త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sushila Rani’s Surrender | చ‌రమాంకానికి మావోల పోరు.. లొంగిపోయిన మ‌రో కీల‌క నాయ‌కురాలు

Sushila Rani’s Surrender | మావోయిస్టు పార్టీ పోరాటం చ‌ర‌మాంకానికి చేరుకుంది. తాజాగా ఆ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. అబూజ్‌మడ్ డివిజన్ కమిటీ సభ్యురాలు, అత్యంత సీనియర్ నాయ‌కురాలు నక్కా సుశీల రాణి అలియాస్ లత నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఎదుట లొంగిపోయారు.

S

Telangana | Published On Sep 15, 2026, 7.12 pm IST

Sushila Rani’s Surrender | చ‌రమాంకానికి మావోల పోరు.. లొంగిపోయిన మ‌రో కీల‌క నాయ‌కురాలు
Advertisement

Sushila Rani’s Surrender | త్రినేత్ర‌.న్యూస్‌: మావోయిస్టు పార్టీ పోరాటం చ‌ర‌మాంకానికి చేరుకుంది. తాజాగా ఆ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. 34 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గ‌డిపిన‌ అబూజ్‌మడ్ డివిజన్ కమిటీ సభ్యురాలు, అత్యంత సీనియర్ నాయ‌కురాలు నక్కా సుశీల రాణి అలియాస్ లత నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఎదుట లొంగిపోయారు. ఆమెతో పాటు లలిత, రేలా, జ్యోతి లొంగిపోయిన‌ట్లు సీపీ తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సుశీల రాణికి రూ.5 లక్షల చెక్కు, రూ.25వేల తక్షణ ఆర్థిక సాయం అందించిన‌ట్లు పేర్కొన్నారు.

ఇదీ సుశీల నేప‌థ్యం..

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని శక్కర్‌నగర్‌కు చెందిన సుశీల రాణి 1992లో సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్‌లో చేరారు. అప్పటి నుంచి సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్‌ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ (EDC) సభ్యురాలిగా, డివిజన్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1995 వరకు పార్టీ సాంకేతిక విభాగంలో పనిచేశారు. 1995 నుంచి 2002 వరకు పలు దళాల్లో బాధ్యతలు చేపట్టారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 266 మంది అజ్ఞాత సీపీఐ (మావోయిస్టు) కేడర్లు లొంగిపోయారు. ఇందులో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు, సభ్యులు, 94 మంది ఏరియా కమిటీ కార్యదర్శులు, సభ్యులు, 131 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మిగిలింది ముగ్గురే..

ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి (పీబీఎం - సీపీఐ మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి), జడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు (డీకేఎస్‌జెడ్‌సీఎం) అనే ముగ్గురు మాత్రమే తెలంగాణకు వెలుపల మావోయిస్టు పార్టీ వివిధ నిర్మాణాల్లో అజ్ఞాతంగా పనిచేస్తున్నట్లు పోలీసు వ‌ర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణకు చెందిన అజ్ఞాతంలో ఉన్న‌వారంతా హింసాత్మక మార్గాలను వీడి జనజీవన స్రవంతిలో చేరాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం ద్వారా అందించే ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌, జిల్లా పోలీసుల సమ‌ష్టి కృషి, నిఘా వ్యవస్థ బలోపేతం, పునరావాస విధానంపై పెరుగుతున్న విశ్వాసం కారణంగానే ఈ స్థాయిలో లొంగుబాట్లు చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement