త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | పామాయిల్ రైతులకు అండగా ప్రభుత్వం

Tummala Nageswara Rao | పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. చేవెళ్లలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Nov 28, 2026, 6.05 pm IST

Tummala Nageswara Rao | పామాయిల్ రైతులకు అండగా ప్రభుత్వం
Advertisement
  • రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు విస్తరణే లక్ష్యం
  • రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
  • అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు

Tummala Nageswara Rao | పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. చేవెళ్లలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 92,504 మంది రైతులు 3.37 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 46,840 మంది రైతులు కొత్తగా 1.54 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారన్నారు. తోటల ఏర్పాటు, నిర్వహణ, అంతర పంటల కోసం రూ.442.74 కోట్ల రాయితీలను 75,628 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు.

టన్ను గెలల ధర రూ.22,658

ఆయిల్ పామ్ దాదాపు 30 ఏళ్లపాటు దిగుబడినిచ్చే పంట అని, ఎకరానికి రూ.2 లక్షల వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. టన్ను పామాయిల్ గెలల ధర గతంలో రూ.12,534 ఉండగా ప్రస్తుతం రూ.22,658కు చేరిందన్నారు. ఈ ఏడాది 5.20 లక్షల మెట్రిక్ టన్నుల గెలలను కొనుగోలు చేసి, రూ.1,213 కోట్లను 25,242 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాల కొనుగోలు భారం కాకుండా FPOల ద్వారా యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆయిల్‌ఫెడ్‌తో పాటు ప్రైవేట్ కంపెనీలు ఈ దిశగా సహకరించాలని సూచించారు. తోటల ప్రారంభ మూడేళ్లలో కూరగాయలు, తీగజాతి పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందాలని రైతులకు సూచించారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

ఆయిల్ పామ్ తోటల్లో విద్యుత్ లైన్లు, ఫెన్సింగ్, నీటి సదుపాయాలు, తెగుళ్ల నివారణ సమస్యలను పరిష్కరిస్తామని తుమ్మల హామీ ఇచ్చారు. నాణ్యమైన మొక్కల సరఫరాపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. విజయవంతమైన రైతులను ఆదర్శంగా తీసుకుని ఇతర రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనుకూలమైన ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్నారు. 2026-27లో 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 46,503 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగు అభివృద్ధికి రూ.261.35 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, రాయితీలు, సాంకేతిక సలహాలు అందించడంతో పాటు గెలల సేకరణ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. రైతుల సంక్షేమం, సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement