త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ

Damodar Rajanarasimha | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, దీంతో ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలపై మరింత విశ్వాసం పెంచుకుంటున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండగా, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోందని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలే చెబుతున్నాయని పేర్కొన్నారు.

P

Telangana | Published On Jul 18, 2026, 9.25 pm IST

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
Advertisement

Damodar Rajanarasimha | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, దీంతో ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలపై మరింత విశ్వాసం పెంచుకుంటున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండగా, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోందని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. శనివారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ప్రభుత్వ జనరల్, ఏరియా ఆస్పత్రులు సహా 100 పడకలకు పైబడిన ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు ఆసక్తి చూపుతున్నారని, ఇటీవల చేపట్టిన నియామకాలే దీనికి నిదర్శనమన్నారు. గత రెండున్నరేళ్లలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేశామని, డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది నియామకాలతో పాటు అవసరమైన చోట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కొత్త ఆస్పత్రి భవనాలు, మందులు, శస్త్రచికిత్స సామగ్రి తదితర వసతులను ప్రభుత్వం సమకూరుస్తోందని చెప్పారు. ప్రభుత్వం అన్ని వనరులు అందిస్తున్న నేపథ్యంలో సేవల నాణ్యతలో ఎలాంటి లోపాలకు అవకాశం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి సూపరింటెండెంట్ తన ఆస్పత్రిని బాధ్యతగా నిర్వహిస్తూ, రోగి ఆస్పత్రిలో అడుగుపెట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజూ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడాలని, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, ఆహార నాణ్యత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం, అనవసర గైర్హాజరు, రోగులను వేచి పెట్టడం, చికిత్సలో జాప్యాన్ని సహించబోమని హెచ్చరించారు. అత్యవసర విభాగాలు, ఐసీయూలు, ప్రసూతి విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ యూనిట్లు, ల్యాబ్‌లు, బ్లడ్ బ్యాంకులు, రేడియాలజీ సేవలు 24 గంటలు సమర్థంగా పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. ఆధునిక వైద్య పరికరాలు ఎప్పటికప్పుడు వినియోగంలో ఉండేలా చూడాలని, మందులు లేదా మౌలిక సదుపాయాల కొరత ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

ఆస్పత్రుల పనితీరును ఇకపై డ్యాష్‌బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సలు, అత్యవసర సేవలు, మాతా-శిశు ఆరోగ్య సేవలు, పరిశుభ్రత, రోగుల సంతృప్తి వంటి ప్రమాణాల ఆధారంగా పనితీరును అంచనా వేస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బందిని ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్, ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్ చైర్‌పర్సన్ డాక్టర్ కవిత పాల్గొన్నారు.

Advertisement
Advertisement