త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ముక్కోటి ఏకాదశి నాటికి “భద్రాద్రి”ని సిద్ధం చేస్తాం

Ponguleti Srinivas Reddy | భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

S

Telangana | Published On Nov 25, 2026, 6.47 pm IST

Ponguleti Srinivas Reddy | ముక్కోటి ఏకాదశి నాటికి “భద్రాద్రి”ని సిద్ధం చేస్తాం
Advertisement

భవిష్యత్ తరాలకు ఆదర్శంగా దేవస్థాన అభివృద్ధి పనులు
మరో 200 ఏళ్ళు నిలిచేలా రూ. 300 కోట్లతో శాశ్వత నిర్మాణాలు
కేబినెట్ సబ్ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన
అభివృద్ధి పనుల పరిశీలించిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

బుధవారం భద్రాచలం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన రాతి కట్టడాల నిర్మాణ పనులకు మంత్రి పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా భక్తుల ఆకాంక్షలకు మించి భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. పుష్కరాల అభివృద్ధి పనుల కోసం వివిధ శాఖల ద్వారా ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

భద్రాచలం రామాలయ అభివృద్ధికి సుమారు రూ.300 కోట్ల మేర నిధులు కేటాయించామని, అవసరమైన అదనపు నిధులు కూడా సమకూరుస్తామని తెలిపారు. ఆలయ రాతి కట్టడాలు భవిష్యత్ తరాలకు శాశ్వత ఆస్తిగా నిలిచేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. డిసెంబర్ 19న జరగనున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం నూతన మార్కెట్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్ కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రంగనాయకుల గుట్ట వద్ద రూ.5.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా భూస్థాయి నీటి నిల్వ ట్యాంకు (జీఎల్ఎస్ఆర్) నిర్మాణం, బోర్‌వెల్స్, పంపుసెట్లు, పైప్‌లైన్ల ఏర్పాటు, భద్రాచలం ఘాట్ వద్ద శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈఓ దామోదర్ రావు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement