త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri GP Avens Life Sciences | శ్రీ యువ బయోటెక్, శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్‌కు జాతీయ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు

Sri GP Avens Life Sciences | పర్యావరణహిత సాంకేతికత, వ్యవసాయ ఆవిష్కరణల రంగాల్లో కృషి చేస్తున్న శ్రీ యువ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్( Sri GP Avens Life Sciences ) సంస్థలకు జాతీయ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు లభించాయి.

S

Telangana | Published On Oct 8, 2026, 6.04 pm IST

Sri GP Avens Life Sciences | శ్రీ యువ బయోటెక్, శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్‌కు జాతీయ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు
Advertisement

Sri GP Avens Life Sciences | త్రినేత్ర న్యూస్ : పర్యావరణహిత సాంకేతికత, వ్యవసాయ ఆవిష్కరణల రంగాల్లో కృషి చేస్తున్న శ్రీ యువ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్( Sri GP Avens Life Sciences ) సంస్థలకు జాతీయ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు లభించాయి. శ్రీ యువ బయోటెక్‌కు ‘బెస్ట్ గ్రీన్ టెక్నాలజీ అవార్డు’, శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్‌కు ‘బెస్ట్ అగ్రి ఇన్నోవేషన్ అవార్డు’ దక్కాయి.

ఎంఎస్‌ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (MSMECCII) ఆధ్వర్యంలో అక్టోబర్ 7, 2026న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మూడవ జాతీయ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు–2026, లీడర్‌షిప్ సమ్మిట్–2026 కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీ యువ బయోటెక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ పాపతోటి, రెండు సంస్థల సీఈఓ కె. బాల హనుమత్ శ్రీరామ్ కలిసి అవార్డులను స్వీకరించారు.

ఎంఎస్‌ఎంఈసీసీఐఐ చైర్మన్ ఇంద్రజిత్ ఘోష్, ప్రత్యేక అతిథి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు ప్రదీప్ గాంధీ, కాడిలా ఫార్మా మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, క్లిమెడ్ రీసెర్చ్ సొల్యూషన్స్ గౌరవ డైరెక్టర్, అంతర్జాతీయ ఫార్మా వ్యాపార నాయకుడు డాక్టర్ పి.కె. రాజ్‌పుత్, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ (CEE)లో సర్క్యులర్ ఎకానమీ సీనియర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రభ్‌జోత్ సోధి చేతుల మీదుగా సంస్థల ప్రతినిధులు ఈ పురస్కారాలను అందుకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి డాక్టర్ నరేంద్ర కుమార్ పాపతోటి, డాక్టర్ హమీదా బీ పర్యవేక్షణలో మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం థాయ్‌లాండ్‌లోని సురనారీ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధన పూర్తి చేశారు. తన పరిశోధనా అనుభవాన్ని పర్యావరణహిత సాంకేతికతలు, రైతులకు ఉపయోగపడే వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, బోటనీలో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ గాజుల ప్రభాకర్‌తో కలిసి డాక్టర్ నరేంద్ర కుమార్ పాపతోటి మరో స్టార్టప్‌గా శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థకు డాక్టర్ గాజుల ప్రభాకర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా, డాక్టర్ నరేంద్ర కుమార్ పాపతోటి సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు.

మిరప పంటలో తీవ్ర నష్టాన్ని కలిగించే నల్ల తామర పురుగు (బ్లాక్ థ్రిప్స్) నియంత్రణకు శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ వినూత్న సేంద్రీయ పురుగుమందును అభివృద్ధి చేసి, ‘థ్రిప్ క్లియర్’ (Thrip Clear) పేరుతో విడుదల చేసింది. ఈ ఆవిష్కరణకు భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (DBT) నుంచి రూ.50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం లభించింది. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అగ్‌హబ్ (AgHub) ఆమోదం కూడా లభించింది.

ఈ పరిశోధనల కొనసాగింపుగా, బ్లాక్ థ్రిప్స్ నియంత్రణ లక్ష్యంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ‘థ్రిప్ క్లియర్ అల్ట్రా’ (Thrip Clear Ultra)ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు రెండు సంస్థల ద్వారా పర్యావరణహిత కలుపు నివారణ ఉత్పత్తి (హెర్బిసైడ్), ఇతర పంట హానికర పురుగుల నియంత్రణకు ఉపయోగపడే పలు నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

డాక్టర్ నరేంద్ర కుమార్ పాపతోటి, డాక్టర్ గాజుల ప్రభాకర్, కె. బాల హనుమత్ శ్రీరామ్, డాక్టర్ వినీలా సాయి మేగావత్, బి. శ్వేత, కృష్ణ, నవదీప్, దేవికలతో కూడిన బృందం ఈ రెండు సంస్థల ద్వారా పర్యావరణహిత, వినూత్న వ్యవసాయ పరిష్కారాల అభివృద్ధికి కృషి చేస్తోంది. పంటల్లో హానికర పురుగులు, కలుపు మొక్కల నియంత్రణకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడం, రసాయన పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు నూతన సాంకేతిక పరిష్కారాలను అందించడం బృందం ప్రధాన లక్ష్యాలు.

ఈ జాతీయ పురస్కారాలు రెండు సంస్థల పరిశోధన, ఆవిష్కరణల కృషికి గుర్తింపుగా నిలిచాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు తమ పరిశోధనలను రైతులకు ఉపయోగపడే ఉత్పత్తులుగా తీర్చిదిద్దుతూ సాధించిన ఈ విజయం తెలంగాణ పరిశోధన, పారిశ్రామిక సామర్థ్యాన్ని జాతీయ వేదికపై చాటింది.

Advertisement
Advertisement