త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohan Bhagwat | సంఘ్‌ని అర్థం చేసుకోవ‌డం క‌ష్టం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

Mohan Bhagwat | త్రినేత్ర‌.న్యూస్ : సంఘ్‌ని అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘ్ సంచాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్యానించారు. అర్థం చేసుకునేందుకు అనుభ‌వం కావాల‌ని.. అందులో భాగ‌మైన‌ప్పుడే అది సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పైపైన అర్థం చేసుకుంటే త‌ప్పుగా అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. సంఘ్ కార్య శ‌తాబ్ది సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో "100 ఏళ్ల సంఘ్ యాత్‌- కొత్త ఆశ‌యాలు" పేరిట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కా

P

Telangana | Published On Feb 2, 2026, 5.32 pm IST

Mohan Bhagwat | సంఘ్‌ని అర్థం చేసుకోవ‌డం క‌ష్టం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌
Advertisement
  • అందుకు అనుభ‌వం కావాలి
  • సంఘ్‌లో భాగ‌మై అనుభ‌వాన్ని పొందాలి
  • దేశ సేవ అనే సంఘ కార్యాన్ని విస్త‌ర‌ణ‌కు నిర్ణ‌యం
  • దేశ‌య ప్ర‌యోజ‌నాల కోసం రాజీ అవ‌సరం లేదు
  • స‌మాజ ప‌రివ‌ర్త‌న‌కు ప్ర‌ముఖులు, మేధావులు స‌హ‌క‌రించాలి
  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

Mohan Bhagwat | త్రినేత్ర‌.న్యూస్ : సంఘ్‌ని అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘ్ సంచాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్యానించారు. అర్థం చేసుకునేందుకు అనుభ‌వం కావాల‌ని.. అందులో భాగ‌మైన‌ప్పుడే అది సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పైపైన అర్థం చేసుకుంటే త‌ప్పుగా అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. సంఘ్ కార్య శ‌తాబ్ది సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో "100 ఏళ్ల సంఘ్ యాత్‌- కొత్త ఆశ‌యాలు" పేరిట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి సుమారు వెయ్యి మంది వ‌ర‌కు వివిధ రంగాల‌కు చెందిన మేధావులు హాజ‌ర్యారు. వారినుద్దేశించి మోహ‌న్ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. వందేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఏ సంస్థ అయినా ఉత్స‌వాలు చేసుకుంటుంద‌ని.. కానీ స్వ‌యం సేవ‌క్‌లు అలా ఆలోచించ‌కుండా వ్య‌క్తిత్వ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణ‌మ‌నే సంఘ కార్య‌న్ని విస్త‌రించాల‌ని నిర్ణ‌యించి ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని అభినందించారు.

గ‌త ప‌ది, 20 ఏళ్ల‌లో సంఘ కార్యం ఎంతో విస్త‌రించింద‌ని, సంఘ్ లాంటి ప‌ని స‌మాజంలో మ‌రొక‌లేద‌న్నారు. సంఘ్ తొలి సిద్ధాంతం ఉత్త‌మ దేశ నిర్మాణం ల‌క్ష్యంగా వ్య‌క్తి నిర్మాణం చేయ‌డ‌మేన‌ని తెలిపారు. ఇదే ముఖ్యమైన పని అని, దానిపై ధ్యాస ఉంచుతుంద‌న్నారు. ఏ వ్యక్తినైతే నిర్మాణం చేస్తామో.. అత‌ను అలాగే ఉండాల‌న్నారు. దీనికి ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుంద‌ని, అందుకే ఈ విష‌యంపై కేంద్రీకృత‌మై సంఘ్ ప‌ని చేస్తోంద‌న్నారు. ఈ ప‌ని త‌ప్ప మ‌రోక‌టి చేయాల్సిన అవ‌స‌రం సంఘ్‌కి లేద‌ని తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ స్వ‌యం సేవ‌కులు దేశ‌వాప్తంగా 1.30ల‌క్ష‌ల‌కుపైగా సేవా కేంద్రాల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొన్నారు. స‌మాజం నుంచి స‌హాయాన్ని తీసుకుంటున్నార‌ని.. కొన్ని అవ‌స‌రాల కోసం వారే సొంతంగా ఖ‌ర్చులు భ‌రిస్తూ ప‌ని చేస్తార‌ని ఆయ‌న సంఘ్ ప‌నితీరుపై వివ‌రించారు.

సంఘ్ స్వ‌యం సేవ‌కులు ప‌థ సంచ‌ల‌న్ చేస్తార‌ని.. ఇందుకు మిల‌ట‌రీ త‌ర‌హాలోనే క్ర‌మ‌శిక్ష‌ణ‌గా చేస్తార‌న్నారు. కానీ, సంఘ్ పారా మిల‌ట‌రీ ఆర్గ‌నైజేష‌న్ కాద‌న్నారు. లాఠీ శిక్ష‌ణ‌లాంటి ఇస్తార‌ని.. కానీ ఇదేం శారీరక్ అఖాడా కాద‌న్నారు. సాంఘీక్ గీత్‌, వ్య‌క్తిగ‌త గీత్‌తో పాటు బ్యాండ్ ఉంటుంద‌ని తెలిపారు. అయితే, సంఘ్ సంగీత సంస్థ కాద‌న్నారు. క‌ళారంగం నుంచి రాజ‌కీయ క్షేత్రం వ‌ర‌కు అన్నిరంగాల్లోనూ స్వ‌యం సేవ‌క్‌లు ఉన్నార‌ని.. కొంద‌రు స్వ‌యంగా ఆయారంగాల‌ను ముందుకు తీసుకెళ్తున్నార‌ని.. మ‌రికొంద‌రు ఆయా రంగాల్లో అగ్ర‌భాగాన ఉన్నార‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ చెప్పుకొచ్చారు. అయితే, ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వారిని సంఘ్ నియంత్రించ‌ద‌ని, స్వ‌యం ప్ర‌తిప‌త‌తితో ప‌ని చేస్తుంటార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సంఘ్ భావ‌జాలం, సంస్కారం ఆధారంగా ఆ ప‌నుల‌న్నీ చేసేది స్వ‌యం సేవ‌కులే అయినా.. ఈ ప‌నుల‌న్నింటిని చూసి ఎవ‌రూ సంఘ్‌ని అర్థం చేసుకోలేర‌న్నారు. స్నేహం, ప్రేమ ఆధారంగానే సంఘ్‌ కార్యం నడుస్తుందని, ఇచ్ఛాపూర్వకంగా, వివేకంతో స్వయంసేవకులు పనులు చేస్తారని వివ‌రించారు. దేశాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రజల కోసం పనిచేసే కొన్నిసంస్థలు, కొంద‌రి పన‌ని అనుకుంటారని, అయితే ఈ స్వభావాన్ని మార్చి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాల‌ని ఉద్బోధించడమే సంఘ్ పని ఆయ‌న తెలిపారు. పార్టీలు, ప్రభుత్వాలు, నేతలు, మహా పురుషులు పోషించేది సహాయక పాత్ర మాత్రమేనని, సమాజమే యజమాని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సమాజంలో ఏకత, గుణాత్మకత వచ్చేవరకూ దేశ భవితవ్యం మారదని, అలా జ‌రుగ‌కుంటే మ‌నం ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టేన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యక్తి నుంచి వ్యవస్థ వరకూ.. దేశ సమగ్ర ఉన్నతి లక్ష్యంగా సంఘ్ ఆశిస్తున్న పంచ పరివర్తన్ గురించి వివ‌రించారు. కుటుంబ ప్రబోధన్ (భజన్, భోజన్, భాష, భూష, భవన్, భ్రమణ్), పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, స్వదేశీ, పౌరుల విధుల గురించి వివ‌రించారు. నేడు హిందూ స‌మాజంలో తాము హిందువుల‌మ‌ని గ‌ర్వించేవారు, హిందువులమని వ్యక్తిగతంగా మాత్రమే అంగీకరించేవారు, హిందువుగా జీవిస్తున్నప్పటికీ బయటకు వ్యక్తం చేయ‌ర‌ని వారున్నార‌న్నారు. అసలు హిందువులమన్న మూలాలనే మ‌రిచిన భిన్న వ‌ర్గాలున్నాయ‌ని కీల‌క వ్యాఖ‌లు చేశారు. అంద‌రం ఒకే సంస్కృతికి చెందిన వార‌మ‌ని.. అందరిలోనూ ఉమ్మడిగా ఈ చైతన్యం మేల్కొనేలా చేయడం నేటి సమాజం ముందున్న బాధ్యతన్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న బ‌దులిచ్చారు. ఆర్ఎస్ఎస్‌, సంఘ్‌లో మహిళల పాత్ర, హిందుత్వం, మతం, ధర్మం, సంస్కృతి, అంతర్గత సమస్యలు, కులవ్యవస్థ, సామాజిక సమరసత, యువతరం పాత్ర, స్వదేశీ, విద్య, కుటుంబం, దేశ భద్రత, జనాభా మార్పులు, భారత్‌తో ముడిపడిన అంతర్జాతీయ అంశాలు, దేశ నిర్మాణం, సమాజ సంబంధంగా స‌భికులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. సంఘ్‌లో భాగ‌స్వాములు కావ‌డం ఎలా అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. సంఘ శాఖ, సంఘ ప్రేరిత సంస్థల ద్వారా నేరుగా ఆ పని చేయవచ్చని, సంఘ్ చేసే పనిని వ్యక్తిగతంగా చేస్తున్నవారు సైతం అంతే గౌర‌వ‌నీయుల‌న్నారు. ఈ సంద‌ర్భంగా భూదానోద్య‌మం మూల‌ప‌రుడు వినోభా భావేని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు.

భార‌త దేశ అంత‌ర్జాతీయ సంబంధాల‌పై ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఏ దేశమైనా తమ జాతీయ ప్రయోజనాల మేరకే అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వ‌హిస్తుంటాయ‌ని.. భారత్ ఈ విషయంలో రాజీలేని ధోరణినే అవ‌లంభించాల‌ని సూచించారు. అంతర్జాతీయ పరిణామాలతో వ్యవహరించాలంటే ఏ దేశమైనా ఆర్ధికంగా, సామాజికంగా శక్తివంతంగా ఉండాల‌న్నారు. ప్రపంచంలో ఎంత అలజడి ఉన్న దేశంలో సామాజిక బాధ్యతతో కూడిన బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా వాటి ప్రభావం మ‌న‌పై త‌క్కువ‌గా ఉంటుంద‌న్నారు. అంత‌ర్గ‌త భ‌ద్ర‌తా, బంగ్లాదేశీయులు, రోహింగ్యాల చొర‌బాట‌పై ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. అక్రమంగా వచ్చినవారిని గుర్తించడం, నిర్బంధించడం, తిప్పి పంపడం ప్రభుత్వ విధులే అని.. అయినా పౌరులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ఈ విష‌యంలో అధికారులు, భ‌ద్ర‌తా సంస్థ‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచించారు. ఈ సంద‌ర్భంగా దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు సమాజ పరివర్తన జరగాలని, సహాయ సహకారాలు అందించాల‌ని ప్ర‌ముఖులు, మేథావుల‌ను ఆయ‌న కోరారు. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే వ్య‌క్తులు ఉదాహార‌ణ‌గా నిలుస్తూ త‌ద్వారా స‌మాజంలో మార్పును తీసుకురావాల‌ని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement