త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ప్ర‌జ‌ల‌కు ఒక‌సారి బీజేపీకి అవ‌కాశం ఇవ్వాల‌నుంది: బీజేపీ చీఫ్‌ రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | రాష్ట్రంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ప‌రిపాల‌న చూసి ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని.. బీజేపీకి ఒక‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని చూస్తున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు వ్యాఖ్య‌నించారు. మీ ప‌ని కూడా మోదీ చేయాల్నా అని కాంగ్రెస్‌ను ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On May 30, 2026, 2.39 pm IST

Ramchandar Rao | ప్ర‌జ‌ల‌కు ఒక‌సారి బీజేపీకి అవ‌కాశం ఇవ్వాల‌నుంది: బీజేపీ చీఫ్‌ రాంచంద‌ర్‌రావు
Advertisement
  • కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫ‌ల‌మైంది
  • మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియ‌డం లేదు
  • రైతు డిస్కంపై నేను మాట్లాడ‌ను
  • కానీ సామాన్యుల‌కు న‌ష్టం జ‌రిగితే ఉద్య‌మం త‌ప్ప‌దు
  • మీడియా స‌మావేశంలో రేవంత్ స‌ర్కార్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు హెచ్చ‌రిక‌

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ప‌రిపాల‌న చూసి ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని.. బీజేపీకి ఒక‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని చూస్తున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు వ్యాఖ్య‌నించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్ర‌భుత్వం చేత‌గానిత‌నం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. కరీంనగర్‌లో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. మీ ప‌ని కూడా మోదీ చేయాల్నా అని కాంగ్రెస్‌ను ప్ర‌శ్నించారు. మంత్రులు పూట‌కో మాట మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

రేపు అధికారంలోకి వ‌చ్చాక ఏం చేయాలో చేసి చూపిస్తాం. ప్ర‌జ‌లు దానికోసం ఎదురు చూస్తున్నారు. యువ‌త, మ‌హిళ‌లు అంద‌రూ బీజేపీ రావాల‌ని చూస్తున్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ చేసిన మోసాల‌ను ప్ర‌జ‌లు చూశారు. అందుకే బీజేపీకి ఒక‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ అనేది అనేకమంది కార్యకర్తల త్యాగాలు, అంకితభావం, అచంచల నిబద్ధతతో నిర్మితమైన పార్టీ. కరీంనగర్‌లో కూడా ఎంతో మంది కార్యకర్తలు మాతృభూమి సేవలో తమ జీవితాలను త్యాగం చేశారు. ఈరోజు కరీంనగర్‌లో బీజేపీ జెండా రెపరెపలాడుతుందంటే, అది వారి పోరాటం, త్యాగం, నిస్వార్థ సేవ ఫలితమే.

త‌క్కువ ధ‌ర‌కు అమ్మిచ్చే ప్ర‌య‌త్నం..

కొన్ని రోజులుగా బీజేపీ ప్ర‌తినిధులంతా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ కొనుగోలు కేంద్రాలు ప‌రిశీలించాం. రైతుల గోస‌లు దగ్గ‌రుండి విన్నాం. మేం ఎక్క‌డికి వెళ్తే అక్క‌డికి అధికారుల‌ను, క‌లెక్ట‌ర్లను పంపించి రైతుల ధాన్యాన్ని బ‌ల‌వంతంగా రైస్‌మిల్లుల‌కు త‌ర‌లించారు. త‌ప్ప‌నిస‌రిగా రైతులు ధాన్యం అమ్ముకునే ప‌రిస్థితులు ఉన్నాయి. క్వింటాకు 10 కిలోల త‌రుగు తీసేస్తున్నారు. ఎమ్మెస్పీ ధ‌ర ఉన్న త‌ర్వాత కూడా కేంద్రం డ‌బ్బులిస్తే రాష్ట్ర ప్ర‌భుత్వం అన్యాయం చేస్తోంది. రైస్ మిల్ల‌ర్ల‌తో జ‌రిగిన ఒప్పందంతో రైతుల‌ను బల‌వంతంగా త‌క్కువ ధ‌ర‌కు అమ్మిచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంది అని రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు.

మీరు కొనే ఇండెంట్‌ను కేంద్రానికి పంపండి..

మంత్రులు కూడా చెప్పే మాటల్లో వారికే పొంత‌న లేదు. ఒక్కొక్క‌రు ఒక్కోలా మాట్లాడుతున్న‌రు. సివిల్ సప్ల‌య్ మినిస్ట‌ర్ 60 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొన్నామ‌ని చెబుతున్నారు. వేరే మంత్రులేమో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు కొన్నాం, ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు 50 కొన్నాం అని అంటున్న‌రు. కేంద్ర ప్ర‌భుత్వం మొత్తం కొనాలే అని చెబుతుంది. ముందు మీరు కొనే ఇండెంట్‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి పంపండి. రాష్ట్ర ప్ర‌భుత్వం కొన్న ప్ర‌తి గింజ‌కు కేంద్రం డ‌బ్బులు ఇస్తుంది అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు తెలిపారు.

మీ కొత్త విధానం మీద మాట్లాడ‌ను..

బీఆర్ఎస్ వాళ్లు 24 ఉచిత క‌రెంటు అని చెప్పి అబ‌ద్దాలు చెబుతున్నారు. డిస్కంల‌కు 70 వేల కోట్లు బ‌కాయిలు చేశారు. ఇప్పుడున్న‌ ప్ర‌భుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. అప్పుడు జ‌రిగిన అవినీతి ఇప్పుడు జ‌ర‌గ‌కుండా ఈ ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకోవాలి. మీ కొత్త విధానం మీద నేన్ మాట్లాడ‌ను. కానీ సామాన్యుల మీద భారం మోపితే ఊరుకోం. ఏవిధంగా అయితే బ‌స్సు చార్జీలు పెంచారో అదే విధంగా క‌రెంటు చార్జీలు పెంచే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్న‌య్‌. మీరు చార్జీలు పెంచితే బీజేపీ త‌ప్ప‌కుండా ఉద్య‌మం చేస్తుంది అని బీజేపీ చీఫ్ హెచ్చ‌రించారు.

విద్యార్థుల‌కు 10 వేల కోట్ల బ‌కాయి ప‌డ్డారు..

కాంగ్రెస్ నేత‌లు ఎన్నో వాగ్దానాలు చేశారు. స్కూటీలిస్తామ‌న్నారు.. బంగారం ఇస్తామ‌న్నారు.. రైతుల‌కు రైతు భ‌రోసా అన్న‌రు. ఎన్నిసార్లు ఇచ్చారో చెప్పండి. పెన్ష‌న్‌లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి మీది. నిరుద్యోగ భృతి ఏమైంది? ఉద్యోగుల‌కు ఒక‌టో తారీఖున జీతాలు ఇవ్వాల‌ని తెలియ‌దా? ఇంత నిర్ల‌క్ష్యం ఎందుకు? 10 వేల కోట్ల రూపాయ‌లు విద్యార్థులకు ప్ర‌భ‌త్వం బ‌కాయిప‌డి ఉంది. శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీలో ఎంత‌మంది శాశ్వ‌త ఉద్యోగులున్నారో చూడండి. కాంట్రాక్ట్ ప్రాతిప‌దికన‌ ఉన్న‌వారే ఎక్కువున్నారు. మొత్తం విద్యావ్య‌వ‌స్థ‌ను, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించారు. ఇంకోవైపు వైద్య‌రంగాన్ని కూడా భ్ర‌ష్టు పట్టించారు. హైద‌రాబాద్ వంటి న‌గ‌రంలో రియ‌ల్ ఎస్టేట్ కుప్ప‌కూలింది. రైతులు గోస ప‌డుతున్నరు అని రాంచంద‌ర్‌రావు ఫైర‌య్యారు.

అలా అన‌డానికి నోరెలా వ‌చ్చింది?

గ‌త ప్ర‌భుత్వం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వ‌రంలో అవినీతికి పాల్ప‌డింది. ప్ర‌జ‌ల‌కు కావాల్సింది మంచి ప‌రిపాల‌న‌. దాదాపు 66 మంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వ‌క ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రాష్ట్రానికి దాదాపు 12 జాతీయ ర‌హదారులు కేంద్రం ఇచ్చింది. భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఉన్న ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఇచ్చాం. బీబీన‌గ‌ర్‌లో ఎయిమ్స్ ఇచ్చాం. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ కింద రైతుల‌కు ఆరు వేల చొప్పున ఖాతాల్లో వేస్తున్నాం. ఇదంతా చేసేది మోదీ కాదా? కేంద్రం ఏం ఇయ్య‌లేద‌ని చెప్ప‌డానికి నోరెలా వ‌చ్చింది అని ఆయన మండిప‌డ్డారు.

మీ కండ్ల‌కు క‌నిపిస్త‌లేవా?

ఖాజీపేట‌లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ, వ‌రంగ‌ల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌, జ‌హీరాబాద్‌లో ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్, శంషాబాద్ చుట్టూ ఉన్న ఏరోస్పేస్ ఇండ‌స్ట్రీస్ ఇవ‌న్నీ చేస్తే మీ కండ్ల‌కు క‌నిపిస్త‌లేవా? మీ మెద‌డులో గుండు సున్నా ఉంది కాబ‌ట్టే మీకు ఇవ‌న్నీ అర్థం కావ‌డం లేదు. ఇంత త‌క్కువ కాలంలో ఏ ప్ర‌భుత్వానికి ఇంత వ్య‌తిరేక‌త రాలేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ‌చ్చింది. ప్ర‌తిసారీ ఢిల్లీ వెళ్తారు. వ‌చ్చి మ‌మ్మ‌ల్ని తిడ‌తారు. మోదీ 12 పాల‌న‌లో ఏ అవినీతి జ‌ర‌గ‌లే. కానీ మీ ప్ర‌భుత్వంలో ఎక్క‌డ చూసినా అవినీతే. ఈ క‌మీష‌న్ ప్ర‌భుత్వం పోవాలే. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న, ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ఆయుష్మాన్ భార‌త్‌ను తెలంగాణలో ఎందుకు అమ‌లు చేస్త‌లేరు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఎందుకు దూరం చేస్తున్నారు. మీరు ఏ ప‌థ‌కంతో సంక్షేమం అందిస్తున్నారు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

కాంగ్రెస్ పాల‌న‌లో ఉగ్ర‌వాదాలతో చాలా మందికి సంబంధాలు ఉండే. 2002 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు లేనివాళ్ల ఓట్లు కూడా ఉన్న‌య్‌. అందుకే న‌కిలీ ఓట్లు తీసేశారు. రోహింగ్యాల‌కు మ‌న ద‌గ్గ‌ర ఓటర్ లిస్టుల్లో పేర్లు ఉన్న‌య్‌. వెళ‌తారా కేసులు పెట్ట‌మంటారా అని అమిత్ షా అడిగారు. దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేసేవాళ్ల‌తో వాళ్ల‌కు సంబంధాలు ఉన్న‌య్ అని ఆయ‌న ఆరోపించారు.

రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాలి..

రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా అబద్దాలు ఆడుతున్నారు. జమ్మికుంట‌తో పాటు ఆయా చోట్ల మొక్క‌జొన్న ప‌డి ఉంది. మొత్తం కేంద్ర‌మే కొనాల‌ని మాట్లాడ‌డం స‌రికాదు. రైతుల‌పై కొంచెం కూడా వారికి శ్ర‌ద్ధ లేదు. మొత్తం ధాన్యం మీరే కొనాలే. ఇదే మా డిమాండ్. రాష్ట్రంలో ఎంత న‌ష్టం జ‌రిగిందో క‌లెక్ట‌ర్లు అంచ‌నా వేయాలే. క్షేత్ర‌స్థాయిలో రైతులు చెప్పేది వేరుంది. నాయ‌కులు చెప్పేది రైతులు చెప్పేదానికి పొంత‌న లేదు. అకాల వ‌ర్షాల‌కు మామిడి రైతులు న‌ష్ట‌పోయారు. వారికి ప్ర‌భుత్వం ప‌రిహారం ఇవ్వాలి అని రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement