త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Eatala Rajender | కంటోన్మెంట్ సీఈఓపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం

MP Eatala Rajender | కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనితీరుపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్( Eatala rajender ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్( Cantonment ) ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రి సేవలు, కాంట్రాక్టుల వ్యవహారంలో సీఈఓ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Nov 27, 2026, 3.26 pm IST

MP Eatala Rajender | కంటోన్మెంట్ సీఈఓపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం
Advertisement

అధికారుల తీరుతో ప్రజలకు ఇబ్బందులు
కేంద్ర రక్షణ మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం
అలహాబాద్ నుంచి శానిటేషన్ కాంట్రాక్టర్‌ను తీసుకురావడంపై అభ్యంతరం

MP Eatala Rajender | త్రినేత్ర న్యూస్ : కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనితీరుపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్( Eatala rajender ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్( Cantonment ) ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రి సేవలు, కాంట్రాక్టుల వ్యవహారంలో సీఈఓ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పనితీరుపై కేంద్ర రక్షణ మంత్రి సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను 26 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎంతోమంది అధికారులు, ప్రభుత్వ వ్యవస్థల పనితీరును చూశానని పేర్కొన్నారు. ప్రస్తుత సీఈఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పనితీరును గమనిస్తున్నానని, మార్పు వస్తుందని ఎదురుచూసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని నిప్పులు చెరిగారు.

పారిశుద్ధ్య కార్మికుల తగ్గింపుపై అభ్యంతరం

డబ్బులు ఆదా అవుతున్నాయనే కారణంతో చెత్త సేకరించే కార్మికులు, స్కావెంజర్ల సంఖ్యను తగ్గించడం సరికాదని ఈటల అన్నారు. దీనివల్ల పారిశుద్ధ్య నిర్వహణ దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కంటోన్మెంట్‌లోని ఆసుపత్రిలో వైద్య పరికరాలు పనిచేయడం లేదని, సిబ్బందిని తొలగించడంతో పాటు వారికి జీతాలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు.

అలహాబాద్ కాంట్రాక్టర్‌పై ప్రశ్నలు

చెత్త తొలగింపు వంటి చిన్న టెండర్లను కూడా స్థానికులకు కాకుండా అలహాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించడంపై ఈటల అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎల్-1గా నిలిచిన కాంట్రాక్టర్‌పై వివిధ నిబంధనలు విధించి తొలగించి, కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం

బోర్డు సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున పలుమార్లు సీఈఓకు సూచనలు చేసినప్పటికీ ఆయన పనితీరులో మార్పు రాలేదని ఈటల పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ బోర్డు సభ్యుల సూచనలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

అధికారులపై ఫిర్యాదు చేయడం తమకు ఇష్టం లేకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో అది అనివార్యంగా మారిందన్నారు. కంటోన్మెంట్ సీఈఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు, ఆయన పనితీరుపై కేంద్ర రక్షణ మంత్రి నుంచి సంబంధిత ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement