త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | వ‌ర్షాలు ఆల‌స్య‌మైనా రైతుల‌కు ఇబ్బందుల్లేకుండా ప్ర‌ణాళిక‌లు : తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు

Tummala Nageswara Rao | వర్షాలు ఆలస్యమైనా, వ‌ర్షాపాతం త‌గ్గినా రైతుల‌కు ఇబ్బందులు క‌లుగ‌కుండా ప్రత్యామ్నాయ పంట‌ల సాగు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు వెల్ల‌డించారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వ‌హించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను వ్యవసాయ శాఖ చేప‌డ‌తున్న చ‌ర్య‌ల‌ను మంత్రి తుమ్మ‌ల వివరించారు.

P

Telangana | Published On Jun 14, 2026, 8.28 pm IST

Tummala Nageswara Rao | వ‌ర్షాలు ఆల‌స్య‌మైనా రైతుల‌కు ఇబ్బందుల్లేకుండా ప్ర‌ణాళిక‌లు : తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు
Advertisement

Tummala Nageswara Rao | వర్షాలు ఆలస్యమైనా, వ‌ర్షాపాతం త‌గ్గినా రైతుల‌కు ఇబ్బందులు క‌లుగ‌కుండా ప్రత్యామ్నాయ పంట‌ల సాగు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు వెల్ల‌డించారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వ‌హించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను వ్యవసాయ శాఖ చేప‌డ‌తున్న చ‌ర్య‌ల‌ను మంత్రి తుమ్మ‌ల వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నెలలోనే వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులతో సమీక్ష నిర్వహించి సమగ్ర ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా నమోదైనా రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. వరి పంటపై అధికంగా ఆధారపడకుండా రైతులను పంటల వైవిధ్యీకరణ వైపు ప్రోత్సహించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.

ఈ ఖరీఫ్ సీజన్‌కు 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా కందులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాల్లో ముందుగానే నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. విత్తనాల కొరత తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎరువుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేయడానికి వ్యవసాయ శాఖ కీలక మార్పులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రబీ సీజన్ అనుభవాల ఆధారంగా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో మెరుగుదలలు చేసినట్లు చెప్పారు. జిల్లా వారీగా డీలర్ల స్టాక్ నిర్వహణ, మండల మ్యాపింగ్ సదుపాయాలతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఎరువుల బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూలై, ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

వర్షపాతం అనిశ్చితి, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు విత్తనాలు, ఎరువుల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు. రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం” అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం వంటి వివరాలు రైతులకు నేరుగా వాట్సాప్ సందేశాల ద్వారా అందుతున్నాయని చెప్పారు. పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పంట సంరక్షణ వంటి అంశాల్లో ఈ సమాచారం కీలకంగా మారిందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మందికి పైగా రైతులకు వాతావరణ సమాచార సందేశాలు పంపించినట్లు మంత్రి తెలిపారు. 71 శాతం డెలివరీ రేటుతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచడం, పంట నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఇటువంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Advertisement
Advertisement