త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lungs Cancer | ధూమ‌పానం అల‌వాటే లేదు.. అయినా మ‌హిళ‌ల్లో పెరుగుతున్న లంగ్ క్యాన్స‌ర్ కేసులు..!

Lungs Cancer | ధూమ‌పానం అతిగా అల‌వాటు ఉన్న‌వారు ఏదో ఒక రోజు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంది.. ప‌డుతున్నారు కూడా. అయితే ధూమ‌పానంతో సంబంధం లేని వారు కూడా లంగ్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది మ‌హిళ‌లే ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఈ క్యాన్స‌ర్ కేసులు పెర‌గ‌డం అనేది కేవ‌లం తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కే ప‌రిమితం కాలేదు.. ద‌క్షిణ భార‌త‌దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ కేసులు పెరుగుతున్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

S

Telangana | Published On May 16, 2026, 3.16 pm IST

Lungs Cancer | ధూమ‌పానం అల‌వాటే లేదు.. అయినా మ‌హిళ‌ల్లో పెరుగుతున్న లంగ్ క్యాన్స‌ర్ కేసులు..!
Advertisement

Lungs Cancer | త్రినేత్ర‌.న్యూస్ : ధూమ‌పానం అతిగా అల‌వాటు ఉన్న‌వారు ఏదో ఒక రోజు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంది.. ప‌డుతున్నారు కూడా. అయితే ధూమ‌పానంతో సంబంధం లేని వారు కూడా లంగ్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది మ‌హిళ‌లే ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఈ క్యాన్స‌ర్ కేసులు పెర‌గ‌డం అనేది కేవ‌లం తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కే ప‌రిమితం కాలేదు.. ద‌క్షిణ భార‌త‌దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ కేసులు పెరుగుతున్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

గ‌త నెల‌లో ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ ఇన్ఫ‌ర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన తెలంగాణ క్యాన్స‌ర్ బ‌ర్డెన్ ప్రొఫైల్ ప్ర‌కారం.. తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది 46,700కు పైగా క్యాన్స‌ర్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇందులో మ‌హిళ‌లే అధికంగా ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రతి లక్ష మంది మహిళల్లో 6.8 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇది అత్యధికం.

ద‌క్షిణ భార‌త‌దేశం మ‌హిళ‌లు పొగాకు వినియోగించ‌డం చాలా త‌క్కువ‌. అయితే 10 శాతం కంటే త‌క్కువ మ‌హిళ‌లు పొగాకు వినియోగిస్తున్న‌ప్ప‌టికీ.. వారిలో లంగ్ క్యాన్స‌ర్ కేసుల పెరుగుద‌ల తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని సీనియ‌ర్ వైద్యులు తెలిపారు.

ఎన్‌సీడీఐఆర్ క్యాన్స‌ర్ డేటా ప్ర‌కారం.. తెలంగాణ‌లో 58.8 శాతం మంది పురుషులు పొగాకును సేవించ‌డంతో లంగ్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. మ‌హిళ‌ల్లో 29.7 శాతంగా న‌మోదైంది. అయితే మ‌హిళ‌ల్లో వ‌చ్చే 70.3 శాతం క్యాన్స‌ర్ల‌కు పొగాకుతో ఏ మాత్రం సంబంధం లేద‌ని నివేదిక‌లో వెల్ల‌డైంది. మొత్తానికి ధూమ‌పానం అల‌వాటు లేని మ‌హిళ‌ల్లో ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న‌కు దారితీస్తుంది.

అయితే క్యాన్స‌ర్ రిజిస్ట్రీ డేటాతో పాటు.. హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ అండ్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్య‌య‌నంలో ఓ కీల‌క విష‌యం వెల్ల‌డైంది. రోగుల క‌ణజాల న‌మూనాల‌పై అధ్య‌య‌నం చేయ‌గా.. తెలంగాణ‌, ఏపీకి చెందిన రోగుల్లో జ‌న్యు వైవిధ్యాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్య కార‌కాల‌తో పాటు క‌ట్టెల పొయ్యి నుంచి వెలువ‌డే పొగ వ‌ల్ల‌.. శ‌రీరం త‌న స‌హ‌జ సామ‌ర్థ్యాన్ని కోల్పోతుంది. దీని ఫ‌లితంగా తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళ‌ల్లో ధూమ‌పానం చేయ‌కున్నా.. సెల్యూల‌ర్‌ డీఎన్ఏ దెబ్బ‌తిని, క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు.

క్యాన్స‌ర్ పెరుగుద‌ల‌కు కార‌ణాలు ఏంటి..?

మ‌హిళ‌ల్లో ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ పెరుగుద‌ల‌కు ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, గృహ సంబంధిత కాలుష్య కార‌కాలతో పాటు జ‌న్యుప‌ర‌మైన కార‌కాలు కూడా కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని సీనియ‌ర్ ప‌ల్మనాల‌జిస్టులు పేర్కొన్నారు.

క్యాన్స‌ర్ కేసులు పెర‌గ‌డానికి ముఖ్య కార‌ణం.. గృహల నుంచి వెలువ‌డే వాయుకాలుష్యం, ముఖ్యంగా వంట‌గ‌దుల నుంచి వెలువ‌డే కాలుష్యం వంటివి కార‌ణ‌మ‌ని తెలిపారు.

అంతేకాకుండా వాహ‌నాల నుంచే వెలువ‌డే ఉద్గారాలు, ధూళి, పొగలో ఉండే సూక్ష్మ‌కణాలు తీవ్ర‌మైన‌, దీర్ఘ‌కాలిక‌మైన క్యాన్స‌ర్ కార‌కాలుగా ప‌ని చేస్తున్నాయి. ఈ సూక్ష్మ క‌ణాలు ఊపిరితిత్తుల్లోని అల్వియోల‌ర్ శాక్స్‌లోకి లోతుగా చొచ్చుకుపోవ‌డం వ‌ల్ల‌.. ఉత్పరివ‌ర్త‌నం చెంది క్యాన్స‌ర్ కేసుల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

జీవితాంతం ధూమ‌పానానికి దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివ‌సించే వారు కాలుష్యానికి గురై వారి ఊపిరితిత్తుల్లో భారీ న‌ల్ల‌టి కార్బన్ నిక్షేపాలు కనిపిస్తున్నాయ‌ని ప‌ల్మ‌నాల‌జిస్టులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement