త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadeesh Reddy | డ‌ల్లాస్ వేడుక‌ల స్ఫూర్తిగా మ‌లేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు: జ‌గ‌దీశ్‌రెడ్డి

Jagadeesh Reddy | అమెరికా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు డల్లాస్ లో జరిగాయ‌ని.. ఇది చూసినవారు అన్ని దేశాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వ‌హించాల‌నే విజ్ఞప్తులు వచ్చాయ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి పేర్కొన్నారు. వ‌చ్చే నెల 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొంటార‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On May 22, 2026, 3.18 pm IST

Jagadeesh Reddy | డ‌ల్లాస్ వేడుక‌ల స్ఫూర్తిగా మ‌లేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు: జ‌గ‌దీశ్‌రెడ్డి
Advertisement
  • జూన్ 6న అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తాం
  • రాష్ట్రంలో కేసీఆర్ లేని లోటు క‌నిపిస్తున్న‌ది
  • డిమాండ్ ఉన్న నాయ‌కులు కేసీఆర్‌, కేటీఆరే
  • బీజేపీ పాల‌న‌లో పిల్ల‌ల‌కు రక్ష‌ణ లేదు
  • కాంగ్రెస్‌, బీజేపీ ఎజెండా ఒక్క‌టే
  • రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

Jagadeesh Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు డల్లాస్ లో జరిగాయ‌ని.. ఇది చూసినవారు అన్ని దేశాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వ‌హించాల‌నే విజ్ఞప్తులు వచ్చాయ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి పేర్కొన్నారు. వ‌చ్చే నెల 6న మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వ‌ర్యంలో కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొంటార‌ని ఆయ‌న తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచ‌ర్‌ను ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్‌లో ఆయ‌న నాయ‌కుల‌తో క‌లిసి ఆవిష్క‌రించి మాట్లాడారు.

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 6న మలేషియాలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 12 , 13 యేండ్లుగా తెలంగాణ సంస్కృతిని నిలబెడుతున్నారు. బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజర‌వుతున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పదే పదే గుర్తు చేసుకుంటున్నపేరు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లేని లోటు రెండున్నర ఏండ్లుగా కనిపిస్తుంది అని జ‌గ‌దీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ను న‌మ్మి మోస‌పోయిన‌ట్లు ప్ర‌జ‌లు తెలుసుకున్న‌రు..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయ‌లేకపోతుంది. కేసీఆర్ ఇచ్చిన పథకాలనైన అమ‌లు చేయ‌లేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామ‌ని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అమెరికా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డల్లాస్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున హాజర‌య్యారు. అది చూసినవారు అన్ని దేశాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరపాలని విజ్ఞప్తులు వచ్చాయి. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచ వ్యాప్తంగా తెలుసుకుంటున్నారు. తెలంగాణలో డిమాండ్ ఉన్న నాయకులు కేసీఆర్, కేటీఆర్ అని మాజీ మంత్రి కొనియాడారు.

బీజేపీ పాల‌న‌లో పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేదు..

దేశంలో బీజేపీ పాల‌న‌లో చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న నిందితులను పట్టుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతులకు విత్తనాలు, ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి పాత గురువు, చీకటి గురువు చెప్పినట్లు రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేని దీన స్థితిలో ఉంది. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎజెండా ఒక్కటే. రైతాంగాన్ని ముంచి వ్యవసాయ సబ్సిడీలు దోచుకోవాలనే ఆలోచన చేస్తున్నాయి అని ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి ఆరోపించారు.

వారిది అధికార మ‌దం..

ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా ట్వీట్ చేసే రాహుల్ గాంధీ తెలంగాణలో బాలిక ఘటనపై ట్వీట్ చేయ‌లేదు. బీజేపీ నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్త‌లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అన్యాయం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు, మహిళలకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, BRS NRS సెల్ ప్రెసిడెంట్ మహేష్ బిగాల, MYTA ప్రెసిడెంట్ తిరుపతి, BRS మలేసియా ప్రెసిడెంట్ చిట్టీ బాబు, MYTA ఉమెన్స్ వింగ్ సుప్రియ, శివ BRS రాష్ట్ర నాయకులు నరసింహ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, పడాల సతీష్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement