త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prashanth Reddy | ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో రేవంత్ సుదీర్ఘ ప్ర‌సంగం నిబంధ‌న‌ల‌కు విరుద్ధం

Prashanth Reddy | ప్ర‌శ్నోత్త‌రాల (Question Hour) స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సుదీర్ఘంగా ప్ర‌సంగించ‌డం ఇప్ప‌టివ‌ర‌కు శాస‌న‌స‌భ (Assembly) చ‌రిత్ర‌లో లేద‌ని మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి (Prashanth Reddy) అన్నారు. ఇది శాస‌న‌స‌భ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని చెప్పారు. స్పీకర్ (Speaker) పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందన్నారు.

A

Telangana | Published On Jan 3, 2026, 12.52 pm IST

Prashanth Reddy | ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో రేవంత్ సుదీర్ఘ ప్ర‌సంగం నిబంధ‌న‌ల‌కు విరుద్ధం
Advertisement

స్పీక‌ర్‌ది పూర్తి ప‌క్ష‌పాత వైఖ‌రి
సీఎంను విమ‌ర్శిస్తే మైక్ ఇయ్య‌న‌న‌డం స‌రికాదు
ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ఇంత అవ‌మానం జ‌ర‌గ‌లేదు
విలేక‌రుల స‌మావేశంలో మండిప‌డిన మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి

Prashanth Reddy | ప్ర‌శ్నోత్త‌రాల (Question Hour) స‌మ‌యంలో సుదీర్ఘంగా ప్ర‌సంగించ‌డం ఇప్ప‌టివ‌ర‌కు శాస‌న‌స‌భ (Assembly) చ‌రిత్ర‌లో లేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి (Prashanth Reddy) అన్నారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గంట‌న్న‌ర ప్ర‌సంగించ‌డం శాస‌న‌స‌భ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ (Speaker) పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం మొత్తం గమనించిందన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan)లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌శాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని చెబుతూనే.. మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అడిగారని, దీనిపై రేవంత్ రెడ్డి త‌గిన సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడారని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గంటన్నర పాటు ప్ర‌తిప‌క్ష‌ సభ్యులపై అసభ్యంగా మాట్లాడటం దారుణమ‌ని విమ‌ర్శించారు. స్పీక‌ర్ క‌నీసం దానికి అడ్డు చెప్ప‌కుండా ఉండ‌డంతో పాటు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించకుండా చేయడం అన్యాయమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షానికి కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.

ముఖ్యమంత్రి తప్పులను ఎత్తిచూపేందుకు మైక్ ఇవ్వడం లేదని ప్ర‌శాంత్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్వయంగా స్పీకర్ చెప్పడం ఎంతవరకు సబబని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడేందుకు కనీసం అవ‌కాశం కల్పించడం లేదని మండిప‌డ్డారు. అందుకే ప్ర‌స్తుత అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించామ‌ని చెప్పారు. తెలంగాణ స‌మాజం ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌ని కోరారు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ 2016లో శాస‌న‌స‌భ‌లో కాళేశ్వ‌రం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ సభ్యులు శాసనసభను బహిష్కరించారని అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం శాసనసభ నిబంధనలకు విరుద్ధమ‌ని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క స్పీకర్ కు ఉత్తరం రాసి, సంతకాలు చేశారుని చెప్పారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వనీతికి నిదర్శనమ‌న్నారు. అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా పీపీటీని వ్యతిరేకించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్‌కు కూడా అవకాశం కల్పించాలని స్పీకర్‌కు ఉత్తరం రాశామ‌ని పేర్కొన్నారు. పీపీటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్‌కు అవ‌కాశం క‌ల్పిస్తే స‌భ‌కు వెళ్తామ‌ని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో ఇన్ని అవమానాలు జరగలేదన్నారు. తెలంగాణ వాదాన్ని కూడా అసెంబ్లీలో గట్టిగా వినిపించామ‌ని గుర్తు చేశారు. గతంలో శాసనసభకు కాలిన మోటార్లు, ఎండిన వరి పైరులు తీసుకెళ్లామ‌ని చెప్పారు.

అసెంబ్లీయా.. రేవంత్ ప్యాలెసా..: గంగుల క‌మలాక‌ర్

శాస‌న‌స‌భ స్పీక‌ర్ బీఆర్ఎస్ స‌భ్యుల గొంతు నొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆరోపించారు. అది అసెంబ్లీయా లేక రేవంత్ ప్యాలెసా అని ప్ర‌శ్నించారు. స్పీక‌ర్ అసెంబ్లీని గాంధీభ‌వ‌న్‌లా, రేవంత్ ప్యాలెస్‌లా న‌డిపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి భజన చేసేందుకు అసెంబ్లీకి వెళ్లాలా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఇలా జరగడం దారుణమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ హుందాగా నడిచిందని, గత స్పీకర్ ప్రతిపక్షాలకు తగినంత సమయం ఇచ్చారని గుర్తు చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అసెంబ్లీలో స్పీక‌ర్‌గా కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, నాదెండ్ల మ‌నోహ‌ర్ వ్య‌వ‌హ‌రించార‌ని.. అప్పుడు కూడా ఇన్ని అవ‌మానాలు ఎదుర్కోలేద‌ని వాపోయారు. సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని అప్పటి స్పీకర్ అంద‌రికీ స‌మ‌యం ఇచ్చేవార‌ని చెప్పారు. నిన్న స్పీకర్ వ్య‌వ‌హ‌రించిన తీరు బాధాకరమ‌న్న గంగుల‌.. ఏం మాట్లాడాలో ఎజెండా కూడా ఆయ‌నే పంపిస్తే బాగుంటుంద‌ని ఎద్దేవా చేశారు. స్పీక‌ర్ ప‌క్ష‌పాత వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. ముఖ్యమంత్రికి ఎలాంటి హక్కు ఉంటుందో త‌మ‌కు కూడా అదే హక్కు ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను తిట్టేందుకు మాత్రమే నిన్న సభకు వచ్చాడని విమ‌ర్శించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో సీఎం రెండు గంట‌లు మాట్లాడ‌తారా అని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్య‌మంత్రి మాట్లాడాల‌నుకుంటే వేరే మార్గంలో మాట్లాడాల‌ని సూచించారు.

ఉపాధి హామీ పథకంపై తాను, జ‌గ‌దీశ్‌రెడ్డి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, కానీ ఏం మాట్లాడాల‌ని ప్ర‌శ్నించారు. సీఎంకు భ‌జ‌న చేయాలా చెప్పాల‌ని సూచించారు. సమస్య తీవ్రతను సభ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామ‌ని చెప్పారు. స్పీక‌ర్‌, ముఖ్య‌మంత్రి ఇద్ద‌రూ స‌భా సంప్ర‌దాయాల‌ను తుంగ‌లో తొక్కుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద‌, ఎమ్మెల్యేలు చింతా ప్ర‌భాక‌ర్‌, మాధ‌వ‌రం కృష్ణారావు, డాక్ట‌ర్ కె. సంజ‌య్‌, కాలేరు వెంక‌టేశ్‌, మాణిక్‌రావు, విజ‌యుడు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement