9.50 pm IST

Adluri Laxman Kumar | గురుకుల సీట్ల భర్తీకి భారీ స్పందన.. ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ
Advertisement

Adluri Laxman Kumar | తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకం మరింత పెరుగుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ఆయ‌న విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను పూర్తిగా ఉచితంగా అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గురుకుల విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

2026-27 ప్రవేశాలకు ఏప్రిల్ 5న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,357 దరఖాస్తులు రాగా, మే 15న 117 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. మొత్తం 19,740 సీట్లకు గాను ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ కావడం గర్వకారణమని మంత్రి అన్నారు. ఇంకా 1,339 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. గ్రూపుల వారీగా చూస్తే ఎంపీసీలో 96.63 శాతం, బైపీసీలో 90 శాతం, సీఈసీలో 98.68 శాతం, హెచ్ఈసీలో 98 శాతం, వొకేషనల్ కోర్సుల్లో దాదాపు పూర్తి స్థాయి భర్తీ నమోదైందని వెల్లడించారు. మొత్తం భర్తీ శాతం 93.21గా ఉందని తెలిపారు. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతున్నందున ఎంపికైన విద్యార్థులు జూన్ 7లోపు ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను మొదటి రోజే కళాశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

గురుకులాల పనితీరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని మంత్రి తెలిపారు. జేఈఈ మెయిన్స్ 2026లో 337 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. 26 మంది 90 శాతం పైగా పర్సంటైల్ సాధించారని చెప్పారు. గత ఏడాది 525 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడం వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలు ఐఐటీ, జేఈఈ, నీట్‌, ఎన్‌డీఏ, క్లాట్ వంటి పోటీ పరీక్షల్లో కార్పొరేట్ కళాశాలలకు సమానంగా ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. మైక్రో అకడమిక్ ప్లానింగ్, మాక్ టెస్టులు, ప్రత్యేక శిక్షణ, కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నామని చెప్పారు. గురుకులాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు లేకుండా ప్రతి నెల మొదటి వారంలోనే చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. విద్య ద్వారా సామాజిక అసమానతలను తొలగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, పేద విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలు, అధికారులు, నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement