త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి

Bonalu | అమెరికా గడ్డపై తెలంగాణ పల్లె సంస్కృతి పరిమళించింది. ఆషాఢమాస బోనాల పండుగను న్యూయార్క్‌లోని ప్రవాస తెలంగాణ కుటుంబాలు సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించాయి. న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో లాంగ్‌ ఐలాండ్‌లోని ఐసెన్‌హోవర్‌ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ కుటుంబాలు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించాయి.

P

Telangana | Published On Jul 29, 2026, 8.10 pm IST

Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
Advertisement

Bonalu | అమెరికా గడ్డపై తెలంగాణ పల్లె సంస్కృతి పరిమళించింది. ఆషాఢమాస బోనాల పండుగను న్యూయార్క్‌లోని ప్రవాస తెలంగాణ కుటుంబాలు సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించాయి. న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో లాంగ్‌ ఐలాండ్‌లోని ఐసెన్‌హోవర్‌ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ కుటుంబాలు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి లాంగ్‌ ఐలాండ్‌ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్‌ మెంగ్‌ లీ, లెజిస్లేటర్‌ రోజ్‌ మేరీ వాకర్‌, టౌన్‌ క్లర్క్‌ రాగిని శ్రీవాస్తవ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బోనాల పండుగలో కనిపించిన సంప్రదాయాలు, కళా ప్రదర్శనలు వారిని ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతిని మెచ్చుకున్నారు.

నైటా అధ్యక్షుడు రవీందర్‌ కోడెల అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలను కార్యవర్గ సభ్యులు సమన్వయంతో నిర్వహించారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా పలువురు కళాకారులు, కవులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్‌, సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్‌, గాయకుడు సురేందర్‌, ఫోక్‌ సింగర్‌ సంధ్య తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. తెలంగాణ పల్లె పాటలు, జానపద కళారూపాలు అమెరికా వేదికపై సందడి చేశాయి. అమ్మవారి అలంకరణ కార్యక్రమాన్ని పద్మ కోడెల నిర్వహించగా, పోతురాజు వేషధారణలో అశోక్‌ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి వచ్చిన వారంతా సంప్రదాయ వాతావరణంలో బోనాల సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి దంపతులతో పాటు నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు, అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు కుటుంబాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్‌ కోడెల మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే నైటా లక్ష్యమని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. సాంస్కృతిక వేడుకలు ప్రవాస భారతీయుల మధ్య ఐక్యతను మరింత పెంచుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన న్యూయార్క్‌ బోనాల వేడుకలు ప్రవాసుల హృదయాల్లో ప్రత్యేక అనుభూతిని మిగిల్చాయి. తెలంగాణ వంటకాలతో విందు ఆస్వాదించిన కుటుంబాలు, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నైటా సభ్యులను అభినందించారు.

Advertisement
Advertisement