త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం.. ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (సర్) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పలు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

P

Telangana | Published On Jun 14, 2026, 5.47 pm IST

SIR | ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం.. ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం
Advertisement

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (సర్) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పలు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, సర్ నిర్వహణ విధానం, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) చేపట్టాల్సిన బాధ్యతలు, బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓలు) పనితీరుపై నిఘా వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఓటర్ మ్యాపింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటర్ల వివరాల పరిశీలనలో పాటించాల్సిన విధానాలపై నాయకులకు స్పష్టమైన సూచనలు చేశారు.

మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకుని అరగంట చొప్పున మొత్తం ఆరు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్త‌యింద‌నే అంశాన్ని సమీక్షించారు. ఇంకా మ్యాపింగ్‌లో నమోదు కాని లేదా ఓటు హక్కు కోల్పోయిన వ్యక్తులను గుర్తించి, వారికి తిరిగి ఓటు హక్కు కల్పించే ప్రక్రియపై నాయకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా సర్ పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఓట్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఏలు ప్రతి ఓటును లోతుగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏదైనా ఓటు తొలగించబడితే వెంటనే అవసరమైన ఆధారాలతో తిరిగి దరఖాస్తు చేయించి పునరుద్ధరణ జరిగేలా చూడాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఓటు కీలకమని, ఓటర్ల హక్కుల పరిరక్షణలో పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమావేశాలకు కోఆర్డినేటర్‌గా గంప వేణుగోపాల్ వ్యవహరించగా, ఎన్నికల సంఘం నిబంధనలు, సాంకేతిక అంశాలను టీపీసీసీ ఎన్నికల కమిషన్ చైర్మన్ రాజేష్ వివరించారు. ఇప్పటివరకు బీఎల్ఏల శిక్షణ కార్యక్రమాలు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

ఈ నెల 25వ తేదీ నుంచి బీఎల్ఏ-2 బృందాలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ మ్యాపింగ్ చేపట్టనున్నాయి. ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తూ ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓలతో సమన్వయం ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ జూమ్ సమావేశాల్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రైనింగ్ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement