త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pranay Murder Case Convict Dies | ప్రణయ్ పరువు హత్య కేసు: చర్లపల్లి జైలులో దోషి అబ్దుల్ బారి మృతి

సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు అనుభవిస్తున్న నాలుగో నిందితుడు అబ్దుల్ బారి గుండెపోటుతో జైలులో కన్నుమూశారు.

J

Telangana | Published On Sep 24, 2026, 8.09 pm IST

Pranay Murder Case Convict Dies | ప్రణయ్ పరువు హత్య కేసు: చర్లపల్లి జైలులో దోషి అబ్దుల్ బారి మృతి

సంక్షిప్త సారాంశం

సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏ4 నిందితుడు అబ్దుల్ బారి (52) గురువారం మృతి చెందారు. చర్లపల్లి జైలులో ఉంటూ తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడిన బారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌ను 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్ హత్య చేయగా, ఈ కేసులో 2025 మార్చిలో కోర్టు బారితో సహా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. నిందితుడు అబ్దుల్ బారికి గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరెన్ పాండ్యా హత్య కేసుతో కూడా సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Pranay Murder Case Convict Dies | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణను వణికించిన సంచలన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నాలుగో దోషి (A4) అబ్దుల్ బారి (Abdul Bari) గురువారం చర్లపల్లి జైలులో గుండెపోటుతో కన్నుమూశారు.

గురువారం ఉదయం జైలులో ఉన్న సమయంలో అబ్దుల్ బారికి ఆకస్మికంగా తీవ్రమైన ఛాతి నొప్పి (chest pain) వచ్చింది. అప్రమత్తమైన జైలు అధికారులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ప్రణయ్ హత్య కేసు నేపథ్యం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ కుమార్‌ను 2018 సెప్టెంబర్ 14న ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట అత్యంత కిరాతకంగా నరికి చంపిన విషయం తెలిసిందే. అమృత వర్షిణిని ప్రేమించి వివాహం చేసుకోవడాన్ని సహించలేని ఆమె తండ్రి టి.మారుతీ రావు ఈ హత్యకు సుపారీ కుట్ర పన్నారు.

Pranay Murder Case Convict Abdul Bari Dies in Cherlapally Jail

చార్జ్‌షీట్ ప్రకారం.. మారుతీ రావు.. అబ్దుల్ కరీం ద్వారా అబ్దుల్ బారిని సంప్రదించారు. బారి, అస్గర్ అలీ కలిసి సుపారీ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మను రంగంలోకి దించారు. కోటికి డీల్ కుదుర్చుకుని, ప్రణయ్ అప్పుడు గర్భిణిగా ఉన్న భార్య అమృత, తల్లితో కలిసి ఆసుపత్రి నుంచి వస్తుండగా కిల్లర్ శర్మ మాటువేసి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘోరానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

కోర్టు తీర్పు, ఇతర పరిణామాలు

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీ రావు విచారణ దశలో ఉండగానే 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మిగిలిన నిందితులపై విచారణ కొనసాగింది.

సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ కోర్టు 2025 మార్చి నెలలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో అబ్దుల్ బారితో సహా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించగా, సుపారీ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మకు కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. కాగా, అబ్దుల్ బారికి గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరెన్ పాండ్యా (Haren Pandya) హత్య కేసుతో కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రాగా, ఆ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తాజాగా జైలులో ఆయన గుండెపోటుతో మరణించడం గమనార్హం.

సంచలనాత్మక ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రధాన దోషుల్లో ఒకరైన అబ్దుల్ బారి మృతి చెందడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement