Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
సంక్షిప్త సారాంశం
Jupally Krishna Rao | ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా, సాగునీటి అధికారుల ప్రణాళిక మేరకే జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీటి నిర్వహణ జరుగుతోందని స్పష్టం చేశారు.
నీళ్లపై బీఆర్ఎస్‌ది రాజకీయ డ్రామా
రాజకీయ పబ్బం గడుపుకునేందుకే హంగు ఆర్భాటాలు
నీటి విడుదలపై ముందే హంగామా చేసి
క్రెడిట్ కొట్టేయాలనేది బీఆర్ఎస్ ఎత్తుగడ
పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం..
రైతులు ఆందోళన చెందొద్దు
మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్ : ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా, సాగునీటి అధికారుల ప్రణాళిక మేరకే జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీటి నిర్వహణ జరుగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకే ఆ పార్టీ నేతలు ప్రాజెక్టుల వద్ద హంగామా చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. శుక్రవారం సచివాలయం మీడియా సెంటర్‌లో ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఈఎన్సీ (జనరల్) రమేష్‌బాబు, సీఈ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరుగుతోందని, వచ్చిన నీటికి అనుగుణంగా సాగునీటి అధికారులు ప్రణాళిక ప్రకారం విడుదల చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ విషయం ముందే తెలిసిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల వద్ద హంగామా, ఆర్భాటాలు, డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు నీళ్లు విడుదల చేసిన వెంటనే అది తమ ఒత్తిడితో జరిగిందని ప్రచారం చేసుకోవడానికే ఈ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్
పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి, పాలమూరు జిల్లా అల్లుడు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. వారి సారథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులను పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు.
పాలమూరు ఎత్తిపోతలను ఎందుకు విస్మరించింది..
కల్వకుర్తి కింద అదనంగా 25 టీఎంసీల నీటిని అందించే ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పనులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పంపులు, మోటార్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌పై గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు విస్మరించిందని విమర్శించారు. భీమా ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. జూరాలకు 50 టీఎంసీల వినియోగానికి అవసరమైన రిజర్వాయర్లు, గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేసిందని ప్రశ్నించారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం
తెలంగాణ నీటి హక్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం "అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు" ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసిందని మంత్రి ధ్వజమెత్తారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు అధిక వాటా సాధించుకునే అవకాశాన్ని వదులుకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీల హక్కులు కల్పించే పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతోందని, కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతామని స్పష్టం చేశారు.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిందే కాంగ్రెస్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు. పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అనేక ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు ఇవ్వకుండా, టెండర్లు పిలవకుండా, పనులు ప్రారంభించకుండా కాలయాపన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి
ఎల్‌నినో ప్రభావం ఉన్నందున అధికారులు సూచిస్తున్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు మంత్రి సూచించారు. పంట కొనుగోలు, బోనస్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు
రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌కు డెడ్‌లైన్ విధించి అధికారానికి దూరం చేశారని, ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రాజకీయ గప్పాలు చెప్పడం తప్ప పాలన తెలియదని, తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసి రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. పాలమూరు జిల్లా రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ
- ●HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..
- ●'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు

CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..

'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?




