త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి  ఫ్యామిలీకి మరోలా?  తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!

కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం భిన్న వైఖరి ఎందుకు? తెలంగాణ కాంగ్రెస్‌లో ‘క్రమశిక్షణ’ ఒకటేనా.. నేతను బట్టి మారుతుందా? అన్న చర్చ ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

S

Telangana | Published On Aug 22, 2026, 7.29 pm IST

కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి  ఫ్యామిలీకి మరోలా?  తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!

సంక్షిప్త సారాంశం

కొండా–కోమటిరెడ్డి ఎపిసోడ్‌తో హస్తం పార్టీలో అంతర్గత సమీకరణాలపై చర్చ మళ్లీ వేడెక్కింది. క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలు, నేతలపై పార్టీ స్పందన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎవరిపై ఎంత కఠినం.. ఎవరికి ఎంత వెసులుబాటు? కాంగ్రెస్‌లో అసలు లెక్కేంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

Advertisement

                               ఒకే పార్టీలో రెండు కొలమానాలా? కొండా–కోమటిరెడ్డి ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో హీట్

 

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘క్రమశిక్షణ’ అనేది అందరికీ ఒకేలా వర్తించే సూత్రమా… లేక చూసే కంటిని బట్టి మారే చట్టమా? గాంధీభవన్‌ను ప్రస్తుతం వేధిస్తున్న అసలు ప్రశ్న ఇది. అధికారంలోకి వచ్చిన వేళ నుండి విశ్రాంతి లేకుండా ప్రతిపక్షాల విమర్శల దాడిని ఎదుర్కొంటున్న హస్తం పార్టీలో, ఇప్పుడు సొంత నేతల తిరుగుబాట్లే పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. పవర్‌లో ఉన్నప్పుడు పార్టీ లీడర్లు కాస్త స్వరం పెంచడం సహజమే కావచ్చు… కానీ, ఆ స్వరంపై అధిష్ఠానం చూపిస్తున్న ‘స్పందన’లోనే అసలు రాజకీయం దాగుంది! ఒకరికి రెడ్ కార్పెట్ వేసి మరీ క్లాస్ పీకి వదిలేస్తూ, మరొకరికి తక్షణమే రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపేస్తుండటంతో, ఇప్పుడు గాంధీభవన్‌లో “డబుల్ స్టాండర్డ్స్” రగడ తీవ్ర స్థాయికి చేరింది.

ఈ వివాదాలపై తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పందిస్తూ – "మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణ, ఆమె కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన వీడియోలను కమిటీ సమగ్రంగా పరిశీలిస్తోంది. అలాగే మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇచ్చిన సమాధానాన్ని, ఆయనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి వివరణలను కూడా సరిచూసి, త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తాం" అని స్పష్టం చేశారు. మరో వైపు రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ లైన్ లోనే ఉన్నయన్న క్లీన్ చిట్ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీస్తోంది.

ఈ నేపథ్యంలో పీసీసీ కమిటీ నుంచి అసలు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పార్టీలో అందరికీ ఒకేలా క్రమశిక్షణ వర్తింపజేస్తారా లేక డబుల్ స్టాండర్డ్స్‌కే మొగ్గు చూపుతారా అన్న చర్చ ప్రస్తుతం గాంధీభవ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తీన్మార్ మల్లన్న నుంచి కొండా సురేఖ వరకు

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన నివేదికపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శాసనసభ వేదిక వెలుపల ఆ నివేదిక ప్రతులను దహనం చేయడం తీవ్ర సంచలనమైంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వకపోవడంతో, పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో మార్చి 2025లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని ఉదాహరణగా చూపింది.

ఇదే తరహా రాజకీయం ఆగస్టు 19, 2026న మంత్రి కొండా సురేఖ ఇంట్లో పునరావృతమైంది. పరకాల నియోజకవర్గ టికెట్ పోరు, అంతర్గత విబేధాల నేపథ్యంలో ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ తక్షణమే స్పందించింది. సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు కుమార్తె వ్యక్తిగతమైనవని సురేఖ వివరణ ఇచ్చినప్పటికీ, 19-20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.

రాజగోపాల్ రెడ్డి విషయంలో భిన్నమైన ధోరణి

సరిగ్గా ఇక్కడే అసలు "హస్తం" రాజకీయం బయటపడుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై, ప్రభుత్వ విధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. “ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెసా? రాహుల్ గాంధీ కాంగ్రెసా?” అంటూ ప్రశ్నించడమే కాకుండా, సీమాంధ్ర కాంట్రాక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కేవలం అంతర్గత చర్చలకే పరిమితమైంది తప్ప, తీన్మార్ మల్లన్న తరహాలో సస్పెన్షన్ వేటు వేయలేదు. “నేను కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకిని కాను, కేవలం ప్రజా సమస్యలపైనే మాట్లాడాను” అని రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణతో కథ ముగిసింది.

గాంధీభవన్‌లో పెరుగుతున్న అసంతృప్తి

ఈ పరిణామాలు గాంధీభవన్‌లో నాయకుల మధ్య  తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.

మంత్రి కుటుంబానికి ఒక న్యాయం - పదవిలో లేని సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు, తల్లి కొండా సురేఖకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

సీనియర్ ఎమ్మెల్యేకు మరో న్యాయం - సీఎం, ప్రభుత్వంపై నేరుగా దాడి చేసిన రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం పార్టీ మౌనంగా ఉండిపోయింది.

మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం “సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక అన్ని విషయాలూ మాట్లాడతా” అని చెబుతూ నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే, కొండా కుటుంబంతో పాటు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి సీనియర్లపై కూడా ఒకే రీతిలో చర్యలు ఉండాలని  ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన వివరణ ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. “ఒకవైపు కొండా సురేఖకు షోకాజ్ నోటీసు.. ఇవ్వడం.. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ వైఖరిపై మాత్రం భిన్నంగా స్పందించడం పై చర్చలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ‘క్రమశిక్షణ’ కొలమానం అందరికీ ఒకేలా వర్తిస్తుందా? అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కమిటీ తీసుకోబోయే తుది నిర్ణయమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.”

Advertisement
Advertisement