త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagam Janardhan Reddy | ఏదుల నుంచి డిండికి నీళ్లు త‌ర‌లిస్తే.. మ‌రో ఉద్యమం త‌ప్ప‌దు.. రేవంత్ స‌ర్కార్‌కు నాగం హెచ్చ‌రిక‌

Nagam Janardhan Reddy | సాగునీటి విష‌యంలో అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్న పాల‌మూరు జిల్లాకు మ‌రోసారి అన్యాయం చేస్తే మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని మాజీ ఎమ్మెల్యే నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Jun 4, 2026, 8.21 am IST

Nagam Janardhan Reddy | ఏదుల నుంచి డిండికి నీళ్లు త‌ర‌లిస్తే.. మ‌రో ఉద్యమం త‌ప్ప‌దు.. రేవంత్ స‌ర్కార్‌కు నాగం హెచ్చ‌రిక‌
Advertisement

Nagam Janardhan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సాగునీటి విష‌యంలో అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్న పాల‌మూరు జిల్లాకు మ‌రోసారి అన్యాయం చేస్తే మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని మాజీ ఎమ్మెల్యే నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. ఏదుల రిజ‌ర్వాయ‌ర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లు త‌ర‌లించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని నాగం హెచ్చ‌రించారు. సీఎం రేవంత్ రెడ్డి పాల‌మూరు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నాగం జనార్ధ‌న్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్ర‌ధాన కాల్వ‌లు కానీ, పిల్ల కాల్వ‌లు కానీ పంట కాల్వ‌లకు కానీ, డిస్ట్రిబ్యూట‌రీ కెనాల్స్‌కు కానీ భూసేక‌ర‌ణ అత్య‌వ‌స‌రంగా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. సున్న‌పురాళ్ల తండా నుంచి కుడికిళ్ల వ‌ర‌కు మూడున్న‌ర కిలోమీట‌ర్లు 10 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల హార్డ్ సాయిల్ ఉంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేండ్లు దాటిపోయినా ఆ మ‌ట్టిని తీయ‌లేదు. ఈ మ‌ట్టిని గ‌తేడాది తీసి ఉంటే కొన్ని రిజ‌ర్వాయ‌ర్లు అయినా నీటితో నింపుకునే అవ‌కాశం ఉండేది అని ఆయ‌న అన్నారు.

ప్రాజెక్టుల న‌త్త‌న‌డ‌క‌కు మంత్రి జూప‌ల్లే కార‌ణం..

నార్లాపూర్ వ‌ద్ద చేప‌ట్టిన‌ మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పనుల సమీపంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను చేపట్టడం ద్వారా భారీగా న‌ష్టం వాటిల్లింది. ప్రాజెక్టుల నత్త‌నడకకు మంత్రి జూపల్లి కారణం. ముఖ్యమంత్రి పర్యటన సంద‌ర్భంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఐదు మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసే విధంగా ఒప్పించాలి అని నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

మంత్రి ఉత్త‌మ్‌ను హెచ్చ‌రిస్తున్నా.. మా నీళ్ల‌ను త‌ర‌లించుకుపోతే ఎలా..?

మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని హెచ్చ‌రిస్తున్నా.. నీ ఒక్క జిల్లా, నీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గం బాగుప‌డితే తెలంగాణ బాగుప‌డ‌దు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 36 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి సాగుకు అనుకూలంగా ఉంది. ప్ర‌స్తుతం ఏడెనిమిది ల‌క్ష‌ల ఎక‌రాల‌కు కూడా నీళ్లు పార‌డం లేదు. అదే న‌ల్ల‌గొండ‌లో 17 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి సాగుకు అనుకూలంగా ఉంది.. ఇందులో ప‌ద్నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంది. మీరు ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ద్వారా నీళ్లు తీసుకోండి. మా నీళ్ల‌ను ఎందుకు త‌ర‌లించుకుపోతున్న‌రు. న‌ల్ల‌గొండ‌కు నీళ్లు త‌ర‌లించుకుపోతుంటే మాకు అన్యాయం జ‌రుగుతుద‌ని ఒక్క ఎమ్మెల్యే అయినా నోరు తెరుస్తున్నాడా..? ఇంత అస‌మ‌ర్థ నాయ‌కులు ఉంటే ఎలా..? అని నాగం ధ్వ‌జ‌మెత్తారు.

అవ‌గాహ‌న లేక‌పోతే ఎలా..? కాంట్రాక్ట‌ర్ల కోసం ప‌నులు చేప‌ట్టొద్దు

నేను హెచ్చ‌రిస్తున్నా.. అవ‌స‌ర‌మైతే ఉద్య‌మం చేప‌డుతా.. ఏదుల నుంచి డిండి రిజ‌ర్వాయ‌ర్‌కు నీళ్లు త‌ర‌లించ‌డం ఆపాలి. వ‌ట్టెం ద‌గ్గ‌ర తూము విడిచిపెడితే నేరుగా డిండిలో ప‌డుతయ్ నీళ్లు. ఇది కూడా మీకు అవ‌గాహ‌న లేక‌పోతే ఎలా..? కాంట్రాక్ట‌ర్ల కోసం ప‌నులు చేప‌ట్టి పాల‌మూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేయొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నా అని నాగం తేల్చిచెప్పారు.

భూములు కోల్పోయిన బాధ లేదు.. కానీ క‌చ్చితంగా అడ్డంకి సృష్టిస్తాం..

మేం కూడా క‌ల్వ‌కుర్తి, పాల‌మూరు ఎత్తిపోత‌ల కింద భూములు కోల్పోయాం. మేం డాక్ట‌ర్లు అయినం.. వ్య‌వ‌సాయాన్ని వ‌దిలిపెట్టినం. భూములు కోల్పోయినందుకు బాధ ప‌డుత‌లేం. ఎంత ఇస్తున్నార‌న్న‌ది మాకు ముఖ్యం కాదు. ప్రాజెక్టు పూర్త‌యి సాగునీళ్లు రావాల‌ని మేం ఏ అడ్డంకి సృష్టించ‌లేదు. కానీ ఏదుల నుంచి డిండికి నీళ్లు త‌ర‌లిస్తే క‌చ్చితంగా అడ్డంకి సృష్టిస్తాం. సొంత లాభం కోసం చూసుకోవ‌ద్దు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారు. క‌ల్వ‌కుర్తి, పాల‌మూరు ప్రాజెక్టులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలి.. భూములు కోల్పోయిన రైతుల‌కు స‌రైన ధ‌ర క‌ట్టించాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement