త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania Hospital | దేశంలోనే తొలిసారిగా.. ఒకే రోగికి ఒకేసారి 5 అవ‌య‌వాల మార్పిడి.. ఇదీ ఉస్మానియా వైద్యుల ఘ‌న‌త‌

Osmania Hospital | రాష్ట్రంలోని ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు చ‌రిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి, ఒకే రోగికి 5 అవయవాలను విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. అత్యంత క్లిష్ట‌మైన ఈ శ‌స్త్ర‌చికిత్స 36 గంట‌ల పాటు నిరాంత‌రాయంగా కొన‌సాగింది.

S

Telangana | Published On Jul 1, 2026, 3.46 pm IST

Osmania Hospital | దేశంలోనే తొలిసారిగా.. ఒకే రోగికి ఒకేసారి 5 అవ‌య‌వాల మార్పిడి.. ఇదీ ఉస్మానియా వైద్యుల ఘ‌న‌త‌
Advertisement

Osmania Hospital | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు చ‌రిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి, ఒకే రోగికి 5 అవయవాలను విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. అత్యంత క్లిష్ట‌మైన ఈ శ‌స్త్ర‌చికిత్స 36 గంట‌ల పాటు నిరాంత‌రాయంగా కొన‌సాగింది. కడుపు (Stomach), డ్యూడినమ్ (duodenum), ప్యాంక్రియాస్ (Pancreas), చిన్నపేగు (small bowel), పెద్దపేగు(Rt colon) అవయవాలను ఒకేసారి మార్పిడి చేశారు. ఈ శ‌స్త్ర చికిత్స గ్యాస్ట్రోఎంటరాల‌జీ హెడ్, చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ సీహెచ్ మ‌ధుసూద‌న్ నేతృత్వంలో కొన‌సాగింది. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఇలాంటి స‌ర్జ‌రీ నిర్వ‌హించ‌డం ఇదే ప్ర‌థ‌మం.

సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఉస్మానియా వైద్య బృందం సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను మరింత పెంచిందని మంత్రి పేర్కొన్నారు.

ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేసిన వైద్యులు, అనస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్, ఇతర సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యాధునిక, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఉస్మానియా వైద్యుల ఘనత నిదర్శనమని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement