Jeevan Reddy | మీ తొక్కుడు చాలు.. గుడ్ బై.. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
Jeevan Reddy | నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధాకరంగా ఉంది.. కానీ సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడ వల్ల పార్టీని వీడక తప్పడం లేదని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండున్నరేండ్లు ఎంతో మానసిక క్షోభ, అవమానాలు భరించానని పేర్కొన్నారు. ఇక రాబోయే రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు.
నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం..
ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ లేనే లేదు..
దానంతో ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయించలేదు..
సునీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ల టికెట్ ఎందుకివ్వలేదు..
ఓపిక పట్టాలని పీసీసీ చీఫ్ అంటున్నరు..
ఓపిక లేకపోతే 20 నెలలు ఆగుతానా..?
కార్యకర్తలకు పదవులు ఇప్పించే శక్తి కోల్పోయాను..
మంత్రి పదవి పొందేందుకు నాకు అర్హత లేదా..?
పీసీసీ ప్రెసిడెంట్ పోస్టును అడ్డుకున్నది మీరే కదా..?
అణిగిపోయే వ్యక్తిత్వం నాది కాదు..
ఎదురించి పోరాటం చేయడం నా నైజం..
వేం నరేందర్ రెడ్డి పార్టీకి ఏం చేశాడు..?
చిన్నారెడ్డి, వీహెచ్, మధుయాష్కీ కనిపించలేదా..?
అందర్నీ తొక్కుకుంటూ రేవంత్ సీఎం అయ్యారు..
నేను సీఎం కావాలని ఏనాడూ కోరుకోలేదు..
నా జీవిత చివరి పోరాటం ఇది..
మళ్లీ తోడుగా నిలుస్తారని ఆశిస్తున్నా..
కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధాకరంగా ఉంది.. కానీ సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడ వల్ల పార్టీని వీడక తప్పడం లేదని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండున్నరేండ్లు ఎంతో మానసిక క్షోభ, అవమానాలు భరించానని పేర్కొన్నారు. ఇక రాబోయే రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ పార్టీ నాది అని భావిస్తూ.. సీనియర్లను తొక్కుతున్న రేవంత్ రెడ్డికి భవిష్యత్‌లో తగిన గుణపాఠం చెబుతాం.. ఇక నుంచి మమ్మల్ని ఏ శక్తి ఆపలేదని జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇది క్లిష్ట సమయం నాకు.. నా జీవిత చివరి పోరాటం ఇది.. మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగాను.. భవిష్యత్‌లో జగిత్యాలను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే నా సంకల్పం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తన మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన లేఖను విడుదల చేశారు. రాజీనామా లేఖ విడుదలకు ముందు జీవన్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు.
జీవన్ రెడ్డి ప్రసంగం..
ఈ రెండేండ్ల కాలంలో న్యాయం జరుగుతదని అనుకున్నా.. మా కార్యకర్త కూడా కిరాతకంగా బలైపోయారు. ఎక్కడ రక్షణ..? పదవుల కోసం తాపత్రయం మాకు లేదు. కళ్ల ముంగిటి పదవుల నియామకంలో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తలు బలైపోతుంటే.. ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి స్పందన లేకపోతే ఏ విధంగా కొనసాగాలి. దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం మినహా.. ఎండోమెంట్ నియామకాల్లో మాకు అన్యాయం జరిగింది.
ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలి కదా..?
నేను స్వయంగా న్యాయవాది. న్యాయవాదులతో నాకు సాన్నిహిత్యం ఉంటుంది. ఎప్పుడైనా నేను ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో కూడా నా సలహా లేదు. సూచన లేదు.. సంప్రదింపు లేదు. ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుందో గమనిస్తున్నారా..? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు అధికార యంత్రాంగం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై నియంతృత్వ పోకడలతో, అధిపత్యం చెలాయించి ఆరాచకం సృష్టించిన వారిని తీసుకొచ్చి.. మళ్లీ ఇవాళ జగిత్యాలలో పెట్టారు. ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలి కదా..? స్థానిక, మున్సిపల్ ఎన్నికలు చూశారు. గాంధీ భవన్‌లోనూ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.
రేవంత్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయే నిర్ణయాలు జాతీయ స్థాయిలో ప్రతిబింపజేస్తాయి. ఒక వైపు రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ముందకు పోతుంటే రేవంత్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దానం నాగేందర్ చేత ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయించలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండానే.. ఎంపీకి కాంగ్రెస్ తరపున ఎలా పోటీ చేయించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చేవెళ్లలో సునీతా మహేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా మల్కాజ్‌గిరిలో పోటీ చేయించారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. చేవెళ్ల ఎఫెక్ట్ మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం మీద కూడా పడింది. జనాలను తక్కువ అంచనా వేయొద్దు.. మొత్తానికి సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
ఓపిక ఉండబట్టే ఇక్కడి దాకా వచ్చాను..
నాకు పార్టీ వీడాలని లేదు. కానీ పార్టీ కార్యకలాపాల్లో దూరడం వల్లే పార్టీ వీడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం పార్టీని వీడిన అని చెబుతున్న ఎమ్మెల్యే.. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో దూరడం ఏంటి..? మహేశ్ కుమార్ గౌడ్ వచ్చి కలిసి ప్రయాణం చేద్దాం.. ఓపిక పట్టు అని అన్నారు. ఓపిక ఉండబట్టే ఇక్కడి దాకా వచ్చాను. ఓపిక లేకపోతే 20 నెలలు ఆగుతానా..? నా కుటుంబ సభ్యుడు నడి బజార్లో హత్యకు గురైతే ఓపికి పడుతానా..? 20 మాసాలు నన్ను కించపరుస్తూ.. నా తోటి సోదరులను కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు నన్ను.
పదవులు ఇప్పించే శక్తి కోల్పోయాను..
జగిత్యాల ఎమ్మెల్యేకు ప్రభుత్వం ఒక్కటే అండగా ఉన్నది అనుకున్నాను. మున్సిపల్ ఎన్నికల వరకు కూడా అదే నిజమని భావించాను. పార్టీ నాకు తోడుంది అనుకున్నా. కానీ పార్టీ మొత్తం ఆయన చెంతకు చేరింది. ఇక మిగిలింది ఏంది..? నాలుగు దశాబ్దాలుగా నాకు తోడు నిలిచారు. పదవులు ఇప్పించే శక్తి కోల్పోయాను. కనీసం నాయకుల, కార్యకర్తల ఆత్మగౌరవం కాపాడాలని నిర్ణయించుకున్నాను.
ఒంటరి పోరాటం చేసిన నాకు మినిస్ట్రీ ఇవ్వలేదు..
పార్టీలో ఏం నడుస్తుందో తెలియడం లేదు. ఎవరికి పదవులు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. ఎమ్మెల్సీగా ఐదేండ్లు ఒంటరిగా పోరాటం చేశాను. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సీఎం అయ్యారు. భట్టి సీఎల్పీ నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యారు. జీనవ్ రెడ్డి మండలిలో ఒకే ఒక్కడు. ఒంటరి పోరాటం చేసిన నాకు మినిస్ట్రీ ఇవ్వలేదు. నాకు అర్హత లేదా..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి నేటి వరకు 20 మాసాలు సమయం ఉండే. పదవి కాంక్షించే వాడిని అయితే ఆనాడే నిరసన తెలిపేవాడిని. ఇవాళ అనిపిస్తుంది ఎందుకు నిరసన తెలపలేదు అని.
నాకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి రాకుండా చేశారు..
2022 జనవరిలో జీవన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఆమోదం కూడా జరిగిపోయింది. ఇదే పెట్టుబడిదారులు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉంది.. పీసీసీ ప్రెసిడెంట్‌ను మారిస్తే.. ఉప ఎన్నికపై ప్రభావం పడుతుందని నాకు ప్రెసిడెంట్ పదవి రాకుండా చేశారు. మరి సాగర్ ఉప ఎన్నికలో గెలిచారా..? పీసీసీ ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డ వ్యక్తిని.. ఇవాళ నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కోసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది.. అంటే నాలుగు దశాబ్దాల అనుబంధం ఏం కావాలి..?
అణగదొక్కుతున్నావ్ రేవంత్ రెడ్డి. జాగ్రత్త..!
మండలిలో కొనసాగాలని కోరుకున్నాను. ఎమ్మెల్యే కోటా అవకాశం వస్తదో రాదో.. గ్రాడ్యుయేట్స్ నుంచి కంటెస్టు చేయ్.. ఆర్థికంగా ప్రభుత్వం, పార్టీ ఆదుకుంటుంది అని చెప్పాలి కదా..! మళ్లీ ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా కోరలేదు. ఇప్పుడు ఏ హోదా కల్పించిన మాట నెగ్గించుకుంటాడు.. వీడిని ఇట్లనే అణగదొక్కాలి.. తొక్కబడాలి అనేది మీ ఆలోచన. అట్ల తొక్కబడుతూ.. అణిగిపోయే వ్యక్తిత్వం నాది కాదు. దాని కంటే ఎదురించి పోరాటం చేయడం కొత్త కాదు. చంద్రబాబును ఎదురించి పోరాటం చేశాను. కేసీఆర్‌ను ఎదురించి పోరాటం చేశాను. ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా ఎదురించి పోరాటం చేస్తాను అంటున్నాను. నీతో తొక్కబడుడు దాని కంటే.. ఎదురించే పోరాడితే పోయేది ఏముంది. ఇక్కడ అణగదొక్కబడుదామా..? పోరాడుదామా..? ఎంతకాలం ఈ అవమానాలు, మానసిక క్షోభ. కాంగ్రెస్‌లో ఇంకొకడు ఎదగొద్దు.. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు.. నీ దయాదాక్షిణ్యాలకు లొంగేటోడు.. నీ అడుగులకు మడుగులు ఒత్తేటోడు మాత్రమే పార్టీలో కొనసాగాలి. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటోడిని అణగదొక్కుతున్నావ్ రేవంత్ రెడ్డి. జాగ్రత్త..!
వేం నరేందర్ రెడ్డి ఎవరు..?
రెండున్నరేండ్ల నుంచి నేను ఏ పదవి అడగలేదు. ప్రభుత్వ సలహాదారు పదవి కానీ, కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ అడగలేదు. నాకు అర్హత లేకనా..? కానీ అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి బతకవచ్చినోడికి ప్రభుత్వ సలహాదారు ఇస్తారా..? 20 నెలల్లో ఆయన వ్యవసాయ రంగంలో మీకేం సలహాలు ఇచ్చారు. నీ అడుగులకు మడుగులు ఒత్తేడోటికి పదవులు ఇస్తవు. వేం నరేందర్ రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి చేసిన సేవ ఏంటి..? పాపం చిన్నారెడ్డి గారు నా మిత్రుడు. నా కంటే సీనియర్.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడంట్. వనపర్తి నుంచి టికెట్ ఇచ్చి అక్కడుండే ప్రత్యేక పరిస్థితుల్లో మళ్లీ వేరేవారికి ఇచ్చారు. చిన్నారెడ్డి వద్ద నుంచి బీ ఫామ్ వెనక్కి తీసుకున్నారు. నీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన విధంగా గౌరవంగా రాజ్యసభ ఇస్తామన్నారు. కానీ అది కూడా జరగలేదు. ఈ పరిణామాల తర్వాత చిన్నారెడ్డి స్టేట్‌మెంట్ చూస్తే బాధ కలిగింది. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని చిన్నారెడ్డి అన్నారు. ఇదేనా పార్టీ సీనియర్లకు రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు. సీఎంకు సలహాలు ఇస్తున్నాడు.. ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంది. చిన్నారెడ్డికి రాజ్యసభ ఇస్తే పార్టీకి గౌరవం దక్కుతుండే కదా..! మధుయాష్కీ, వంశీచంద్ రెడ్డి, వీహెచ్‌కు ఎందుకు ఇవ్వలేదు. ఈ పార్టీ నాది అని సీఎం భావిస్తున్నారు. నాకు అడ్డొస్తే తొక్కుతా అని అనుకుంటున్నారు. ఎంత మందిని తొక్కుతావు.. ఇవాళ చెబుతున్నా... నీ తొక్కుడు కాదు.. జగిత్యాల నియోజకవర్గంలో నినదిస్తే ఏ శక్తి కూడా ఆపలేదు.
నా జీవిత చివరి పోరాటం ఇది..
దయచేసి కార్యకర్తలను గౌరవించు.. సీనియర్లను గౌరవించడం నేర్చుకో. మీకు పదవి కలిసొచ్చింది. మీరు సీఎం కావాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకర్ని. ఆయన సీఎం ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఇది సమయం కాదు అని మిగతా వారితో అన్నాను. ప్రజలు ఆయనను కోరుకుంటున్నారు.. ఆయన సీఎం కావాలని కోరుకున్న వారిలో నేను ఒకడిని. దాని పర్యావసనం ఏదైతో ఉందో తొక్కుతా అని అంటున్నారు. దయచేసి ఇది క్లిష్ట సమయం నాకు. నా జీవిత చివరి పోరాటం ఇది. మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగాను. జగిత్యాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం అభివృద్ధిలో పులివెందులతో పోటీ పడ్డాం.. జగిత్యాలలో చేపట్టిన కార్యక్రమాలు కొడంగల్, సిద్దిపేట, సిరిసిల్లలో లేవు. దేవుడు అవకాశం ఇస్తే జాతీయ స్థాయిలో జగిత్యాలను అభివృద్ధి చేయడమే నా సంకల్పం.
ఈ తొక్కుడు భరించలేక నేను స్వేచ్ఛ కోరుకుంటున్నాను..
ఈ రెండేండ్లు అవమానాలతో డిచిపోయింది.. గత పదేండ్లు కష్టపడ్డాం.. రాబోయే రెండేండ్లు పోరాటాలతో గడుపుదాం. మన లక్ష్యం.. మన ధర్మ పోరాటం.. న్యాయం కోసం, హక్కుల కోసం పోరాటం చేద్దాం. నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నాను. నా మనోభావాలను వ్యక్తం చేస్తున్నా.. మానసిక క్షోభను వ్యక్తం చేశాను. పార్టీ వీడడం అనేది బాధాకరం. సీఎం కావాలని కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కొందరు స్క్రీన్ గీసుకొని సీఎం కావాలని పార్టీలోకి వచ్చారు. నేను పార్టీలో చేరిన నాడు సీఎం కావాలని కోరుకోలేదు. ఇవాళ కూడా కోరుకోలేదు. మీరు స్క్రీన్ గీసుకొని తొక్కుంటు సీఎం అయ్యారు.. సంతోషం. మమ్మల్ని కూడా బతకనివ్వండి.. ఈ తొక్కుడు భరించలేక నేను స్వేచ్ఛ కోరుకుంటున్నాను.. దీంతోనైనా మీ ఆలోచనలో కొంత మార్పు వచ్చి కార్యకర్తలకు, నాయకులకు అనుగుణంగా గుర్తింపు, హక్కులు కల్పించాలని నేను ఆశిస్తున్నాను. మనం పోయేటోళ్లం.. ఉన్నోళ్లకు న్యాయం కావాలని కోరుతున్నాను. గంగారెడ్డి దారుణ హత్య జరిగిన తర్వాత 2024 అక్టోబర్‌లో లేఖ రాశాను. దానికి తోడు ఈ రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నాను. నాకు తోడుగా నిలిచిన మిత్రులు మళ్లీ తోడుగా నిలవాలని కోరుతున్నాను అని జీవన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



