త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్న‌డు.. ఆ 15 ఎక‌రాల‌ను తిరిగి ఇవ్వాల్సిందే

Vemula Prashanth Reddy | హైద‌రాబాద్ బుద్వేల్‌లో ఆర్‌బీవీఆర్ఆర్ సొసైటీకి కేసీఆర్ ఇచ్చిన 15 ఎక‌రాల భూమిని రేవంత్‌రెడ్డి లాక్కున్నాడ‌ని.. ఆ భూమిని వెన‌క్కి తిరిగి ఇవ్వాల్సిందేన‌ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ పేరుతో గుంజుకుని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అమ్మేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Aug 22, 2026, 6.19 pm IST

Vemula Prashanth Reddy | రెడ్డి సొసైటీ భూమిని రేవంత్‌రెడ్డి గుంజుకున్న‌డు.. ఆ 15 ఎక‌రాల‌ను తిరిగి ఇవ్వాల్సిందే
Advertisement
  • హైదరాబాద్ బుద్వేల్‌లో రెడ్డి సొసైటీకి కేసీఆర్ ఇచ్చిన ఆర్బీవీఆర్ఆర్ (RBVRR) భూమిని వెనక్కి ఇవ్వాలి
  • మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో రేవంత్ లాక్కున్నడు
  • ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకే సొసైటీ సభ్యులను బెదిరిస్తున్న‌డు
  • ప్రభుత్వంలోని రెడ్డి మంత్రులు నోరు విప్పాలి.. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలి
  • రాజా బహద్దూర్ వెంకట్రాంరెడ్డి విగ్రహ ఆవిష్కరణ సభలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్‌

Vemula Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్: హైద‌రాబాద్ బుద్వేల్‌లో ఆర్‌బీవీఆర్ఆర్ సొసైటీకి కేసీఆర్ ఇచ్చిన 15 ఎక‌రాల భూమిని రేవంత్‌రెడ్డి లాక్కున్నాడ‌ని.. ఆ భూమిని వెన‌క్కి తిరిగి ఇవ్వాల్సిందేన‌ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ పేరుతో గుంజుకుని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అమ్మేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఉన్న రెడ్డి మంత్రులు దీనిపై నోరు విప్పి సీఎంపై ఒత్తిడి తేవాల‌న్నారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రాంరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయ‌న శ‌నివారం ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యులు హరీశ్ రావుతో కలిసి రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రాంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

విద్యాసంస్థల ఏర్పాటు కోసం రెడ్డి సమాజానికి కేటాయించిన భూమిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఈ చర్యను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలన్న కేసీఆర్ సంకల్పంలో భాగంగా, గతంలో దివంగత నాయిని నర్సింహారెడ్డి, హరీష్ రావు తన విజ్ఞప్తి మేరకు రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ వద్ద ఆర్బీవీఆర్ఆర్ (RBVRR) సొసైటీకి కేసీఆర్ 15 ఎకరాల స్థలాన్ని, 10 కోట్ల నగదును కేటాయించినట్లు వేముల గుర్తు చేశారు.

గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఎందరో రెడ్డి ముఖ్యమంత్రులు ఏ ఒక్కరు కూడా రెడ్డి సామజిక వర్గానికి చేయని గొప్ప పనిని కేసీఆర్ మాత్రమే చేసి చూయించారు అని అన్నారు. నాడు 150 కోట్లు ఉన్న ఈ భూమి ప్రస్తుత విలువ సుమారు రూ. 1500 కోట్లకు చేరుకుందన్నారు. స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ. 10 కోట్ల నిధులను సైతం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందని, దీంతో కాంపౌండ్ వాల్ తో పాటు స్లాబ్ స్థాయికి నిర్మాణం చేరుకుందని ఆయన వివరించారు.

ఈ విద్యా సంస్థలో 50 శాతం రెడ్డి సామాజిక వర్గానికి, మిగతా 50 శాతం ఇతర వర్గాలకు అవకాశం కల్పించేలా గొప్పగా విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్ణయించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పేరుతో ఈ భూమిని లాక్కోవడం దుర్మార్గమని ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, ఫైవ్ స్టార్ హోటల్స్ కు అమ్ముకునే కుట్రతో జీవోను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. న్యాయం అడిగేందుకు వెళ్లిన సొసైటీ సభ్యులను సీఎం బెదిరించడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఇదే తీరు కొనసాగితే, భవిష్యత్తులో ఇతర కులాలకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాల స్థలాలకు కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

రద్దు చేసిన స్థల కేటాయింపు జీవోను తక్షణమే ఉపసంహరించుకొని, RBVRR సొసైటీకి ఆ 15 ఎకరాల భూమిని తిరిగి అప్పజెప్పాలన్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్న రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఈ అన్యాయంపై నోరు విప్పాలని వేముల డిమాండ్ చేసారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం భూములు తిరిగి ఇవ్వకపోతే, రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ భూములను సొసైటీకి తిరిగి అప్పగిస్తామని వేముల అన్నారు.

రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, కేవలం 18 ఏళ్లకే పోలీస్ శాఖలో చేరి, తన సమర్థత, విధేయత, నిజాయితీలతో నిజాం నవాబు మన్ననలు పొందారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే అప్పట్లో నాన్-ముస్లింలకు ఇవ్వని డీజీపీ స్థాయికి సమానమైన 'హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (కొత్వాల్)' బాధ్యతలను ఆయనకు అప్పగించారని, ఆ పదవిని అధిష్టించిన తొలి హిందువుగా ఆయన చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పడుతున్న వసతి ఇబ్బందులను గమనించిన వెంకట్రాంరెడ్డి.. నిజాం నవాబును మెప్పించి ఆబిడ్స్ నడిబొడ్డున స్థలాన్ని కేటాయించేలా చేసి 'రెడ్డి హాస్టల్'ను స్థాపించారని తెలిపారు. ఆ హాస్టల్‌లో చదువుకున్న అన్ని వర్గాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వారు దేశస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని ప్రశాంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆడపిల్లల చదువు కోసం నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల, రెడ్డి మహిళా కళాశాల, హాస్టల్ ఏర్పాటు చేసి స్త్రీ విద్యాభివృద్ధికి నాడే విశేష కృషి చేశారని కొనియాడారు.

చేతిలో అపారమైన నిధులు, అధికార బలం ఉన్నప్పటికీ, ఆయన మరణించే నాటికి ఆయన జేబులో కేవలం 30 రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఇది ఆయన నిస్వార్థ, నిరాడంబర జీవితానికి సజీవ సాక్ష్యమని ఆయన ఉద్వేగంగా పేర్కొన్నారు.ఇతరుల ఎదుగుదలను ఆకాంక్షించే వెంకట్రాంరెడ్డి గారి భావజాలాన్ని నేటి తరం నాయకులు పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ పుట్టి పెరిగిన సిద్దిపేట గడ్డపై, వెంకట్రాంరెడ్డి స్ఫూర్తితో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి, సమాజ సేవకు ఉపయోగపడేలా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయడం అత్యంత అభినందనీయమన్నారు. హరీశ్ రావు తమ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు అని బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి దివంగ‌త‌ సురేందర్ రెడ్డి సైతం హరీశ్ రావును ఎంతో ఆప్యాయంగా పిలుచుకునేవారని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ఆశయాలను, వారసత్వాన్ని నూటికి నూరు శాతం కొనసాగిస్తూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గొప్ప నాయకుడు హరీశ్ రావు అని ఆయన కొనియాడారు. రాజకీయాల్లో హరీష్ రావు ఇచ్చిన సలహాలను తూచా తప్పకుండా పాటించడం వల్లే తాను వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించగలిగానని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు

2012-13 సమయంలో అధికారంలో లేనప్పటికీ, ఒక ఎకరం ప్రభుత్వ భూమిని రెడ్డి సంఘానికి కేటాయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఆ తర్వాత సొంత నిధులు, విరాళాల ద్వారా మరో అర ఎకరం భూమిని సమకూర్చి, భవన నిర్మాణానికి సుమారు రూ. 3-4 కోట్లు నిధులు సమీకరించి ఒక బృహత్తర వ్యవస్థను హరిష్ రావు నిలబెట్టారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. పల్లెల్లో 'నీరటికాని పొలం ఎండిపోదు' అనే సామెతను ఉదహరిస్తూ.. చెరువు కింద రైతులందరికీ నీరు పారించే నీరటికాడు తన పొలాన్ని ఎలాగైతే పచ్చగా ఉంచుకుంటాడో, అలాగే సిద్దిపేట ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తూ వారి నియోజకవర్గాన్ని ఆయన సస్యశ్యామలం చేసుకున్నారని కితాబిచ్చారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరుమల్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వ్యాపారవేత్తలు, రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement