త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఏ ఒక్క‌రినీ ఉద్యోగం నుంచి తొల‌గించేది లేదు.. ఆర్టీసీ ఉద్యోగుల‌కు సీఎం రేవంత్‌ భ‌రోసా

Revanth Reddy | టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌ని కార్మిక సంఘాల ప్ర‌తినిధుల‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు.

G

Telangana | Published On May 2, 2026, 10.06 am IST

Revanth Reddy | ఏ ఒక్క‌రినీ ఉద్యోగం నుంచి తొల‌గించేది లేదు.. ఆర్టీసీ ఉద్యోగుల‌కు సీఎం రేవంత్‌ భ‌రోసా
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌ని కార్మిక సంఘాల ప్ర‌తినిధుల‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, ప్రభుత్వంలో విలీనంపై అన్ని సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు. పీఆర్సీ అంశాన్ని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సంస్థలను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడంలో కార్మికులు సహకరించాలని కోరారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నందుకు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, విలీనంపై ఏవిధంగా ముందుకు పోవాల‌నే దానిపై సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై ప్ర‌భుత్వం ఎదుట ఆప్ష‌న్లు ఉంచాల‌ని సూచించారు. ఒక‌వేళ యూనియ‌న్ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోతే ఏ యూనియ‌న్‌కు ఆ యూనియ‌న్ త‌మ ఆప్ష‌న్లు ఇస్తే కామ‌న్‌గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి.. భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చ‌ర్చిద్దామ‌ని చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ని, అధికారులను ఆదేశించారు. సంస్థ అభివృద్ధి, మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌జ‌ల‌కు మంచి సేవ‌లు అందించాలన్న కార్య‌చ‌ర‌ణ కోసం ముందుకు వ‌చ్చినందుకు కార్మిక నాయకులకు అభినంద‌న‌లు తెలిపారు.

నేను వేరు.. మీరు వేరు కాదు..

“నేను వేరు, మీరు వేరు అన్న భావ‌న నాకు ఎప్పుడు లేదు. అంద‌రం క‌లిస్తేనే ప్ర‌భుత్వం. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేం ఉన్నాం. ఆర్టీసీలో బ‌స్సుల‌ను పెంచాం, నియామ‌కాలు పెంచాం, ఆదాయం పెంచాం. ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించే విష‌యంలో కార్మికులు ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల‌నే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థ‌గా నిలిచింది. గాజుల‌రామారంలో బస్ టెర్మిన‌ల్ కోసం 100 ఎక‌రాలు కేటాయించాం. శంషాబాద్‌లో 150 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి బ‌స్ టెర్మిన‌ల్ నిర్మిస్తాం. 1000 ఈవీ బ‌స్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నాం. అలాగే, మినీ బ‌స్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అంద‌జేయాల‌నుకుంటున్నాం.

డీజీల్‌పై ఆర్టీసీ ప్ర‌తి యేడాది రూ.2000 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ది. డీజీల్ ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి ఈవీ బ‌స్సుల‌ను తీసుకురావాలి. ఆదాయం పెర‌గాలంటే ఖ‌ర్చు త‌గ్గించుకోవాలి. దీని కోసం ప‌క్కా ప్ర‌ణాళిక కావాలి. ఆర్టీసీలో బ‌కాయిలు మా హ‌యాంలో పెట్టిన‌వి కావు. కానీ వాటిని క్లియ‌ర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామాల‌ను ప్రజా ప్రభుత్వం చేపట్టింది.

ప్ర‌భుత్వం ముందు ఆప్ష‌న్స్ పెట్టండి..

ఆర్టీసీ స‌మ‌స్య‌లు ఏవైనా నా దృష్టికి వ‌స్తే వెంట‌నే ప‌రిష్క‌రించాను. యూనియన్లు, విలీనం లాంటి అంశాల‌పైన ప్ర‌ణాళిక బ‌ద్దంగా కార్మిక సంఘాలే చ‌ర్చించుకుని నిర్ణ‌యం చెప్పాలి. ఆర్థిక అంశాల‌తో కూడా పీఆర్సీ లాంటి వాటిపైన ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది. శాశ్వ‌త ప‌రిష్కారం కోసం చ‌ర్చించుకుని ప్ర‌భుత్వం ముందు ఆప్ష‌న్స్ పెట్టాలి. రాజ‌కీయాల ప్ర‌భావానికి లోనైతే సంస్థ‌కు న‌ష్టం జ‌రుగుతుంది. ఆర్టీసీ అప్పుల పైన ఉన్న వ‌డ్డీ భారాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేసుకుని నిల‌బెట్టుకోవ‌డానికి కార్మికులు స‌హ‌క‌రించాలి.

కార్మికుల‌పైనే..

ఆర్టీసీలో ఒక్క డ్రైవ‌ర్‌ను కూడా త‌గ్గించం. మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం పెట్ట‌డం ద్వారా రూ.8 వేల కోట్లు ఆర్టీసీకి ఇచ్చాం. ఆర్టీసీని బాగు చేసుకునే అవ‌కాశం కార్మికుల‌పైనే ఉంది. కార్మికులు, డిపో మేనేజ‌ర్ల మ‌ధ్య గ్యాప్ రాకుండా అధికారులు చూడాలి. ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికి ఉద్యోగుల బ‌కాయిలు తీర్చ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఈసారి ఉద్యోగుల‌కు రూ.1000 కోట్ల బ‌కాయిలు విడుద‌ల చేశాం. సంస్థ ఆగిపోతే ఊపిరిపోయిన‌ట్లే. సంస్థ‌కు న‌ష్టం జ‌రిగే ప‌నులు చేయొద్దు. కార్మికులు, ఆర్టీసీ యాజ‌మాన్యం మ‌ధ్య ఎప్పుడూ స్నేహా పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉండాలి. ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల హ‌క్కుల‌ను కాపాడుతుంది.

ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయ‌కులు, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement